ప్రాణం ఉన్నంత వరకు చదువుతా
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రముఖ మానసిక వైద్యుడు, డాక్టర్ బీసీ రాయ్ పురస్కార గ్రహీత డాక్టర్ కర్రి రామారెడ్డి నిరంతర విద్యాప్రయాణానికి ప్రేరణగా నిలుస్తూ, మరో విశిష్ట మైలురాయి చేరుకున్నారు. తాజాగా 13 కోర్సులు పూర్తిచేసి, అందులో ఆరింటిలో టాపర్స్‌లో ఒకరిగా నిలిచారు. ఈ సందర్భంగా స్థానిక దానవాయిపేటలోని మానస ఆసుపత్రిలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి ఆ వివరాలను వెల్లడించారు. దీనికి మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్, ఆర్‌ఆర్‌ఎస్ ప్రాంత కార్యకారిణి ఓలేటి సత్యనారాయణ, ఐఎంఏ నగర అధ్యక్షుడు డాక్టర్ గురుప్రసాద్ హాజరయ్యారు. డాక్టర్ రామారెడ్డి మాట్లాడుతూ ఒకే సెమిస్టర్‌లో జూలై నుంచి డిసెంబరు 2024లో 11 ఎన్‌పీటీఈఎల్ కోర్సులు, దాంతో పాటు రెండు ఎన్‌పీటీఈఎకల్ ప్లస్ కోర్సులు కూడా కలిపి 13 కోర్సులు ఒక్కసారే చేశానన్నారు. ఈ 11 ఎన్‌పీటీఈఎల్ కోర్సుల్లో ఆరింటిలో టాపర్లలో ఒకడిగా నిలవడం ఆనందంగా ఉందన్నారు. ఒకే సెమిస్టర్‌లో ఏదైనా మూడు కోర్సులకు టాపర్‌గా వస్తే ఎన్‌పీటీఈఎల్ సూపర్ స్టార్ విభాగంలో చేరుస్తారని, ఆరు కోర్సులలో టాపర్‌గా వచ్చి ఆ కేటగిరీకి అర్హత సంపాదించానని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇలా అన్ని కోర్సులు కూడా ప్రథమశ్రేణికి, డిస్టింక్షన్‌కి సమానం అని, వీటిలో 90 శాతం పైగా మార్కులు సాధించడం ఆనందంగా ఉందన్నారు. ఎన్‌పీటీఈఎల్ అంటే ఐఐటీల సముదాయమని, 11 రెగ్యులర్ ఎన్‌పీటీఈఎల్ కోర్సులలో 4 కాన్పూర్ ఐఐటీలో, 3 రూర్కీ ఐఐటిలో, 2 మద్రాస్ ఐఐటీలో పూర్తిచేశానన్నారు. ఈ పరీక్షలన్నీ రాజీవ్ గాంధీ కాలేజీ కేంద్రంలో రాశానని, దీనికిగాను కళాశాల అధినేత హర్షకుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రూర్కీ ఐఐటీలో, కాన్పూర్ ఐఐటీలో ఒక్కొక్కటి చొప్పున రెండు ఎన్‌పీటీఈఎల్ ప్లస్ కోర్సులు పూర్తి చేశానన్నారు. ఈ సరికొత్త విజయంతో పాటు ఇప్పటికే సాధించిన కోర్సులు, డాక్టరేట్లు, పీజీలు, డిగ్రీలు, డిప్లమాల సర్టిఫికెట్లు అన్నీ కలిపి 50 పూర్తయ్యాయన్నారు. ఇందులో ఏ ఒక్కటి కూడా హానరరీ డిగ్రీ, ఫెలోషిప్, పదవి వల్ల వచ్చినవి మాత్రం కాదని డాక్టర్ రామారెడ్డి స్పష్టం చేశారు. ఊపిరి ఉన్నంతవరకు నా విద్యా ప్రస్థానం కొనసాగుతూనే ఉంటుందని డాక్టర్ రామారెడ్డి అన్నారు. మాజీ ఎంపీ హర్ష కుమార్ మాట్లాడుతూ ఒకే రంగంలో డిగ్రీలు చేయడం చూస్తుంటామని, ఒకదానికి ఒకటి సంబంధమే లేకుండా డాక్టర్ రామారెడ్డి చేస్తున్న డిగ్రీలు మామూలు విషయం కాదన్నారు. ఇటువంటి వ్యక్తి మన రాజమండ్రికి చెందడం మనందరికీ గర్వకారణమన్నారు. డాక్టర్ గురు ప్రసాద్ మాట్లాడుతూ చిన్నతనం నుంచి రామారెడ్డి విజయాలను చూసి ఎదిగానని , ఇలాంటి వ్యక్తి ఇక్కడ ఉండడం అందరికీ గర్వకారణమన్నారు.
కొత్తగా 13 కోర్సులు పూర్తిచేసి ఆరింటిలో టాపర్‌గా నిలిచిన డాక్టర్ రామారెడ్డి
50 డిగ్రీలు పూర్తి చేసిన నిత్య విద్యార్థికి పలువురి అభినందన
Comments
Please login to add a commentAdd a comment