సివిల్స్ ఉచిత శిక్షణకు 27న స్క్రీనింగ్ పరీక్ష
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సంచాలకుల ఆదేశాల మేరకు స్థానిక వెనుకబడిన తరగతుల అధ్యయన కేంద్రంలో నవంబర్ 27 స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు కేఎన్ జ్యోతి సోమవారం తెలిపారు. ఉమ్మడి తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని ఆరు జిల్లాలకు చెందిన దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు స్క్రీనింగ్ పరీక్షలకు హాజరు కావాలని పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించనున్న ‘సివిల్స్‘ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకున్న ఉమ్మడి జిల్లాలకు చెందిన అభ్యర్థులందరూ స్క్రీనింగ్ పరీక్షకు హాజరు కావాలన్నారు. రాజమహేంద్రవరంలోని బీసీ స్టడీ సర్కిల్‌లో ఈ నెల 27న స్క్రీనింగ్ పరీక్షకు హాజరు కావాలని ఆమె సూచించారు.
లారీని ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు
నల్లజర్ల: ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొంది. డ్రైవర్‌తో సహా పలువురికి గాయాలయ్యాయి. గుంటూరు నుంచి విశాఖ 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ బస్సు సోమవారం తెల్లవారుఝూమున అనంతపల్లి–వీరవల్లి టోల్‌ప్లాజా మధ్య ఏలూరు నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో బస్సు డ్రైవరు కుంబరుకుంట రవిచంద్రప్రకాష్ ఎడమ కాలుకు తీవ్రగాయం కావడంతో అతనిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్వల్పగాయాలైన తొమ్మిది మంది ప్రయాణికులను ఏలూరు, రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రులకు హైవే అంబులెన్స్‌లో తరలించారు. మంచుకురవడంతో ఎదుట ఉన్న వాహనం కనపడక పోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సోమరాజు తెలిపారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
తొండంగి: అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై జగన్మోహన్‌రావు సోమవారం తెలిపారు. శృంగవృక్షం గ్రామానికి చెందిన బోయిడి బాబూరావు(31) అప్పుల కారణంగా ఆదివారం పొలంలో పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు తునిలో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కాకినాడ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment