అన్నవరం దేవస్థానం ఇన్‌చార్జి ఈఓగా త్రినాథరావు
దేవదాయశాఖ అడిషనల్ కమిషనర్‌గా రామచంద్రమోహన్ కొనసాగింపు
అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఇన్‌చార్జి ఈఓ (ఫుల్ అడిషనల్ చార్జి)గా సింహాచలం దేవస్థానం ఈఓ వీ త్రినాఽథరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం దేవస్థానం ఇన్‌చార్జి ఈఓగా పనిచేస్తున్న దేవదాయ, ధర్మాదాయశాఖ అడిషనల్ కమిషనర్ కె.రామచంద్రమోహన్‌ను ఆ బాధ్యతల నుంచి తొలగించారు. దేవదాయ, ధర్మదాయశాఖ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్‌గా విధులు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు ఇన్‌చార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ ఎస్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇన్‌చార్జి ఈఓగా నియమితులైన వి.త్రినాథరావు 2018 డిసెంబర్ 31 నుంచి 2019 ఏప్రిల్ నాలుగో తేదీ వరకు, 2019 ఆగస్టు 25 నుంచి నుంచి 2022 జూలై రెండోతేదీ వరకు అన్నవరం దేవస్థానం ఈఓ గా పనిచేశారు. ఆ తరువాత ద్వారకాతిరుమల దేవస్థానం ఈఓగా బదిలీ అయ్యారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో సింహచలం దేవస్థానం ఈఓగా నియమితులయ్యారు. మూడోసారి అన్నవరం దేవస్థానం (ఇన్‌చార్జి) ఈఓగా నియమితులయ్యారు.
గతంలోనే కోరిన రామచంద్రమోహన్
కమిషనర్ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న తనను అన్నవరం దేవస్థానం ఈఓ బాధ్యతల నుంచి తప్పించాలని రామచంద్రమోహన్ చాలాకాలంగా కోరుతున్నారు. దేవదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో ఆ శాఖకు సంబంధించిన పాలనా పరమైన బాధ్యతలన్నీ ఆయనే నిర్వహిస్తున్నారు. వారానికి నాలుగు రోజులు విజయవాడలో, రెండు రోజులు అన్నవరం దేవస్థానంలో ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కార్తికమాస ఏర్పాట్లకు అనుభవజు్‌క్షడైన అధికారి ఉండాలన్న అభిప్రాయంతో ఆయనను రెండు పోస్టులలోను కొనసాగించారు. కార్తికమాస నాలుగో సోమవారం హడావుడి కూడా ముగియడంతో మిగిలిన ఆరు రోజులు భక్తులు ఒక మాదిరిగా మాత్రమే ఉంటారు. ఆ కారణంగా రామచంద్రమోహన్‌ను అన్నవరం బాధ్యతల నుంచి తప్పించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మంగళగిరి పానకాల స్వామి ఆలయం అభివృద్ధి అధికారిగా ?
మంగళగిరిలోని ప్రముఖ దేవస్థానమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి (పానకాల స్వామి) దేవాలయాన్ని యాదగిరి గుట్ట ఆలయ స్థాయిలో అభివృద్ది చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, దానికి ప్రత్యేక అధికారిగా రామచంద్రమోహన్ ను నియమించనున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment