రబీ పైనే ఆశలు
దేవరపల్లి: జిల్లాలో ఖరీఫ్‌లో ఆశించిన దిగుబడుల రాక నష్టపోయిన రైతులు రబీపైనే ఆశలు పెట్టుకుని వరి సాగులో తనమునకలై ఉన్నారు. బోర్లు, కాలువలు, సాగునీటి చెరువుల కింద పోసిన ఆకుమడులు సిద్ధం కావడంతో నాట్లు వేస్తున్నారు. రెండు వారాలుగా వరినాట్లు సాగుతున్నాయి. సార్వాలో వేసిన వరిపంటకు మంచి ధర లభించినప్పటికి దిగుబడులు తగ్గడంతో రైతులకు పంట లాభసాటిగా లేకుండా పోయింది. సార్వాలో నాట్లు వేసిన కొద్దిరోజులకు అధికవర్షాలు కురవడంతో పల్లపు ప్రాంతాలు, కాలువలు, చెరువుల కింద వేసినవి దెబ్బతిన్నాయి. దీంతో చాలామంది రైతులు మళ్లీ నాట్లు వేయవలసి వచ్చింది. అప్పటికే ఎకరాకు సుమారు రూ.10 వేల నుంచి రూ.15 వేలు ఖర్చు కావడంతో రైతులు నష్టపోయారు. రెండవసారి వేసిన నాట్లు ఆలస్యం కావడంతో దిగుబడులు ఆశించినంతగా రాలేదు. ఎకరాకు 30 నుంచి 32 బస్తాల దిగుబడి వచ్చినప్పటికీ పెట్టుబడులు ఎక్కువ కావడం, దిగుబడులు తగ్గడంతో నికర ఆదాయం తగ్గింది. దేవరపల్లి, గోపాలపురం మండలాల్లో కొవ్వాడ కాలువ ముంపునకు, నల్లజర్ల, నిడదవోలు మండలాల్లో ఎర్రకాలువ ముంపునకు పంట దెబ్బతింది. దీంతో రబీలో దాళ్వా పంటపై రైతులు ఆశలు పెట్టుకుని సాగు చేస్తున్నారు. దాళ్వాలో ఎకరాకు 50 నుంచి 55 బస్తాల దిగుబడి సాధిస్తున్నారు.
అధిక దిగుబడులు వచ్చే వంగడాల సాగు
దాళ్వాలో అధిక దిగుబడులు వస్తున్న వంగడాలను రైతులు సాగు చేస్తున్నారు. ఎంటీయూ 1121, 1153, 1156 వంగడాలు అధిక దిగుబడులు ఇస్తున్నాయి. వీటిలో ఎంటీయూ 1121 వంగడాన్ని రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ వంగడాల పంట కాల పరిమితి 117 నుంచి 120 రోజులు ఉంటుంది. ఎకరాకు 50 నుంచి 55 బస్తాల దిగుబడి వస్తుంది. ప్రభుత్వం సొసైటీలు, ప్రయివేటు డీలర్ల ద్వారా విత్తనాలను సరఫరా చేస్తోంది. ఎక్కువగా రైతుల నుంచి రైతులు వరి విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు.
2,224 హెక్టార్లలో వరినాట్లు
2024–25 సంవత్సరం పంట కాలానికి రబీలో జిల్లాలోని 18 మండలాల్లో సాధారణ వరిసాగు విస్తీర్ణం 60,042 హెక్టార్లు కాగా, ఇప్పటి వరకు 2,224 హెక్టార్లలో నాట్లు వేశారు. మెట్ట ప్రాంతంలో బోర్లు, డెల్టా ప్రాంతంలో కాలువల కింద ఆయకట్టు భూముల్లో వరినాట్లు జరుగుతున్నాయి. 3,002 హెక్టార్లలో నారు మడి అవసరం కాగా, 954 హెక్టార్లలో నారుమడులు సిద్ధంగా ఉన్నాయి.
ఎరువుల కొరత లేదు
రైతులకు కావలసిన ఎరువులు అందుబాటులో ఉన్నాయి. దాళ్వా సీజన్‌లో వరి, ఇతర పంటలకు 1.10 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా, ప్రస్తుతం 22,497 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో యూరియా 8,300, కాంప్లెక్స్ ఎరువులు 7,800, సూపర్ 2,100, పొటాష్ 2,100 , డీఏపీ 928 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయి. ఎక్కడైనా ఎక్కువగా కావాలంటే 24 గంటల్లో సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేశాం.
– ఎస్.మాధవరావు,
జిల్లా వ్యవసాయాధికారి, రాజమహేంద్రవరం
వరి నాట్లు ప్రారంభం
సాధారణ సాగు 60,042 హెక్టార్లు
పడిన నాట్ల విస్తీర్ణం 2,224 హెక్టార్లు
3,002 హెక్టార్లలో నారుమడులు
22,497 మెట్రిక్ టన్నుల
ఎరువులు సిద్ధం
Comments
Please login to add a commentAdd a comment