ఇదేం తిరకేసు?
మాఫియా చేష్టలతో చెడ్డ పేరు!
బోట్స్‌మెన్ సొసైటీల పేరుతో ఇసుక మాఫియా చేస్తున్న అక్రమాలతో తమకు చెడ్డపేరు వస్తోందని బోట్స్‌మెన్ సొసైటీ సభ్యులు ఆవేదన చెందుతున్నట్లు తెలిసింది. తమ పేరు చెప్పుకుని ఇసుక అక్రమంగా తరలించి రూ.కోట్లు గడిస్తున్న కాంట్రాక్టర్లు తమకు మాత్రం ప్రభుత్వం నిర్దేశించిన ధరలు మాత్రమే చెల్లిస్తున్నారని వాపోతున్నారు. ఈ విషయమై ఇటీవల సమావేశమై భవిష్యత్తులో ఏం చేద్దామని చర్చించినట్లు సమాచారం.
సాక్షి, రాజమహేంద్రవరం: ఇసుక మాఫియాపై తిరుగుబాటు మొదలైందా? మాఫియా వ్యవహరిస్తున్న తీరు బోట్స్‌మెన్ సొసైటీలకు మింగుడు పడటం లేదా? అనధికారిక డ్రెడ్జింగ్ చేసి రూ.లక్షలు గడిస్తున్న ముఠా సభ్యులు.. కేసులు వచ్చే సరికి తమకే సంబంధం లేదని చేతులేత్తేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల కోటిలింగాల ర్యాంపులో చోటు చేసుకున్న పరిణామాలు ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
కొల్లగొట్టేస్తున్నారు
రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో కోటిలింగాల ర్యాంపును 14 విభాగాలుగా విభజించారు. కోటిలింగాల–1 ర్యాంప్ బోట్స్‌మెన్ సొసైటీలకు మాత్రమే కేటాయించాలన్న డిమాండ్‌తో కోర్టులో వ్యవహారం నడుస్తోంది. కోటిలింగాల–2 నుంచి గామన్ వంతెన వరకు 14 ర్యాంపులు నడుస్తున్నాయి. ర్యాంపుల నిర్వహణకు బోట్స్‌మెన్ సొసైటీలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. సంప్రదాయ పడవలతో ఇసుక తీత నిర్వహించేలా ఉత్తర్వులు వెలువరించింది. అయితే ఇక్కడ మాత్రం వ్యవహారం అందుకు విరుద్ధంగా సాగుతోంది. సొసైటీల ముసుగులో కూటమి నేతలు రంగంలోకి దిగారు. ఒక్కో ర్యాంపును ఒక్కో కూటమి నేత పంచుకున్నారు. అక్కడ తమ అవినీతి సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలోకి తొక్కారు. డ్రెడ్జింగ్ బోట్లతో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలకు నాంది పలికారు. రాత్రిళ్లు తవ్వకాలు నిషేధమైనా అదేమీ పట్టనట్లు రాత్రంతా తవ్వకాలు చేపడుతూ రూ.లక్షలు దండుకుంటున్నారు. కోటిలింగాల–2 నుంచి 4వ బ్రిడ్జి వరకు ఉన్న 14 ర్యాంపుల్లో రోజుకు 500లకు పైగా లారీల ఇసుక జిల్లా దాటుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కో లారీ రూ.25,000కు విక్రయిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే రోజుకు రూ.1.25 కోట్లు విలువ చేసే ఇసుకను కూటమి నేతల ముఠా కొల్లగొట్టేస్తున్నట్లు లెక్క. లారీల్లో ఇసుక బహిరంగంగా తరలుతున్నా మైనింగ్, జిల్లా అధికార యంత్రాంగం కళ్లప్పగించి చూడటమే తప్ప అడ్డుకుంటున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. ప్రభుత్వ అనుమతులు లేకుండా యంత్రాలతో తవ్వుతున్నా.. ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోందని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. కాదూ కూడదని అధికారులు దాడులు చేస్తే కూటమి ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో ఫోన్లు చేయిస్తున్నారు. చేసేది లేక అధికారులు సైతం మిన్నకుండిపోతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారం అండతో కూటమి నేతలు మరింతగా రెచ్చిపోతున్నారు. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా ఇసుకను కొల్లగొట్టేస్తున్నారు. ర్యాంపులను గుల్ల చేస్తూ రూ.కోట్లు దండుకుంటున్నారు.
అండగా ఉంటామని తప్పుకుంటారా?
కోటిలింగాల రేవులో 18 బోట్లను అధికారులు పట్టుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన కోటిలింగాల రేవులోని ఓ ఇసుకాసురుడు మీరేమీ అధైర్య పడాల్సిన అవసరం లేదని, కేసులు నమోదు చేయకుండా తాను చూసుకుంటానని భరోసా ఇచ్చాడు. తనకు ప్రభుత్వ పెద్దల అండ ఉందని నమ్మబలికాడు. ఇంకేముందిలే తాము కేసుల నుంచి గట్టెక్కినట్లేనని బోట్స్‌మెన్ సొసైటీ సభ్యులు భావించారు . చివరికి అధికారులు కేసులు నమోదు చేయడంతో అవాక్కయ్యారు. ఇదేమని సదరు ఇసుకారుడిని ప్రశ్నిస్తే తానేమీ చేయలేనంటూ తప్పుకున్నట్లు తెలిసింది.
అతనే పట్టించాడా?
కోటిలింగాల రేవులో ఇసుక డ్రెడ్జింగ్ నిరాటంకంగా జరుగుతోందన్న విషయం పత్రికల ద్వారా బహిర్గతమైంది. దీనిపై జిల్లా కలెక్టర్ సైతం తీవ్రంగా పరిగణించారు. ఇలాగే కొనసాగితే ఇసుక ర్యాంప్ తన నుంచి ఎక్కడ చేజారుతుందోనన్న భయంతో కోలిలింగాల–2 ర్యాంపులోని ఓ ఇసుక మాఫియా బాధ్యుడు అధికారుల అండతో బోట్స్‌మెన్ సొసైటీ బోట్లను పట్టుకునేలా కథ నడిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తద్వారా తనపై వస్తున్న ఆరోపణలను పక్కదోవ పట్టించేందుకు ఇదంతా చేసినట్లు విమర్శలున్నాయి.
కాసులు మీకు.. కేసులు మాకా?
ఇసుక మాఫియా సభ్యులపై
బోట్స్‌మెన్ సొసైటీ సభ్యుల తిరుగుబాటు
కోటిలింగాల ర్యాంప్‌లో 20 బోట్స్‌మెన్ సొసైటీ బోట్లపై కేసులు
కేసులు పెట్టకుండా
తాము చూసుకుంటామని
ఇసుక మాఫియా సభ్యుల భరోసా
తీరా కేసులు నమోదు చేశాక
చేతులెత్తేస్తున్న వైనం
కోటిలింగాల రేవులో
14 ఇసుక ర్యాంప్‌ల నిర్వహణ
నిబంధనలకు విరుద్ధంగా
రాత్రి వేళ డ్రెడ్జింగ్
రూ.కోట్ల విలువైన ఇసుక దోపిడీ
కూటమి ప్రజాప్రతినిధుల
అండదండలతో దందా
కేసులంటే హ్యాండ్సప్..!
తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అత్యధిక అక్రమాలు జరుగుతున్న ర్యాంప్‌గా కోటిలింగాల ఖ్యాతి గడించింది. ఇందులో రేవు–2లో అక్రమ తంతు ఎక్కువగా సాగుతున్నట్లు తెలిసింది. అధికారులు ఎన్నిసార్లు దాడులు చేసినా.. కోటిలింగాల–2 రేవు నిర్వహిస్తున్న ఇసుకాసురుల్లో మార్పు రాకపోవడంతో మిగిలిన రేవుల వాళ్లు ఆందోళన చెందుతున్నారు. రేవు–2 పాపంలో తాముకూడా ఇరుక్కోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఇటీవల కోటిలింగాల రేవులో డ్రెడ్జింగ్ యథేచ్ఛగా జరుగుతోందన్న సమాచారంతో కొన్ని రోజుల క్రితం అధికారులు ర్యాంపులో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. డ్రెడ్జింగ్ బోట్లపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అటువైపు వెళ్లకుండా బోట్స్‌మెన్ సొసైటీకి చెందిన సాధారణ బోట్లను పట్టుకున్నారు. కేటాయించిన ప్రాంతంలో కాకుండా వంతెనకు సమీపంలో తవ్వుతున్నారన్న నెపంతో సుమారు 18 బోట్ల యజమానులపై కేసులు నమోదు చేశారు. ఈ పరిణామం బోట్స్‌మెన్ సొసైటీల్లో తీవ్ర ఆగ్రహావేశాలు నింపింది. డ్రెడ్జింగ్ బోట్లపై కాకుండా కష్టపడి ఇసుక వెలికితీసే తమపై చర్యలకు దిగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాగైతే తాము ఇసుక ఎలా తీయాలంటూ ఆవేదన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment