సత్యదేవుని ఆలయానికి భక్తుల తాకిడి
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవాలయానికి బుధవారం భక్తులు పోటెత్తారు. క్రిస్మస్ సెలవు దినం కావడంతో వేలాదిగా భక్తులు సత్యదేవుని ఆలయానికి తరలిరావడంతో స్వామివారి ఆలయం కిటకిటలాడింది. భక్తులంతా సత్యదేవుని వ్రతమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో సత్యదేవుని ఆలయం, ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, విశ్రాంతి మండపాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో సప్త గోవులకు ప్రదక్షిణ చేసి శ్రీకృష్ణునికి పూజలు చేశారు. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించగా స్వామివారి వ్రతాలు రెండు వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ. 40 లక్షల ఆదాయం సమకూరింది.
ప్రపంచ దేశాల జాతీయ
జెండాల ఆవిష్కరణ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్‌టీయూ కాకినాడ పరిపాలన భవనం ఎదుట వాక్‌విత్ నేషన్స్ పేరుతో 194 దేశాల జాతీయ పతాకాలను ఏర్పాటు చేశారు. వీటిని బుధవారం సాయంత్రం వర్సిటీ ఇన్‌చార్జి వీసీ మురళీకృష్ణ, మాజీ వీసీ డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు, రెక్టార్ కేవీ రమణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి వీసీ మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రతి జెండా స్తంభాబానికి క్యూర్ కోడ్‌తో కూడిన డిస్‌ప్లే ఉంటుందని, దీని ద్వారా ఆ దేశ జనాభా, కరెన్సీ, తదితర వివరాలు వస్తాయన్నారు. ఈ ప్రాజెక్టును పూర్వవిద్యార్థి సుందర్ అసోసియేట్స్ చైర్మన్ డాక్టర్ బాదం సుందరరావు స్వంత నిధులతో ఏర్పాటు చేయడం సంతోషమన్నారు. మాజీ వీసీ డాక్టర్ పద్మరాజు, ఓఎస్‌డీ కోటేశ్వరరావు, చీఫ్ ఇంజినీర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment