బాధ్యతా రహితమైన వ్యాఖ్యలు చేస్తే, ఫలితం భారంగానే ఉంటుంది. మాల్దీవులకు చెందిన ఒక ఎంపీ, ముగ్గురు మంత్రులకు బహుశా అది ఇప్పుడు అనుభవంలోకి వచ్చి ఉంటుంది. మాల్దీవుల ప్రభుత్వంలోని ముగ్గురు డిప్యూటీ మంత్రులు మరియమ్ షివునా, మల్షా షరీఫ్, మహజూమ్ మజీద్... భారత్‌కూ, భారత ప్రధానికీ వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసి, పదవి నుంచి సస్పెండయ్యారు.
రెండు దేశాల మధ్య దౌత్య వివాదానికి దారి తీసిన ఆ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో బోలెడంత రచ్చ జరుగుతోంది. మాలే మంత్రుల వ్యాఖ్యలపై భారత ప్రముఖులు గట్టిగానే స్పందించారు. మాల్దీవ్స్ బహిష్కరణ నుంచి మన సొంత ద్వీపాల పర్యాటకాభివృద్ధి దాకా నినాదాలు జోరందుకున్నాయి. వ్యవహారం లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవ్స్‌గా మారింది.
జరిగిన కథ గమనిస్తే – ‘మీలోని సాహసికుడికి సరైన గమ్యస్థానం లక్షద్వీప్’ అంటూ, అక్కడి సముద్రతీరంలోని తన ఫోటో జోడించి జనవరి 5న భారత ప్రధాని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ మీద మాల్దీవుల మంత్రులు, ఎంపీల అనుచిత వ్యాఖ్యలు ఇంత దూరం తెచ్చాయి. మంత్రి అబ్దుల్లా మాజిద్ ఇదంతా మాల్దీవుల నుంచి దృష్టి మరల్చి, లక్షద్వీప్‌ను మరో పర్యాటక కేంద్రంగా ప్రోత్సహించడానికేనని విమర్శించడంతో రాజకీయ వివాదం రేగింది.
ఆయనలా అంటే, మరో మంత్రి మరియమ్ షియునా ‘ఎక్స్’లో ఇజ్రాయెల్‌తో భారత సంబంధాలను ప్రస్తావించారు. ఆమెతో మరో మహిళా సహచర మంత్రి మాల్షా స్వరం కలిపారు. భారత పర్యాటక ప్రాంతాలు, గదులు దుర్వాసన వేస్తుంటాయన్న నోటి తీట మాటలూ వచ్చాయి. ఇవన్నీ చిచ్చు రేపేసరికి, చైనా పర్యటనలోని మాల్దీవుల అధ్యక్షుడు దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి వచ్చింది. మంత్రుల సస్పెన్షన్, వారి వ్యక్తిగత వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని ప్రభుత్వ వివరణ చకచకా జరిగాయి.
భారత్‌లోని పర్యాటక ప్రాంతాల గురించి, ప్రధాని గురించి నోటికొచ్చినట్టు మాట్లాడడం మన వారికి కోపం తెప్పించింది. సెలవులకు మాల్దీవులకు వెళదామనుకున్న వేలాది భారతీయులు టికెట్లను రద్దు చేసుకుంటూ, సదరు స్క్రీన్‌షాట్లను ‘ఎక్స్’ వేదికగా పంచుకుంటున్నారు. అలాగే, దేశంలోనే ఉన్న అందమైన సముద్ర తీరాలు, ఆహ్లాదకరమైన దీవుల గురించి అన్వేషణ ఆరంభమైంది. ఈ వివాదం పుణ్యమా అని ఇంటర్నెట్‌లో లక్షద్వీప్ గురించి అన్వేషణ గత 20 ఏళ్ళలో ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి చేరింది.
అయితే, గత ఏడాది లక్షద్వీప్‌కు 10 వేల మంది లోపే వెళితే, మాల్దీవులకు వెళ్ళిన పర్యాటకుల సంఖ్య లక్షల్లో ఉందని గమనించాలి. ఈ పరిస్థితుల్లో సెంటిమెంట్లు రేపి, ప్రస్తుత వివాదాన్ని ఆత్మాభిమాన, ఆత్మనిర్భర అంశంగా, లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవ్స్‌గా చేస్తే అది వట్టి హ్రస్వదృష్టి. ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు నిత్యం సాగుతున్న వేళ, మాల్దీవ్స్‌తో మన దీర్ఘకాలిక బంధం దెబ్బతినకుండా చూడడం ముఖ్యం.
హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్‌కు కీలక పొరుగుదేశం మాల్దీవులు. ‘ప్రాంతీయ భద్రత, పురోగతి’ (సాగర్) లాంటి ప్రయత్నాల్లో ఆ దేశానిది ప్రధాన పాత్ర. అలాగే, ‘పొరుగుకు పెద్ద పీట’ లాంటి భారత ప్రభుత్వ ప్రాధాన్యాలకు మాల్దీవులు ఓ ప్రధాన కేంద్రం. అలాంటి మాల్దీవు లతో ఇటీవల పొరపొచ్చాలు వచ్చాయి.
భారత వ్యతిరేక అజెండాతో గెలిచి, గత 2023 నవంబర్‌లో మహమ్మద్ మొయిజు మాల్దీవ్స్‌కు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వెంటనే మాల్దీవుల ద్వీపబృందం నుంచి భారత సైన్యాన్ని ఉపసంహరించాల్సిందిగా కోరారు. భారత్ మాత్రం హిందూ మహాసముద్రంలోని సుదూర ద్వీపాలకు వైద్యసాయానికై తమ సైనికులు అక్కడున్నారంది.
తాజా వివాదాల వేళ మరో పొరుగు దేశం చైనా వైఖరి పక్క ఇల్లు తగలబడుతుంటే, చలి కాచుకుంటున్నట్టుంది. భారత్, మాల్దీవుల మధ్య రచ్చను అది ఆస్వాదిస్తోంది. మాల్దీవుల విదేశాంగ విధానం బాగుందనీ, ఆ దేశాధ్యక్షుడు భారత్‌తో సరైన రీతిలో వ్యవహరిస్తున్నారనీ చైనా మీడియా ప్రశంసిస్తోంది. అసలీ అంశంలో ఢిల్లీయే విశాల దృక్పథంతో ఉండాలంటూ బీజింగ్ సుద్దులు చెబుతోంది.
ఇప్పటికే భారత్‌కు దక్షిణాన, పశ్చిమాన వివిధ దేశాల్లో చైనా పాగా వేసింది. హిందూ మహాసముద్రంలో కీలకమైన మాల్దీవుల్ని కూడా తన బుట్టలో వేసుకొనే పనిలో ఉంది. ఢిల్లీతో దీర్ఘకాలిక దౌత్యబంధమున్న మాలే సైతం క్రమంగా చైనా వైపు మొగ్గుతున్నట్టు కనిపిస్తోంది.
మరోపక్క మాలేలో పెరుగుతున్న ఇస్లామిక్ తీవ్రవాదం ఆందోళన రేపే అంశం. అత్యధికులు ముస్లిమ్‌లైన మాల్దీవుల నుంచి 600 – 700 మంది ఇస్లామిక్ తీవ్రవాద ‘ఐసిస్’లో చేరారని లెక్క. ఈ పరిస్థితుల్లో మాల్దీవులు కేంద్రంగా వ్యూహాత్మక ప్రయోజనాలెన్నో ఉన్న భారత్ ఆచితూచి వ్యవహరించాలి.
నెటిజన్ల ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’ లాంటి వ్యాఖ్యలు వినడానికి బాగున్నా, భౌగోళిక అనివార్యతల రీత్యా కుదిరేపని కాదు. సంచలన ప్రకటనల కన్నా సవ్యమైన కార్యాచరణే మన పర్యాటకాభివృద్ధికి కీలకం. ఇందులో మన పాలకులు చేసింది తక్కువ, చేయాల్సిందే ఎక్కువ.
లక్షద్వీప్‌కు ప్రాముఖ్యం కల్పించాలని మోదీ సర్కార్ భావిస్తే తప్పు లేదు కానీ, ఆ చిరు కేంద్రపాలిత ప్రాంతంలో భారీ నిర్మాణాలతో జీవ్యావరణాన్ని దెబ్బ తీసే యత్నాలు మానాలి. మాల్దీవ్స్ ప్రజాస్వామ్యం బాట పట్టి అంతా కలిపి దశాబ్దిన్నరే అయింది. కొద్ది నెలల క్రితమే వచ్చిన కొత్త ప్రభుత్వం ఇంకా కుదురుకోనే లేదు.
ఈ పరిస్థితుల్లో చేతి నిండా పని ఉన్న మాల్దీవ్స్ మంత్రులు భారత్ గురించి, భారత్‌లో భాగమైన లక్షద్వీప్ గురించి మాట్లాడాల్సిన పని లేదు. అది వారి పరిధి కూడా కాదు. తాగునీటి కొరత నుంచి ఇటీవలి కోవిడ్ నియంత్రణ దాకా పలు సందర్భాల్లో మానవతతో అండగా నిలిచిన భారతే తాము నమ్మదగిన, చిరకాల మిత్రుడని గ్రహించాలి.
అనుచిత వ్యాఖ్యల చిచ్చు
Published Tue, Jan 9 2024 12:05 AM | Last Updated on Tue, Jan 9 2024 4:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment