ఇక సన్యాసమే శరణ్యమా! | Vardhelli Murali Article On TDP Boycott MPTC, ZPTC Elections | Sakshi
Sakshi News home page

ఇక సన్యాసమే శరణ్యమా!

Published Sun, Apr 4 2021 12:57 AM | Last Updated on Sun, Apr 4 2021 9:01 AM

Vardhelli Murali Article On TDP Boycott MPTC, ZPTC Elections - Sakshi

తానొకటి తలచిన దైవమొకటి తలచునట. అయ్యవారిని చేయబోతే కోతిబొమ్మ తయారైందట! అనుకున్నదొకటి, అయిం దొకటి. ఈ సందర్భాన్ని వివరించడానికి పుట్టిన నాటు సామెతలు, నీటు సామెతలు తెలుగులో కోకొల్లలు. ఇప్పుడు చంద్రబాబునాయుడు గురించిన ప్రస్తావన కూడా ఇటువంటి సందర్భమే. దేశ రాజకీయాల్లో తనంత సీనియర్‌మోస్ట్‌ ఎవరూ లేరని ఆయన స్వయంగా చెప్పుకున్నారు. ఆయన అభిప్రాయం ప్రకారమే ఇప్పుడాయన గ్రాండ్‌ ఓల్డ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఏపీ పాలిటిక్స్‌. ఇంకో రెండు వారాల్లో ఆ గ్రాండ్‌ ఓల్డ్‌మ్యాన్‌కు 71వ హ్యాపీ బర్త్‌డే. ఆ వేడుక నాటికి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగే నైతిక హక్కును ఆయన కోల్పోబోతున్నారు. అదెలాగో చూద్దాం.

ఏడాది కిందట అర్ధాంతరంగా ఆగిపోయిన జెడ్‌పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల ప్రక్రియ నిన్న పునఃప్రారంభమైంది. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసిన తర్వాత, చంద్ర బాబు ప్రోద్బలం మేరకు అప్పటి ఎస్‌ఈసీ వాయిదా వేశారని అధికారపక్షం ఆరోపించింది. నిష్పాక్షికులైన పరిశీలకుల అభి ప్రాయం కూడా అదే. ఎన్నికల ప్రక్రియను ఏ దశలో వాయిదా వేస్తున్నానో, అదే దశ నుంచి మళ్లీ నిర్వహిస్తానని అప్పుడు స్వయంగా ఎస్‌ఈసీ ప్రకటించారు. తర్వాత సర్వోన్నత న్యాయ స్థానం కూడా ఆగిపోయిన దగ్గర్నుంచే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది కూడా. అయినప్పటికీ మాజీ ఎస్‌ఈసీ తన మాటను నిలబెట్టుకోలేదు. సుప్రీం అభిప్రాయాన్ని గౌరవిం చలేదు. కొత్త ఎస్‌ఈసీ నీలం సాహ్నీ ఆగిపోయిన దగ్గరనుంచి ప్రారంభించారు. అన్ని అంశాలు పరి శీలించిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా జరగాల్సిన నేపథ్యంలో మిగిలిపోయిన ఆరు రోజుల ప్రక్రియను ఇప్పుడే పూర్తిచేయవలసిన అవసరం ఉన్నదని ఆమె అభిప్రాయపడ్డారు. ఇది అప్రజాస్వామిక వైఖరని తప్పుబడుతూ ఎన్నికలను బహి ష్కరిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. 

ఎన్నికలను బహిష్కరించడానికి తాను చెప్పిన కారణాలు నిజం కాదని ఆయనకూ తెలుసు. రాష్ట్ర ప్రజలకూ తెలుసు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఇంత ప్రశాంతంగా ఎన్నికలు జరగలేదని చంద్రబాబు రబ్బర్‌ స్టాంప్‌ ఎస్‌ఈసీ అధికారికంగా ప్రకటిం చారు. ఇంత ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఎన్నడూ ఎన్నికలు జరగ లేదని రాష్ట్ర పోలీసు రికార్డులు కూడా చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీ తరఫున ఏకైక మునిసిపల్‌ చైర్మన్‌గా ఎన్నికైన జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలే స్వేచ్ఛాయుత ఎన్నికలకు సాక్ష్యం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాస్వామ్యబద్ధ వైఖరి కారణంగానే తాను చైర్మన్‌ కాగలిగానని మీడియా ముందు జేసీ చెప్పారు. జెడ్‌పీటీసీ ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిపోయిందో అక్కడినుంచే ప్రారంభిస్తామని స్వయంగా చంద్రబాబు రబ్బర్‌ స్టాంప్‌ ఎస్‌ఈసీ ప్రకటించిన విషయం ఒక వాస్తవం. ఆమేరకు సుప్రీంకోర్టు ఆదేశాలు మరో నిఖార్సయిన నిజం. కనుక ఎన్ని కల బహిష్కరణకు ప్రతిపక్ష నేత చెప్పిన కారణాలు కుంటి సాకులేనని తేటతెల్లమవుతున్నది. మరి అసలు కారణాలు ఏమిటి? అవి ఆయన బయటకు చెప్పుకోలేరు. అవి మింగలేరు, కక్కలేరు. ఇటువంటి సంకటస్థితిలో ఆయన కుంటిసాకును ఆశ్ర యించక తప్పలేదు. తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేతల అంచనా ప్రకారం మూడు ప్రధాన కారణాలు ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపించాయి. 

1. పరాజయాల పరాభవం: వరుస ఎన్నికల్లో పరాజయాలు. అది కూడా అతి దారుణమైన పరాజయాలు ఆయనను బాధపెడ్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఏనాడూ ఎరుగని విధంగా తెలుగుదేశం పార్టీ దక్కించుకున్న సీట్లు కేవలం 13 శాతం. లోక్‌సభ సీట్లు 12 శాతం. గ్రామ పంచాయతీలు 12 శాతం. మునిసిపాలిటీలు ఒకటింపావు శాతం. కార్పొరేషన్లు సున్నా శాతం. పట్టణ ప్రాంతాల ప్రజలు తనను ఆదరిస్తారనే ఒక భ్రమ ఆయనకు ఉండేది. ఆ కారణంగా ఎస్‌ఈసీపై ఒత్తిడి తెచ్చి పరిషత్‌ల ఎన్నికల బదులు మునిసిపల్‌ ఎన్నికలను ముందుకు తెచ్చారు. మునిసిపాలిటీల్లో తాను సాధించే విజయాల ప్రభావం పరిషత్‌ ఎన్నికల మీద పడాలనేది ఆయన వ్యూహ మట. కానీ ఫలితాలు చూసిన తర్వాత దిమ్మతిరిగినంత పనైంది. మునిసిపాలిటీల సగటు లెక్క తీస్తే తెలుగుదేశం ఓటింగు బలం 30 శాతం దాటలేదు. ఈ పరిస్థితుల్లో ప్రాదేశిక ఎన్నికల్లో 25 శాతం మించి ఓట్లు రాబట్టలేమనే సంగతి ఆయనకు పూర్తిగా అర్థమైంది. అంటే చంద్రబాబును రెండో ఎక్కంతో హెచ్చించినా కూడా జగన్‌మోహన్‌రెడ్డిని ఓడించలేడు. ఇటువంటి అవమా నకరమైన పరిస్థితి నుంచి ఏదోరూపంలో బయటపడాలని బాబు సంకల్పించారు. 

2. కార్యకర్తల తిరుగుబాటు భయం: స్థానిక ఎన్నికలు ప్రారంభం కావడానికి ముందునుంచే తన నాయకత్వం పట్ల కార్యకర్తల్లో విశ్వాసం సన్నగిల్లడం మొదలైంది. తన సొంత నియోజకవర్గంలోనే చంద్రబాబు కార్యకర్తల నుంచి కొంత అవమానకరమైన పరిస్థితిని ఎదుర్కొనవలసి వచ్చింది. గ్రామ పంచాయతీ, మునిసిపల్‌ ఎన్నికల ఫలితాలు ఇప్పటికే అవ మానాగ్నికి ఆజ్యం పోశాయి. ప్రాదేశిక ఫలితాలు మరింత దారుణంగా ఉండేది ఖాయం. ఆ తర్వాత కార్యకర్తలకు, నాయ కులకు తనపై గౌరవం సన్నగిల్లుతుంది. ఎవరి దారి వారు వెతుక్కునే ప్రయత్నాల్లో పడతారు. అందువల్ల మొత్తం స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియనే అక్రమంగా బ్రాండింగ్‌ చేసి ఎంతో కొంత పరువు కాపాడుకోవాలని ఆయన భావించారు.

3. గిట్టుబాటు బేరం కోసం: అధికారంలో వున్నప్పుడు రాష్ట్రంలో జరిగిన విచ్చలవిడి అవినీతి, రాజధాని పేరుతో తెర లేపిన సూపర్‌ కుంభకోణాలపై విచారణ జరిగితే అడ్డంగా దొరికిపోవడం ఖాయమని పార్టీ సీనియర్లు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వయసులో జైలు ఊచలు లెక్కించాల్సి రావడమన్న ఊహలతోనే ఆయన వణికిపోతున్నారట. సాధా రణ ఎన్నికల ఫలితాలు వచ్చిన తొలిరోజుల్లోనే పరిస్థితిని అంచనా వేసుకొని ఢిల్లీ ప్రభువుల శరణుజొచ్చారని అప్పట్లో రకరకాల వార్తలు వ్యాప్తిలోకి వచ్చాయి. తెలుగుదేశం పార్టీ నుంచి ఈ వార్తలపై ఎటువంటి అధికారిక ఖండనా ఇప్పటిదాకా రాలేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రైట్స్‌ను పూర్తిగా బీజేపీకి అప్పగించడానికి సంసిద్ధతను వ్యక్తం చేస్తూ రెండు రకాల ప్రతిపాదనలు వారి ముందు పెట్టారని వార్తలొచ్చాయి. అందులో మొదటిది తెలుగుదేశం కంపెనీని పూర్తిగా బీజేపీ టేకోవర్‌ చేయడం. రెండోది దాని స్వతంత్ర ప్రతిపత్తిని కొన సాగిస్తూ అనుబంధ సంస్థగా నడుపుకోవడం–ఈ రెంటిలో ఏదైనా తమకు సమ్మతమేననీ, బదులుగా కేసులు నడవకుండా సహకరించడంతోపాటు, డీల్‌ తర్వాత రోజుల్లో తండ్రీకొడుకు  లకు గౌరవప్రదమైన స్థానం కల్పించాలని విజ్ఞప్తిని అంద జేశా రట. వాళ్లిద్దరి భవిష్యత్తునే చూసుకున్నారు తప్ప, పార్టీ స్థాపించినప్పటి నుంచీ సేవలందించిన తమ గురించి పట్టించుకోలేదన్న దుగ్ధ సీనియర్‌ నేతల్లో ఉన్నది. అందువల్లనే ఇటువంటి వివరాలన్నీ బయటకు వస్తున్నాయి. పెద్ద కంపెనీ ఏదైనా టేకోవర్‌ చేయబోయే ముందు తమ కంపెనీ లాభాల్లో ఉందనీ, ఫండమెంటల్స్‌ బాగున్నాయని లెక్కలు చూపడానికి చిన్న కంపెనీలు తంటాలు పడతాయి. తెలుగుదేశం లెక్కలు పెద్ద ఆకర్షణీయంగా కనిపించడం లేదు. అందుకు కారణాన్ని ‘అక్రమ ఎన్నికల’ మీదకు నెట్టి గిట్టుబాటు ధర సంపాదించాలన్న తాపత్రయం కూడా ఈ బహిష్కరణకు మరో కారణం.

రకరకాల కోణాల్లో ఆలోచించి చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ నిర్ణయాన్ని తీసుకున్నారు. కానీ ఈ నిర్ణయ పర్య వసానం తన రాజకీయ జీవితంలోనే ఊహించని ట్విస్టుగా మారబోతున్నదని ఆయన అంచనా వేయలేకపోయారు. చాలా ప్రాంతాల్లో కార్యకర్తలు, కొందరు నాయకులు బహిరంగంగానే అధినేత నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీ అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి ఆదేశాన్ని పార్టీలోని మెజారిటీ సభ్యులు ధిక్కరించిన పక్షంలో ఆ వ్యక్తికి అధ్యక్షస్థానంలో కొన సాగే నైతిక అర్హత ఉంటుందా అనే ప్రశ్న ఇప్పుడు చర్చ నీయాంశం కానుంది. ఎన్నికల్లో ఇప్పటికే నామినేషన్లు దాఖలై ఉన్నందువలన 526 జెడ్‌పీటీసీ స్థానాల్లో, 7321 ఎంపీటీసీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు రంగంలో ఉన్నారు. మునిసిపల్‌ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలను పరిశీలించి చేసిన విశ్లేషణ ప్రకారం ప్రాదేశిక ఎన్నికలు జరగ నున్న గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఓటింగ్‌ బలం 25 శాతంగా ఉండొచ్చని తేలుతున్నది. సుదీర్ఘకాలంపాటు అధి కారంలో ఉన్నందువల్ల బ్యాలెట్‌ పేపర్‌ మీద సైకిల్‌ గుర్తు కనపడగానే ఓటు వేసే సాధారణ ఓటర్లు ఇందులో నాలుగైదు శాతం మంది ఉండవచ్చు. మిగిలిన ఇరవై శాతం మంది తెలుగుదేశం పార్టీ ప్రాథమిక, క్రియాశీల సభ్యత్వం కలిగినవాళ్లు. ఇది లోకేశ్‌ లెక్కకు సరిపోతుంది. ఆయన ప్రధాన కార్యదర్శి హోదాలో గతంలో విడుదల చేసిన వివరాల ప్రకారం మొత్తం ఓటర్లలో దాదాపు ఇరవై శాతం మంది తెలుగుదేశం పార్టీ సభ్యులే. ఈ ఇరవై శాతం మంది పార్టీ అధినేత ఆదేశాలను కచ్చితంగా పాటించవలసి ఉంటుంది. వీరిలో సగంమంది కంటే ఒక్కరు అదనంగా ఓటింగ్‌లో పాల్గొన్నా మెజారిటీ సభ్యులు అధినేత నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నట్టే లెక్క. ఉదాహరణకు ఒక ఎంపీటీసీ స్థానంలో పోటీచేసిన తెలుగుదేశం అభ్యర్థికి పార్టీ గుర్తు కారణంగా వ్యక్తిగత సంబంధాల కారణంగా ఒక ఐదు శాతం ఓట్లు పోలవుతాయి. (వ్యక్తిగతంగా ఇంతకంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకునే అభ్యర్థుల సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది.) ఈ ఐదుశాతం ఓట్లకు తోడుగా ఇరవై శాతంమంది పార్టీ సభ్యుల్లో సగానికంటే ఎక్కువమంది ఓట్లేశారనుకుం దాము. ఆ అభ్యర్థికి పదిహేను శాతం కంటే ఒక్క ఓటు అధి కంగా వచ్చినా ఆ ఎంపీటీసీ స్థానంలోని పార్టీ సభ్యులు పార్టీ అధినేత నిర్ణయాన్ని తిరస్కరించినట్టే. ఈవిధంగా ఎన్నికలు జరిగేచోట సగానికంటే ఎక్కువ (3662) ఎంపీటీసీ స్థానాల్లో ఆ పార్టీకి 15 శాతం మించి ఓట్లు పోలైతే రాష్ట్రవ్యాప్తంగా తెలుగు దేశం సభ్యులు పార్టీ అధినేతను ధిక్కరించినట్టే. అలాగే మెజా రిటీ జెడ్‌పీటీసీ స్థానాల్లో (263+1) 15 శాతం మించి ఓట్లు టీడీపీ అభ్యర్థులకు లభించినా పార్టీ సభ్యులు అధ్యక్షుడి మాటను ఖాతరు చేయలేదని అర్థం.

ఒకవేళ మెజారిటీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు 15 శాతం ఓట్లను మించి సాధిస్తే అప్పుడు పార్టీ అధ్యక్షస్థానంలో కొనసాగే నైతిక అర్హత చంద్రబాబుకు ఉంటుందా? పార్టీ ప్రాథమిక సభ్యులు, క్రియాశీలక సభ్యులే లెక్కచేయని అధ్యక్షునిపై కార్య కర్తలకూ, నాయకులకూ గౌరవం మిగులుతుందా? పార్టీ సభ్యుల మద్దతు లేని అధ్యక్షుడు ఇతర పార్టీలతో చేసుకునే డీల్స్‌ సమర్థనీయమేనా? దీనికి సీనియర్‌ నాయకశ్రేణి అనుమతి స్తుందా? ఈ ప్రశ్నలకు తొందర్లోనే సమాధానాలు లభిస్తాయి. 

చంద్రబాబుకు అనుకోని అదృష్టం కలిసివచ్చి టీడీపీ ఓటుబ్యాంకు 25 శాతం నుంచి కిందకు కూడా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తమ నాయకుడు ధీరోదా త్తుడయితేనే అనుచరులు, కార్యకర్తలు అమితంగా ప్రేమిస్తారు. నిజంగా కష్టాలు ఎదురైనా వెన్నుచూపని వాడైతేనే వెంట నడుస్తారు. పలాయనవాదిని జనం కూడా పట్టించుకోరు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతులైన ఐదుగురు వ్యక్తుల్లో ఒకరిగా సోనియా గాంధీ వెలిగిపోతున్న రోజుల్లోనే ఆమెను ధిక్కరించిన జగన్‌మోహన్‌రెడ్డి వెంట తొలిరోజుల్లో ఎవరు న్నారు? ఏ పార్టీ వుంది? అయినా జనం విజ్ఞత మీద నమ్మ కంతో, తాను ఎంచుకున్న మార్గంపై అచంచల విశ్వాసంతో తల్లితో కలిసి ఎన్నికల్లో తలపడితే జాతీయ రికార్డును బద్దలు కొడుతూ ఓట్లు వరదెత్తలేదా? ధీరస్వభావానికి లభించే ఆదరణ అటువంటిది. భీరువు నాయకత్వాన్ని ఎందుకు సమ్మతిస్తారు? చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ వెనుక ఒక భీరువును కనుక పార్టీ కార్యకర్తలు చూసినట్లయితే, ఏ ప్రయత్నం లేకుండానే ఆ పార్టీ ఓట్లు 15 శాతానికి పడిపోతాయి. కానీ పార్టీ పూర్తిగా చేజారిపోతుంది. కార్యకర్తలు, నాయకులు ఎవరి దారి వారు చూసుకుంటారు. ఈ రెండు పరిణామాల్లో ఏది జరిగినా చంద్ర బాబు నాయకత్వానికి ముప్పు వాటిల్లినట్లే. 71వ పుట్టినరోజు చంద్రబాబు రాజకీయ జీవితంలో తుది ఘట్టంగా మిగిలి పోవచ్చు. అనతికాలంలోనే ఆయనకు రాజకీయ సన్యాసం తప్పకపోవచ్చు.



వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement