108 ఉద్యోగుల ఉద్యమ పథం
ఏలూరు (టూటౌన్): రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ 108 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో 108 సర్వీసుల ఉద్యోగులు ఏలూరు కలెక్టరేట్ వద్ద సోమవారం ఒక రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఇబ్బ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం, యాజమాన్యం స్పందించి తమ సమస్యలు పరిష్కరించకుంటే ఈనెల 25 తర్వాత సమ్మెకు వెళతామని హెచ్చరించారు. సమ్మె కారణంగా ప్రజలకు కలిగే అసౌకర్యానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. 108 అంబులెన్స్ వ్యవస్థను నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలని, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. రోజుకు మూడు షిఫ్టుల పని విధానం అమలు చేయాలని, ప్రభుత్వ నియామకాల్లో తమకు వెయిటేజీ ఇవ్వాలని కోరారు. సహజ, ప్రమాద మరణం పొందిన ఉద్యోగి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం అందించాలని, 108 వాహనాలకు శాశ్వత భవనాలు ఏర్పాటు చేయాలన్నారు. జనరల్ సెక్రటరీ రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణమూర్తి, వైస్ ప్రెసిడెంట్ ఆర్.శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ శివ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment