ఏలూరు (టూటౌన్): భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో డిసెంబర్ 11న అయోధ్య – కాశీ పుణ్యక్షేత్ర యాత్ర నిర్వహిస్తున్నట్లు విజయవాడ ఏరియా మేనేజర్ ఎం.రాజా మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని రైల్వే స్టేషన్లలో ఆగుతుందన్నారు. వచ్చే నెల 11న సికింద్రాబాద్‌లో బయలుదేరి తిరిగి 20వ తేదీన సికింద్రాబాద్ చేరుకుంటుందన్నారు. మొత్తం యాత్ర 9 రాత్రులు, 10 పగళ్లు ఉంటాయన్నారు. యాత్రలో భాగంగా పూరిలోని జగన్నాధ ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయం, గయాలోని విష్ణుపాద దేవాలయం, వారణాసిలోని కాశీ విశ్వనాధ ఆలయం, కాశీవిశాలాక్ష్మి, అన్నపూర్ణదేవి ఆలయాల సందర్శన ఉంటుందన్నారు. కాశీలో సాయంత్రం గంగా హారతి దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. అయోధ్యలోని సరయు నది ఒడ్డున రామజన్మభూమి, హనుమాన్ గర్హి, ఆరతి, ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం దర్శనాలు ఉంటాయన్నారు. రైలులో మూడు రకాల టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. స్లీపర్ క్లాస్ నందు ఒక్కొక్కరికి టిక్కెట్ వెల పెద్దలకు రూ.16,800, పిల్లలకు రూ.15,600, స్టాండర్డ్ ధర్డ్‌క్లాస్ ఏసీ ప్రయాణానికి పెద్దలకు రూ.26,650, పిల్లలకు రూ.25,340, సెకండ్ ఏసీ క్లాస్ టిక్కెట్ పెద్దలకు రూ.34,916, పిల్లలకు రూ.33,330గా నిర్ణయించడం జరిగిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment