కేసులా.. లైట్ తీస్కోండి!
సాక్షి, భీమవరం: మద్యం అమ్మకాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, ఏకంగా లైసెన్సే రద్దులంటూ పైకి కబుర్లు చెబుతారు. తీరా.. బెల్టు షాపు నిర్వాహకుడు దొరికితే ఐదారు బాటిల్స్‌తో పట్టుకున్నట్టు చూపించి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేస్తారు. ఆ బెల్టు నిర్వాహకుడికి బాటిల్స్ ఇచ్చి అమ్మకాలు చేయిస్తున్న మద్యం షాపు జోలికి మాత్రం పోరు. ఇది జిల్లాలోని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ తీరు. ఎమ్మార్పీకి మించి అమ్మకాలు చేసినా, బెల్టు షాపులు ఏర్పాటు చేసినా మొదటిసారి రూ.ఐదు లక్షలు జరిమానా విధించాలని, రెండో సారి తప్పుచేస్తే షాపు లైసెన్స్ రద్దుచేయాలని ఇటీవల ఒక సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశించిన విషయం విదితమే. లిక్కర్ బిజినెస్‌లో ఇలాంటి హెచ్చరికలు మామూలే అన్నట్టుగా సిండికేట్ వర్గాలు లైట్ తీసుకుంటున్నాయి. నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. షాపుల వద్ద పర్మిట్ రూంల మాదిరి సదుపాయాలు, గ్రామాల్లో బెల్టు షాపులు, అధిక ధరలకు మద్యం విక్రయాలు సాగిపోతున్నాయి. షాపులు ఏర్పాటయినప్పటి నుంచి ఇంతవరకు ఎకై ్సజ్ అధికారులు జిల్లాలో బెల్టుషాపు నిర్వాహకులపై దాడులు నిర్వహించి 71 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 289 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు.
బాటిల్స్ ఏ షాపులోవో తెలిసినా.. మద్యం బాటిల్స్‌పై ఉన్న బ్యాచ్ నెంబర్ల ఆధారంగా అవి ఏ షాపు నుంచి వచ్చాయనే విషయాన్ని ఎకై ్సజ్ అధికారులు ఇట్టే గుర్తిస్తారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో బెల్టు షాపునకు మద్యం బాటిల్స్ ఇచ్చిన షాపునకు రూ.5 లక్షల ఫైన్ వేయాలి. వాటి జోలికి వెళ్లడం లేదు. బెల్టు నిర్వాహకుడిపై నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. మద్యం సిండికేట్లకు స్థానిక ఎమ్మెల్యేల అండదండలు పుష్కలంగా ఉండటంతో వాటి జోలికి వెళ్లడం లేదు.
స్టేషన్ బెయిల్ ఇచ్చేలా కేసుల నమోదు
చట్ట విరుద్దమే అయినా సంక్రాంతి పండుగల మూడు రోజులు కోడిపందేలు నిర్వహించడం తెలిసిందే. పందేలను అడ్డుకుని అరెస్టులు చేసినట్టుగా బైండోవర్ చేసేందుకు ఇద్దరు ముగ్గురు వ్యక్తులు, నాలుగైదు కోడిపుంజులు అప్పచెప్పాలని బరి నిర్వాహకులకు పోలీసులు ముందే చెబుతుంటారు. కోడి పందేలకు తెరవెనుక జరిగే ఈ వ్యవహారాన్ని ఇప్పుడు సిండికేట్ నిర్వాహకులతో ఎకై ్సజ్ శాఖ నడుపుతోందన్న అనుమానాలున్నాయి. బెల్టు నిర్వాహకులపై దాడులు జరుగుతున్న తీరు, అక్కడ దొరికినట్టుగా చూపిస్తున్న బాటిళ్ల సంఖ్య ఇందుకు బలం చేకూరుస్తోంది. ఇప్పటివరకు ఎకై ్సజ్ అధికారుల దాడుల్లో రెండు మూడు చోట్ల మాత్రమే పదికిపైగా బాటిళ్లు దొరికినట్టుగా చూపించగా మిగిలిన అన్ని చోట్ల తొమ్మిది బాటిళ్ల లోపే ఉంటున్నాయి. సాధారణంగా పదికి పైగా బాటిళ్లు దొరికితే నిందితుడ్ని, బాటిళ్లను కోర్టులో హాజరుపర్చాల్సి ఉంటుందని న్యాయవాది ఒకరు తెలిపారు. పది బాటిల్స్ లోపు ఉంటే సెక్షన్ 34 (ఏ) కింద కేసు నమోదుచేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేయవచ్చు. కోర్టులో నేరం రుజువైతే ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష వరకు జురిమానా పడుతుంది. మధ్యవర్తుల సాక్ష్యం లేకుండా లోపభూయిష్టంగా కేసులు నమోదు చేయడం వల్ల నేరం రుజువై శిక్ష పడిన ఘటనలు చాలా అరుదు. నేరం రుజువుకాకపోవడం వల్ల ఈ కేసులను కోర్టు కొట్టివేస్తుంది. ఎకై ్సజ్ అధికారులు కేసుల్లో తమ టార్గెట్లను చేరుకునేందుకు సిండికేట్ వర్గాల ద్వారానే ఒకరిద్దరిని పట్టుకుని తూతూమంత్రంగా కేసులు నమోదుచేయించి చేతులు దులుపుకుంటున్నట్టు తెలుస్తోంది.
సీఎం హెచ్చరికలను పట్టించుకోని మద్యం సిండికేట్
తూతూమంత్రంగా కేసులు నమోదు చేస్తున్న ఎకై ్సజ్ సిబ్బంది
మద్యం షాపుల్లో యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన
గ్రామ గ్రామాన బెల్టుషాపులు, అధిక ధరలకు మద్యం విక్రయాలు
Comments
Please login to add a commentAdd a comment