వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా జెట్టి గురునాథరావు
జంగారెడ్డిగూడెం: పట్టణానికి చెందిన సీనియర్ నాయకుడు జెట్టి గురునాథరావు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. జెట్టి గురునాథరావు ఎన్నికల ముందు పోలవరం నియోజకవర్గ పరిశీలకుడిగా పని చేశారు. ఇటీవల పార్టీలో క్రియాశీలక నేతగా వ్యవహరిస్తున్నారు. దీంతో అధిష్టానం ఆయన సేవలు గుర్తించి, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించింది.
23న మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సమావేశం
ఏలూరు (టూటౌన్): ఈ నెల 23న జంగారెడ్డిగూడెం లయన్స్ క్లబ్ హాలులో జరిగే మున్సిపల్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) జనరల్ బాడీ సమావేశం జయప్రదం చేయాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. స్థానిక ఏఐటీయూసీ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవన్‌లో కరపత్రాల్ని మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజారోగ్యంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమన్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, ఆప్కాస్ విధానాన్ని రద్దుచేసి కార్మికులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్వచ్చాంధ్ర కార్పొరేషన్ డ్రైవర్లకు రూ.18,500 ఇవ్వాలని, పర్మినెంట్ కార్మికులకు సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఆర్జిత సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 23న జంగారెడ్డిగూడెంలోని లయన్స్ క్లబ్ హాల్లో జనరల్ బాడీ సమావేశం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో దొడ్డికార్ల నాగబాబు, యలగాడ దుర్గారావు, కసింకోట నాగేంద్ర, ఇంటి అశోక్, డి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
మద్యం దుకాణం ఏర్పాటుపై దళితుల ఆందోళన
పాలకోడేరు: పాలకోడేరు మండలం గొల్లలకోడేరులో దళిత వాడకు దగ్గరగా మద్యం దుకాణం ఏర్పాటు చేయడంతో దళిత వాడకు చెందిన మహిళలు, యువకులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమ మనోభావాలు దెబ్బతీసేలా ప్రార్ధన మందిరానికి దగ్గరగా, విద్యార్థులు, మహిళలకు ఇబ్బందికరంగా ఉండేలా మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ షాపునకు పంచాయతీ ఎలా అనుమతులు ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ స్మశాన వాటికకు వెళ్లడానికి వీలు లేకుండా మద్యం దుకాణం ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి ఈ మద్యం దుకాణాన్ని జనావాసాలకు దూరంగా తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అధికారుల నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకు ఆందోళన విరమించేది లేదన్నారు.
లేసు పార్కు అభివృద్ధిపై చర్చలు
నరసాపురం రూరల్: లేసు, అల్లిక పనులు చేసే మహిళల ఆర్థికాభివృద్ధి ప్రణాళికలపై నాబార్డు డీడీఎం అనిల్ కాంత్ మార్కెంటింగ్ రుస్తుంబాద లేసుపార్కు అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. లేసు పార్కులో లేసు అల్లికల మహిళలకు వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు డీఆర్డీఏ సహకారంతో గతంలో లేసు పార్కులో మహిళలకు నిర్వహించిన చేతి వృత్తులకు సంబంధించి ఇచ్చిన శిక్షణ, తదితర అంశాలపై చర్చించారు. చేతి వృత్తుల అల్లికలతో పాటు ఉత్పత్తులకు సంబంధించి మార్కెటింగ్ కల్పించడంతోపాటు ఉత్పత్తుల విక్రయాలు చేపట్టేందుకు ప్రోత్సహిస్తామని నాబార్డు అధికారులు డీఆర్డీఏ పీడీ ఎంఎస్‌ఎస్ వేణుగోపాల్‌కు హామీ ఇచ్చారు. గతంలో ఇచ్చిన శిక్షణకు సంబంధించిన డాక్యుమెంటేషన్ పూర్తి చేసుకునేందుకు ఎగ్జిమ్ బ్యాంకు సిబ్బంది కూడా లేసుపార్కును సందర్శించి డాక్యుమెంటేషన్ పూర్తి చేసే పనులు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment