అదరగొట్టిన అమ్మాయిలు
ఏలూరు రూరల్: బాస్కెట్‌బాల్ పోటీల్లో జిల్లా బాలికలు తమకు తిరుగులేదనిపించారు. రెండ్రోజుల క్రితం విజయవాడలో ముగిసిన రాష్ట్ర స్థాయి అండర్–23 బాస్కెట్‌బాల్ పోటీల్లో మిగతా జట్లను భారీ స్కోర్ల తేడాతో ఓడించి సత్తా చాటారు. పటిష్టమైన అనంతపురం, విశాఖపట్టణం, గుంటూరు జట్లను ఓడించి బాలికలు అద్భుతమైన విజయం సాధించారు. ఈ విజయంతో ఎంతో మందిలో స్పూర్తి నింపారు. కొన్నేళ్ళుగా స్కూల్, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ జట్టు వరుస విజయాలు సాధిస్తోంది. ఎక్కువ శాతం బాలికలు ఏలూరు కస్తూర్బా బాలికల పాఠశాలలో ప్రాధమికోన్నత విద్య అభ్యసించిన వారే.. వీరి విజయాలను మెచ్చి దాతలు సైతం క్రీడా దుస్తులు, షూతో పాటు బహుమతులు అందించి ప్రోత్సహిస్తున్నారు.
నిరంతర సాధనతో సాధ్యం
పదవీ విరమణ చేసి ఉపాధ్యాయుల ఆర్థిక సాయంతో పాఠశాల పీడీ కె.మురళీకృష్ణ 2018లో పాఠశాలలో బాస్కెట్‌బాల్ కోర్టు నిర్మించడంతో బాస్కెట్‌బాల్ విజయాలకు పునాది పడింది. ఏటా వేసవి శిబిరం నిర్వహణతో పాటు క్రమం తప్పకుండా సాధన చేసేవారు. దీంతో పిల్లల్లో బాస్కెట్‌బాల్ పట్ల మక్కువ పెరిగింది. జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సీనియర్ క్రీడాకారిణులు వి.చంద్రలేఖ, బి.లీలావతి, బి.భవానిదేవి, ఎల్.లీలాసరోజతో పాటు ఏ రుత్విక, జీ పూజిత, పి.నందిని తదితరులు సైతం రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. నూజివీడులో జరిగిన అండర్–14 ఎస్‌జీఎఫ్ పోటీల్లో పాల్గొన్న జిల్లా జట్టులో వీరు సభ్యులుగా ఉన్నారు.
సాధించిన విజయాలు
రెండేళ్ల క్రితం విజయవాడ సిద్ధార్థ కళాశాలలో అండర్–17 ఏపీ అంతర జిల్లాల పోటీల్లో పాఠశాల క్రీడాకారిణులు పి.జయశ్రీ, ఆర్.రేణుక రాష్ట్ర జట్టుకు ఎంపికై జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. 2020లో నూజివీడు కళాప్రపూర్ణ శ్రీరాజా బహుదూర్ 44వ మెమోరియల్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ చాంపియన్‌గా జట్టును నిలిపారు. 2018 రాష్ట్ర స్థాయి పోటీల్లో చాంపియన్‌షిప్ సాధించిన జిల్లా జట్టులో వీరి ప్రాఽతినిధ్యం ఉంది.
నిరంతర సాధనతోనే విజయం
ఇలాంటి విజయాలు ఎంతో స్పూర్తి, ఉత్సాహం ఇస్తాయి. మొట్టమొదట నిర్వహించిన అండర్–23 టోర్నీ గెలవడం చాలా గొప్పగా ఉంది. క్రమం తప్పకుండా సాధన చేయడం వల్లే అండర్–23 బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ సాధించాం. రోజూ ఉదయం, సాయంత్రం సాధన చేస్తాం. జాతీయ పోటీల్లో పాల్గొన్న అనుభవం ఉపయోగపడింది.
జి.నాగదేవి
పక్కా డిఫెన్స్‌తో ఆడాం
కోచ్ మురళీకృష్ణ సలహాలతో ప్రత్యర్ధి జట్లు ప్లేయర్లను ఏలా అడ్డుకోవాలో ప్లాన్ వేసుకున్నాం. టోర్ని మొత్తం పక్కా డిఫెన్స్‌తో ఆడాం. దీనివల్ల అనంతపురం, గుంటూరు, విశాఖపట్టణం లాంటి పెద్ద జట్లును సైతం అడ్డుకున్నాం. దీని కారణంగా టోర్నిలో వరుస విజయాలు సాదించాం. ఫైనల్‌లో సైతం పక్కా ప్లాన్‌లో ఆడి విజయం సాదించాం.
పి.వినయశ్రీ, ఏలూరు
బాస్కెట్‌బాల్‌లో జిల్లా బాలికల జయకేతనం
అండర్–23 టోర్నీ కై వసం
రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్న వైనం
Comments
Please login to add a commentAdd a comment