ఆగని కోడిపందేలు
కామవరపుకోట: మండలంలో టీడీపీ నాయకులు అండదండలతో యథేచ్ఛగా కోడిపందేలు సాగుతున్నాయి. ఆదివారం మండలంలో ఈస్ట్ యడవెల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అనుకుని, కోడి పందేలు నిర్వహించడంపై గ్రామస్తులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కోడిపందేలు నిర్వహిస్తుండగా ఒక విలేకరి ప్రశ్నించేందుకు వెళ్లగా అతనిపై నిర్వాహకులు దాడికి ప్రయత్నించారు. సదరు వ్యక్తి తడికలపూడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది, తడికలపూడి పోలీసులను వివరణ కోరగా ఫిర్యాదు అందినట్లు వారు తెలిపారు.
ఆలయ పరిసరాల్లో
గుండెపోటుతో వ్యక్తి మృతి
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయ ఆవరణలో ఆదివారం చిన్నారులకు చెవిపోగులు కుట్టిన అనంతరం ఒక వ్యక్తి గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. దేవస్థానం ఆంబులెన్స్‌లో స్థానిక పీహెచ్‌సీకి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. చినవెంకన్న వెంకన్న ఆలయంలో శివ అనే వ్యక్తి చెవిపోగులు కుడుతుంటాడు. గుడివాడకు చెందిన అతని మావయ్య ఎం.శ్రీనివాసరావు(65) కొద్దిరోజులుగా శివ వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో శ్రీనివాసరావు ఆదివారం మధ్యాహ్నం తన అల్లుడు శివ వద్దకు వెళ్లి, భోజనానికి ఇంటికి పంపించాడు. ఆ తరువాత చిన్నారులకు అతడే చెవిపోగులు కుట్టాడు. విషయాన్ని ఫోన్ చేసి తన అల్లుడికి చెబుతుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై, కుప్పకూలి పడిపోయాడు. స్థానికులు పీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడు.
ఆర్థిక సమస్యలతో
వ్యక్తి ఆత్మహత్య
పెంటపాడు: ఆర్థిక సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం పెంటపాడు మండలం పడమర విప్పర్రులో ఆదివారం జరిగింది. పెంటపాడు ఎస్సై స్వామి వివరాల ప్రకారం విప్పర్రు గ్రామానికి చెందిన చందనాల వెంకటేశ్వరరావు(50) గ్రామంలో వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య ఉమాదేవితో పాటు, ఇద్దరు కుమార్తెలున్నారు. వారికి ఇటీవల వివాహాలయ్యాయి. చిన్న కుమార్తె ఇటీవల అనారోగ్య సమస్యతో మృతి చెందింది. గత కొంతకాలంగా అప్పులు ఎక్కువ కావడంతో అతను ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఉదయం పొలంలోని గేదెల పాక వద్ద దూలానికి తాడుతో ఉరివేసుకొని మృతిచెందాడు. స్థానికులు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై స్వామి తెలిపారు.
సినీ ఫక్కీలో సెల్‌ఫోన్ చోరీ
ద్వారకాతిరుమల: కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం సెల్‌ఫోన్ చోరీ సినీ ఫక్కీలో జరిగింది. కొయ్యలగూడెం మండలం రాజవరంకు చెందిన ఉస్సే అంజిబాబు ఇంటికి బైక్‌పై వెళుతున్నాడు. మధ్యలో ద్వారకాతిరుమలలో కొత్తబస్టాండు వద్ద ఒక దుకాణంలోకి వెళ్లి, పనులు ముగించుకుని బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఒక వ్యక్తి రోడ్డుపై తన బండితో సహా కిందకు ఒరిగిపోయి, పడిపోతున్నానంటూ అరిచాడు. అంజిబాబు అతడికి సాయం చేద్దామని వెళ్లి బండిని లేపాడు. ఒక్కసారిగా ఆ దొంగ అంజిబాబు షర్ట్ జేబులోని సెల్‌ఫోన్‌ను లాక్కుని, రెప్పపాటులో బైక్‌పై అక్కడి నుంచి ఉడాయించాడు. బాధితుడు స్థానిక పోలీసులను ఆశ్రయించగా, వారు ఘటన జరిగిన ప్రదేశంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment