వంతెన.. ఇంకెన్నాళ్లీ యాతన?
●
నిర్మాణం పూర్తిచేయాలి
పట్టెన్నపాలెంలో జల్లేరువాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. వర్షాలు, వరదల సమయంలో రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉంది. వాగుల ప్రవాహంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికైనా పనులు మొదలుపెట్టి వర్షాకాలం నాటికి పనులు పూర్తి చేసేలా కృషి చేయాలి.
– కోర్సా జలపాలు, మాజీ సర్పంచ్, రెడ్డిగణపవరం, బుట్టాయగూడెం మండలం
వాగు దాటాలంటే సాహసం
వర్షాకాలం వచ్చిందంటే బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం మండలాల ప్రజలకు ఇబ్బందులే. వాగు దాటాలంటే సాహసం చేయాల్సి వస్తుంది. విద్యార్థులు, రైతుల బాధలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. గుబ్బల మంగమ్మ గుడికి వెళ్లే ప్రధాన మార్గం ఇదే. బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ఇబ్బందులు తొలగించాలి.
– జి.పవన్, రెడ్డిగణపవరం, బుట్టాయగూడెం మండలం
బుట్టాయగూడెం : ఏళ్లు గడుస్తున్నా పట్టెన్నపాలెం సమీపంలోని జల్లేరు వాగు సమస్య పరిష్కారం కనిపించడంలేదు. వర్షాలు, వరదలు వస్తే వాగు వరద ఉధృతికి ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతం. వాగు దాటేందుకు ఇబ్బందులు పడుతున్నా అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుట్టాయగూడెం–జంగారెడ్డిగూడెం మండలాల సరిహద్దులో పట్టెన్నపాలెం సమీపంలో జల్లేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వంలో సుమారు రూ.500 లక్షల అంచనా వ్యయంతో శ్రీకారం చుట్టారు. పనులు ప్రారంభించగా అసంపూర్తిగానే నిలిచిపోయాయి.
35 గ్రామాల ప్రజలకు ఇబ్బంది
పట్టెన్నపాలెం సమీపంలోని జల్లేరు వాగు బుట్టాయగూడెం మండలం సరిహద్దులో ఉంది. ఈ వాగు ప్రవహిస్తే బుట్టాయగూడెం మండలంలోని సుమారు 35 గిరిజన గ్రామాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. విద్యార్థులు, రైతులు, గ్రామస్తులు, వ్యాపారులు వాగు దాటేందుకు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా గుబ్బల మంగమ్మ గుడికి వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారిగా ఉంది. బుట్టాయగూడెం మండలంలోని గ్రామాల్లోని ప్రజలు ఈ వాగుదాటే జంగారెడ్డిగూడెం ఆస్పత్రులకు, వ్యాపారాలకు, ఇతర అవసరాలకు వెళ్లాల్సి ఉంటుంది. అంత ప్రాముఖ్యమైన జల్లేరు వాగుపై వంతెన పనులు చేపట్టడంలో పాలకులు, అధికారుల నిర్లక్ష్య తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికై నా వంతెన నిర్మాణం పూర్తి చేసేందుకు కృషి చేయాలని కోరుతున్నారు.
వైఎస్సార్ పాలనలో నాలుగు బ్రిడ్జిలు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో కొండ వాగుల ప్రవాహంలో సంభవించే ప్రమాదాలను నివారించేందుకు నాలుగు చోట్ల బ్రిడ్జిల నిర్మాణానికి సుమారు రూ.29 కోట్ల నిధులను మంజూరు చేశారు. వీటితో పడమర రేగులకుంట, గాడిదబోరు, నందాపురం, రెడ్డిగణపవరం సమీపంలోని రౌతుగూడెం వాగుపై హైలెవెల్ బ్రిడ్జిలను నిర్మించి ప్రారంభించారు. అప్పటి నుంచి ఆయా వాగుల ప్రవాహ సమయంలో ప్రజలకు కష్టాలు తీరాయి. అయితే పట్టెన్నపాలెం వాగుపై ప్రతిపాదనలు తయారుచేసిన సమయంలో వైఎస్సార్ అకాల మరణంతో పనులు అటకెక్కాయి. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.500 లక్షల టీఎస్పీ నిధులు కేటాయించినా పనులు పూర్తికాలేదు.
సా..గుతున్న పట్టెన్నపాలెం బ్రిడ్జి నిర్మాణం
వానొస్తే రాకపోకలకు ఆటంకం
ముందుకు సాగని పనులు
కూటమి నేతలు పట్టించుకోవాలని వినతి
Comments
Please login to add a commentAdd a comment