మామిడికి మంచు దెబ్బ
చింతలపూడి: ప్రకృతి సహకరించకపోవడంతో ఈ ఏడాది మామిడి రైతులు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. మెట్ట ప్రాంతంలో మామిడి పంట మంచు దెబ్బకు విలవిల్లాడుతూంది. గత రెండేళ్లుగా ధర ఆశాజనకంగా ఉండటంతో రైతులు మామిడి పంటపై గంపెడాశతో ఉన్నారు. సంవత్సరమంతా సస్యరక్షణ చేపట్టి పంటను కాపాడుకుంటుంటే.. మంచు కారణంగా పూత, పిందె మాడిపోయి నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు రాష్ట్రంలో ద్వితీయ స్థానం, జిల్లాలో ప్రధమ స్థానం ఆక్రమించి విదేశాలకు సైతం ఎగుమతి చేసిన మామిడి పంటకు మెట్ట ప్రాంతంలో గడ్డు కాలం ఏర్పడింది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా మామిడి తోటలను రైతులు గత్యంతరం లేక తొలగిస్తున్నారు. గతంలో నియోజకవర్గంలో 50 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న మామిడి తోటలు క్రమంగా 7 వేల ఎకరాలకు తగ్గిపోయాయి. ఏటా ఇక్కడి నుంచి ఢిల్లీ, ముంబయ్, కోల్‌కతా, నాగపూర్, పూనా, అహ్మదాబాద్, తమిళనాడు, కేరళ వంటి ప్రాంతాలకు మామిడి కాయలు ఎగుమతి అవుతాయి. రాష్ట్రంలో విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రి, గుంటూరు, తెనాలి వంటి వ్యాపార కేంద్రాలకు ఎగుమతి చేస్తారు. మామిడి సీజన్‌లో వేలాది మంది కూలీలకు ఇక్కడ పనులుండేవి. ఎగుమతి చేయడానికి, బుట్ట ప్యాకింగ్‌కు కూలీలు ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చేవారు. దిగుబడిపై ఉన్న అనుమానాలతో వ్యాపారులు ముందుకు రాక పోవడంతో కూలీలకు పనులు లేకుండా పోయాయి.
దిగుబడిపై ఆందోళన చెందుతున్న రైతులు
మంచుకు మాడుతున్న పూత
మంచు కారణంగా మామిడిపూత మాడిపోతోంది. నెల రోజులుగా విపరీతంగా కురుస్తున్న మంచుకు దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉంది. మామిడి కాయల ఎగుమతికి ఇక్కడ సరైన సౌకర్యాలు లేవు. సస్య రక్షణకు ఎరువులు, పురుగు మందులకు వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ఫలితం లేకపోవడంతో తోటలను నరికి వేశాం.ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకోవాలి చేపూరి ఖాదర్ బాబు– రైతు, శెట్టివారిగూడెం
Comments
Please login to add a commentAdd a comment