ఉత్సవాలు కళకళలాడేలా.. | - | Sakshi
Sakshi News home page

ఉత్సవాలు కళకళలాడేలా..

Published Mon, Feb 3 2025 1:56 AM | Last Updated on Mon, Feb 3 2025 1:57 AM

ఉత్సవ

ఉత్సవాలు కళకళలాడేలా..

ప్రత్యేక ఆకర్షణగా కాస్టింగ్‌ నాటకాలు

20 రోజుల పాటు బయటి కళాపరిషత్‌ల నాటక ప్రదర్శనలు ఉంటే పది రోజుల పాటు ఉత్సవ కమిటీ ప్రత్యేకంగా సమర్పించే కాస్టింగ్‌ నాటకాలు ప్రత్యేక ఆకర్షణ. సత్యహరిశ్చంద్ర, శ్రీకృష్ణ తులాభారం, బాలనాగమ్మ, కురుక్షేత్రం, గయోపాఖ్యానం తదితర పౌరాణిక నాటకాల్లో ఒక్కో పాత్రకు ఉభయ రాష్ట్రాల్లో పేరొందిన నలుగురు ఐదుగురు కళాకారులను ఎంపిక చేసి వారితో ఆయా నాటకాలను ప్రదర్శిస్తుంటారు. ప్రముఖ నాటకాల్లోని ముఖ్య ఘట్టాలతో రంగస్థల ఆణిముత్యాలు, రెండు రత్నములు, మూడు రత్నాలు, పంచ రత్నాలు పేరిట ప్రత్యేక నాటకాలు ఉంటాయి. ట్రూపు ప్రదర్శనల కన్నా కాస్టింగ్‌కు నాలుగింతలు ఎక్కువే ఖర్చు చేస్తారు. వీటిని చూసేందుకు ఎందరో కళాభిమానులు వస్తుంటారు. లాభాపేక్షతో కాకుండా అమ్మవారిపై భక్తిభావంతో రావడం వల్ల భారీస్థాయిలో జరిగే ఉత్సవాలకు ఖర్చు తక్కువగానే ఉంటుందని కమిటీ సభ్యులు చెబుతున్నారు.

సాక్షి, భీమవరం: నీరుల్లి కూరగాయలు, పండ్ల వర్తక సంఘం 60 ఏళ్లుగా మావుళ్లమ్మ ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఉత్సవాల వ్యయం తొలుత రూ.5 వేలతో మొదలై ఇప్పుడు రూ.కోటికి పైనే అవుతోంది. ఔరా అనిపించే విద్యుత్‌ సెట్టింగులు, రోజూ మధ్యాహ్నం మొదలై అర్ధరాత్రి వరకు సాగే కళా ప్రదర్శనలు, 30 వేల మంది నుంచి 50 వేల మంది భక్తుల రాకతో 61వ వార్షిక ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

ఉత్సవాల్లో సంప్రదాయ కళారూపాలకు పెద్దపీ ట వేస్తారు. భజనలు, పారాయణాలతో మొదలై కూచిపూడి/భరత నాట్యం, హరికథ/బుర్రకథ కాలక్షేపం, సంగీత విభావరి, అనంతరం సాంఘిక/ పౌరాణిక నాటకాల ప్రదర్శనతో ఆ రోజు ముగుస్తుంది. ఉత్సవాల నిర్వహణపై ఏటా కమిటీ బుక్‌లెట్‌ను విడుదల చేస్తుంది. గతంలో తెల్లవారే వరకు ప్రదర్శనలు సాగితే కోవిడ్‌ అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఉంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వెయ్యి మందికి పైగా కళాకారులు, డోలక్‌, మృదంగం, హార్మోనియం, కిలారి నెట్‌ వాయిద్యకారులు, రైటర్లు, డైరెక్టర్లు, మేకప్‌మెన్లు అమ్మవారి సన్నిధిలో తమ కళారూపాలను ప్రదర్శిస్తారు.

ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి..

బాపట్ల జిల్లా చెరుకుపల్లి ఉషోదయ నాట్యమండలి, గుడివాడ జై నాట్యమండలి, కళారంజని ఆర్ట్స్‌ అసోసియేషన్‌, విజయదుర్గా నాట్యమండలి, గుంటూరు శ్రీశ్రీనివాస చైతన్య కళా నాట్యమండలి, సమతా నాటక మండలి, సంపత్‌ నగర్‌ శ్రీబాల సరస్వతి నాట్యమండలి, రాజమహేంద్రవరం ఉమాశ్రీవాణి కళాసారథి, మిలటరీ మాధవరం జగత్‌ విజేత నాట్యమండలి తదితర పేరొందిన ఎన్నో సంస్థల కళాకారులు ట్రూపు ప్రదర్శనలిస్తున్నారు. దేవీ మహత్యం, మాయాబజారు, శ్రీవల్లీ కల్యాణం, మోహినీ భస్మాసుర, పల్నాటి యుద్ధం, నాలుగు రత్నాలు తదితర పౌరాణిక, సాంఘిక, పద్య నాటకాలు, వైరెటీ బుర్రకథలతో కళాభిమానులను అలరిస్తున్నారు.

విద్యుత్‌ కాంతులతో శోభ

విద్యుత్‌ కాంతులు ఉత్సవాలకు మరింత శోభను తెస్తున్నాయి. ఆలయం ప్రాంగణం, ఆలయం ముందు, వెనుక భాగాల్లో మూడు డెకరేషన్‌ సంస్థలు పోటాపోటీగా భారీ సెట్టింగులతో ఆలయ ఆవరణను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశాయి.

సంప్రదాయ నృత్య భంగిమ

సిరులతల్లి.. కల్పవల్లి.. భక్తులపాలిట కొంగు బంగారం భీమవరం మావుళ్లమ్మ ఉత్సవాలు కళలకు కాణాచిగా నిలుస్తున్నాయి. ఏటా నెలరోజులపాటు నిర్వహించే ఉత్సవాల్లో సంప్రదాయ కళారూపాలకు పెద్దపీట వేస్తున్నారు. పౌరాణిక, జానపద, హరికథ, నృత్య ప్రదర్శనలు ఏర్పాటుచేస్తూ కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. సాధారణంగా గ్రామదేవతల ఉత్సవాలు రెండు మూడు రోజుల్లో ముగిసిపోతే.. అందుకు భిన్నంగా భీమవరంలో ఏటా భోగి పండుగ రోజున మొదలై ఫిబ్రవరి రెండో శుక్రవారం వరకు ఉత్సవాలు జరగడం ప్రత్యేకం.

వైభవంగా భీమవరం మావుళ్లమ్మ ఉత్సవాలు

సంప్రదాయ కళారూపాలకు అగ్రపీఠం

హరికథ, నృత్య, పౌరాణిక, జానపద ప్రదర్శనల ఏర్పాటు

కళాకారులకు ప్రోత్సాహం

వెయ్యి మందికి పైగా కళాకారులు, వేలలో సందర్శకుల రాక

వందల మంది కళాకారులు

సత్యహరిశ్చంద్రలో చంద్రమతి, రామాంజనేయ యుద్ధంలో శాంతిమతి పాత్రలు చేస్తుంటాను. నేర్చుకున్న కళను అమ్మవారి సన్నిధిలో ప్రదర్శించడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. రెండు రాష్ట్రాల నుంచి నెల రోజుల పాటు వందల మంది కళాకారులు వస్తుంటారు.

– నంద్యాల సత్యకుమారి, కళాకారిణి, ఖమ్మం

కళాకారులకు ప్రాధాన్యమిస్తూ..

శ్రీకృష్ణుని పాత్రతో నాటక రంగంలో నా అనుభవం ఐదున్నర దశాబ్దాలు అయితే నాలుగు దశాబ్దాలుగా మావుళ్లమ్మ ఉత్సవాల్లో ప్రదర్శనలిస్తున్నాం. ఉత్సవ కమిటీ కళారంగానికి ప్రాధాన్యమిస్తూ ప్రత్యేకంగా కాస్టింగ్‌ నాటకాలను ప్రదర్శించడం అభినందనీయం.

– కందుల గునేశ్వరరావు, కళాకారుడు, విజయనగరం

No comments yet. Be the first to comment!
Add a comment
ఉత్సవాలు కళకళలాడేలా.. 1
1/5

ఉత్సవాలు కళకళలాడేలా..

ఉత్సవాలు కళకళలాడేలా.. 2
2/5

ఉత్సవాలు కళకళలాడేలా..

ఉత్సవాలు కళకళలాడేలా.. 3
3/5

ఉత్సవాలు కళకళలాడేలా..

ఉత్సవాలు కళకళలాడేలా.. 4
4/5

ఉత్సవాలు కళకళలాడేలా..

ఉత్సవాలు కళకళలాడేలా.. 5
5/5

ఉత్సవాలు కళకళలాడేలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement