క్లాప్ ఆటోలను కొనసాగించాలి
ఏలూరు (టూటౌన్): ఏలూరు నగరపాలక సంస్థలో మూడేళ్లుగా క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) పేరుతో ఇంటింటా చెత్త సేకరిస్తున్న 60 ఆటోలను ఈనెల 1వ తేదీ నుంచి కూటమి ప్రభు త్వం నిలిపివేసింది. దీంతో 60 మంది డ్రైవర్లు రోడ్డున పడ్డారు. క్లాప్ ఆటోలను కొనసాగించాలని, 60 మంది డ్రైవర్లను విధుల్లోకి తీసుకోవాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.సోమయ్య డిమాండ్ చేశారు. స్థానిక పవర్‌పేట కార్యాలయంలో ఆదివారం యూనియన్ అధ్యక్షుడు వి.రాజు అధ్యక్షతను సమావేశం నిర్వహించారు. ఇంటింటా చెత్త సేకరణ నిలిపివేయడం దారుణమని సోమయ్య అన్నారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు లావేటి కృష్ణారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.జాన్ బాబు మాట్లాడుతూ నోటీసులు ఇవ్వకుండా డ్రైవర్లను అక్రమంగా తొలగించడం అన్యాయమన్నారు. సమావేశంలో క్లాప్ ఆటో డ్రైవర్ల నాయకులు గణేష్, శ్రీను, కుమార్, 60 మంది డ్రైవర్లు పాల్గొన్నారు.
మానవత్వం చాటుకున్న జీలుగుమిల్లి ఎస్సై
బుట్టాయగూడెం : రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుడిని జీలుగుమిల్లి ఎస్సై నవీన్‌కుమార్ తన వాహనంలో జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రిలో చేర్పించి మానవత్వం చాటుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. జీలుగుమిల్లి మండలం నిర్వాసిత కాలనీ బోడిగూడేనికి చెందిన కలుగుల ప్రసాద్ అనే యువకుడు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం సమీపంలో కారు ఢీ కొట్టింది. దీంతో ప్రసాద్ తీవ్రంగా గాయపడి రోడ్డుపై పడి ఉండగా అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పోలీసులకు, 108కు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఇక్కడకు చేరిన ఎస్సై నవీన్‌కుమార్ క్షతగాత్రుడిని తన వాహనంలో ఎక్కించుకుని జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. 108 వాహనం వచ్చే వరకూ ఆగకుండా ప్రసాద్‌ను ఆస్పత్రిలో చేర్చడంపై ఎస్సై ను పలువురు అభినందించారు.
12 నుంచి రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు
భీమవరం: మూగ, చెముడు క్రీడాకారుల 5వ రాష్ట్రస్థాయి టీ–20 క్రికెట్ చాంపియన్‌షిప్ పో టీలు ఈనెల 12, 13 తేదీల్లో భీమవరంలో నిర్వహించనున్నారు. పోటీల బ్రోచర్‌ను రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తన కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరించారు. అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు చెరుకువాడ రంగసాయి, అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు భూపతిరాజు మురళీ కృష్ణంరాజు, సీహెచ్ తాతారావు మాట్లాడుతూ భీమవరం గన్నాబత్తుల క్రీడా మైదానంలో పో టీలు నిర్వహిస్తామని, 10 జట్లు పాల్గొంటాయన్నారు. పోటీలకు డీఎన్నార్ కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు వెంకట నరసింహరాజు, గాదిరాజు సత్యనారాయణరాజు సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు.
డ్రైవర్ నియామకంపై అధికారుల దృష్టికి తీసుకెళ్లాం
తణుకు అర్బన్ : ‘కుంటుపడ్డ పశు వైద్యం’ శీర్షికన ‘సాక్షి’ లో ఆదివారం ప్రచురితమైన కథనానికి రాష్ట్ర పశు ఆరోగ్య సంస్థ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎల్‌కే సుధాకర్ స్పందించారు. తణుకు మండలంలోని 1962 పశు వైద్య అంబులెన్స్ వాహనానికి డ్రైవర్ లేని కారణంగా తొమ్మిది నెలలుగా అందుబాటులో లేదని, ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టిలో ఉంచామని చెప్పారు. అత్యవసర కేసులను అత్తిలిలో అందుబాటులో ఉన్న మరో వాహనం ద్వారా అందిస్తున్నామన్నారు. డ్రైవర్ నియామకం కోసం ఉన్నతాధికారులకు నివేదించామని డీడీ సుధాకర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment