వాయు కాలుష్యానికి విరుగుడు | Pollution And Control Methods | Sakshi
Sakshi News home page

వాయు కాలుష్యానికి విరుగుడు

Published Sat, Nov 4 2023 4:43 AM | Last Updated on Sat, Nov 4 2023 5:32 AM

Pollution And Control Methods - Sakshi

ఢిల్లీ మహానగరం ఇప్పటికే వాయుకాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. చలిని తట్టుకోవడానికి చలిమంటలు వేయడం, పంట పూర్తయిన తర్వాత కొయ్యకాళ్లను కాల్చడం, రవాణా వాహనాల నుంచి వచ్చే పొగ, అవి నిరంతరం లేపే ధూళి... ఇవన్నీ వాయు నాణ్యతను దారుణంగా తగ్గిస్తున్నాయి. పైగా రానున్నది దీపావళి పండుగ కావడంతో ఈ ఆందోళన మరింత పెరుగుతోంది. వాయు కాలుష్య సమస్య ఢిల్లీలో తీవ్రంగా ఉన్నప్పటికీ, దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ ఇది పట్టించుకోవాల్సిన అంశమే. ఈ తీవ్ర సమస్యను ఎదుర్కోవడానికి, ఉద్గారాల జాబితా అని చెబుతున్న కారకాల పరిమాణంపై కేవల సమాచారం సరిపోదు. ఈ ఉద్గారాల మూలాలపై డేటా అందుబాటు లోకి వచ్చినప్పుడు మాత్రమే ప్రభావవంతమైన వ్యూహాలను అభివృద్ధి చేయవచ్చు. ప్రాథమికంగా ఉన్న సమాచారంతో కొన్ని సమర్థవంత మార్గాలనైతే చేపట్టవచ్చు. 

మనం దీపావళికి దగ్గరవుతున్న కొద్దీ, గాలి నాణ్యత గురించిన ఆందోళన ‘జాతీయ రాజధాని ప్రాంతం’(నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ – ఢిల్లీ)లో ఊపందుకుంటుంది. ఈ ఏడాది కూడా అదే జరుగుతోంది. చలిని తట్టుకోవడానికి కలపను కాల్చడం, తదుపరి పంటకు నేలను సిద్ధం చేయడం కోసం పంట కోతల తర్వాత మిగిలిన చెత్తను తగులబెట్టడం, రవాణా వాహనాల నుంచి ఉద్గారాలు వెలువడటం, అనేక మూలాధారాల నుండి వచ్చే ధూళి కలిసి ఒక ప్రాణాంతక మిశ్రమాన్ని సృష్టిస్తాయి. కొన్నేళ్లుగా ప్రజలు తమ నివాసాల నుంచి బయటకు రావడం కూడా క్షేమకరం కాని పరిస్థితి. స్పష్టంగా చెప్పాలంటే, ఇది కొనసాగకూడదు. పరిష్కారాన్ని కనుగొనడానికి, ఢిల్లీ ప్రభుత్వం గాలి నాణ్యతా నిర్వహణ కోసం ఒక కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసింది.

ఈ తీవ్ర సమస్యను ఎదుర్కోవటానికి వ్యూహాలను రూపొందించడం కోసం, ఉద్గారాల జాబితా అని చెబుతున్న కాలుష్య కారకాల పరిమాణంపై కేవలం సమాచారం సరిపోదు. ఈ ఉద్గారాల మూలాలపై డేటా అందుబాటులోకి వచ్చినప్పుడు మాత్రమే ప్రభావ వంతమైన వ్యూహాలను అభివృద్ధి చేయవచ్చు. వాటి కాలాను గుణమైన వైవిధ్యాలతోపాటు, ఈ ప్రతి ఒక్క మూలాధారం నుండి ఉద్గారాల వాటా ఎంత అనేది కీలకం. గాలి నాణ్యతా నిపుణులు దీనినే మూల విభజనగా సూచిస్తారు. సరళంగా చెప్పాలంటే, మనం ఎదుర్కొనే కాలుష్య స్థాయికి వివిధ కార్యకలాపాలు ఎలా కారణం అవుతున్నాయనేది ఇది మనకు తెలియజేస్తుంది.

ఈ ప్రతి మూలాధారం నుండి వచ్చే మొత్తం ఉద్గారాల వాటా ఏడాది పొడవునా లేదా రోజంతా కూడా స్థిరంగా ఉండదు. ఇంకా, అవి నగరంలోని వివిధ ప్రాంతాలలో కూడా మారుతూ ఉంటాయి. అందువల్ల, రోజులో ఏ సమయంలో లేదా సంవత్సరంలో ఏకాలంలో, లేదా నగరంలోని ఏయే ప్రదేశాలలో కాలుష్యానికి దోహద పడుతున్నవి ఏమిటన్నది అర్థం చేసుకోవడం ముఖ్యం. 

పనికొచ్చే అధ్యయనాలు
నిపుణులు మూలాలను కనుగొనడానికి ప్రయత్నించినప్పుడు సాధారణంగా నాలుగు ముఖ్యమైన అధ్యయనాలను సూచిస్తుంటారు. అవి: ఒకటి, ఢిల్లీ కోసం... ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, కాన్పూర్‌ సమర్పించిన కాలుష్య మూలాల విభజన, మూలాల జాబితా (2015); రెండు, ది ఎనర్జీ అండ్‌ రిసోర్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ (తేరి) అధ్యయనం (2018); మూడు, ఆటోమోటివ్‌ రీసెర్చ్‌ అసోసి యేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యయనం (2018); ఇక నాలుగవది, సిస్టమ్‌ ఆఫ్‌ ఎయిర్‌–క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ రీసెర్చ్‌(సఫర్‌) అధ్యయనం (2018).

గాలి కాలుష్యానికి వివిధ కారకాలు అందిస్తున్న సాపేక్ష సహ కారంలో గణనీయ స్థాయిలో సీజన్‌ పరమైన తేడాలు ఉన్నట్లు ఈ అధ్యయనాలు చూపుతున్నాయి. వేసవిలో, ధూళి ప్రభావం దాదాపు 31–34 శాతం వరకు పెరుగుతుంది. శీతాకాలంలో దాని వాటా 6–15 శాతం వరకు తగ్గుతుంది. వాహనాలు, పరిశ్రమలు, బయోమాస్‌ దహనం తోడ్పాటు శీతాకాలంలో దాదాపు 85–94 శాతం వరకు పెరుగుతుంది. ముఖ్యంగా ద్వితీయ కణాల వాటా (సల్ఫర్‌ డయా క్సైడ్, నైట్రోజన్‌ ఆక్సైడ్లు, అమ్మోనియా, అస్థిర కర్బన సమ్మేళనాలు వంటి దహన మూలాల నుండి వాతావరణంలో ఏర్పడేవి) శీతాకా
లంలో 26–30 శాతంగా, వేసవిలో 15–17 శాతంగా ఉంటుంది.

స్పష్టంగా, రవాణా, రహదారిపై ధూళి అనేవి సంవత్సరం పొడవునా గాలి కాలుష్యానికి ముఖ్యమైన దోహదకారులు. అయితే, అధ్యయనాలు జరిగిన సమయంలో కొయ్యకాళ్ల దహనం ప్రధాన సమస్యగా లేదు. అందువల్ల దాని ప్రభావం గురించి తగినంత సమాచారం లేదు. అయినప్పటికీ, గాలి కాలుష్యానికి అధికంగా దోహదం చేస్తున్న కొయ్యకాళ్ల దహనం ఒక నెల వ్యవధిలో మాత్రమే జరుగుతుంది.

ఆకుపచ్చటి రోడ్లు
రహదారిపై ధూళిని తగ్గించడానికి, మోటారు వాహనాల నుండి ఉద్గారాలను తగ్గించడానికి తీసుకోగల చర్యలు దీర్ఘకాలికమైనవి. రహదారి దుమ్ముతో వ్యవహరించడానికి రోడ్డు పక్కలను పచ్చగా మార్చడం లేదా వాటిపై నీటిని చిలకరించడానికి గట్టి ప్రయత్నం అవసరం. ఢిల్లీ ప్రభుత్వం దీన్ని తప్పనిసరి చేయాలి.

రవాణా రంగం నుండి ఉద్గారాలను తగ్గించడానికి అనేక విధాలుగా ప్రయత్నించవచ్చు. వాటిలో ముఖ్యమైనది వ్యక్తిగత మోటారు వాహనాల నుండి ప్రజా రవాణాకు మారేలా గణనీయంగా ప్రభావితం చేయడం. ఢిల్లీ నగరంలో ఇప్పటికే 400 కిలోమీటర్ల మెట్రో రైలు నెట్‌వర్క్‌ పనిచేస్తుండగా, చిట్టచివరి గమ్యం వరకూ అనుసంధానం లేకపోవడం వల్ల దాని వినియోగానికి ఆటంకం ఏర్పడుతోంది. మెట్రో రైలు వ్యవస్థను పూర్తి చేయడానికి, పబ్లిక్‌ బస్సు వ్యవస్థలను విస్తృతంగా పెంచడం, మెరుగుపరచడం ఎంతగానో అవసరం. వ్యక్తిగత మోటారు వాహన వినియోగదారులు కూడా ఆకర్షితులయ్యేలా అధిక నాణ్యతా సేవలను అందించే స్థానిక బస్సు సేవలను నిర్వహించడం అవసరం. 

ఇరుగుపొరుగు వారికి సేవ చేయడానికి స్థానిక సర్క్యులేటర్‌ సేవలను నిర్వహించడం కూడా సరైన దిశలో ఒక అడుగు. అత్యధికంగా ట్రాఫిక్‌ ఉండే రహదారులను గుర్తించడం ద్వారా వాటిని వన్‌ వేలుగా మార్చడం, ట్రాఫిక్‌ ప్రవాహాన్ని సులభతరం చేయడానికి, పనిలేకుండా ఉన్న వాహనాల నుండి ఉద్గారాలను తగ్గించడానికి దోహదపడుతుంది. ఇంటెలిజెంట్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌ను (ఐటిఎంఎస్‌) పరిచయం చేయడం కూడా ట్రాఫిక్‌ ప్రవాహాన్ని మెరుగుపరచడానికీ, నిష్క్రియాత్మక ఉద్గారాలను తగ్గించడానికీ మరొక మార్గం. ఇటీవల ప్రతిపాదించిన ప్రీమియం బస్‌ అగ్రిగేటర్‌ పథకం సరైన దిశలో ఒక అడుగు.

పార్కింగ్‌ రుసుములను పెంచడంతోపాటు, రద్దీ సమయంలో అధికంగా వసూలు చేసే వ్యవస్థను ప్రవేశపెట్టడం వలన ప్రజలు వారి వ్యక్తిగత మోటారు వాహనాలను ఉపయోగించకుండా నిరోధించ వచ్చు. ఎలక్ట్రిక్‌ చలనశీలతకు ఇటీవల ఏర్పడుతున్న ప్రాధాన్యత కూడా సరైన దిశలో మరొక అడుగు అని చెప్పాలి. ఎందుకంటే ఎలక్ట్రిక్‌ వాహనాలు వాస్తవంగా ఎటువంటి కాలుష్యాన్నీ విడుదల చేయవు.

చలికాలంలో పేదలకు ఆశ్రయాలు
మరొక ముఖ్యమైన కాలుష్య సహకారి ఏదంటే, ముఖ్యంగా చలికాలంలో వెచ్చగా ఉండటానికి పేద పౌరులు కట్టెలను కాల్చడం. ఈ సమస్యను తగ్గించడానికి, నిరాశ్రయులైన వారి కోసం పెద్ద సంఖ్యలో ఆశ్రయాలను ఏర్పర్చేందుకు అవకాశాలను అన్వేషించాలి. ఈ అశ్రయాలను స్వచ్ఛమైన శక్తి రూపాలను ఉపయోగించి వెచ్చగా ఉంచవచ్చు. ఇటువంటి ఆశ్రయాలు పేదలకు మరింత సౌకర్యవంతమైన గూడును అందించడంతోపాటు వాయు కాలుష్యాన్ని తగ్గించడం అనే ద్వంద్వ ప్రయోజనాలకు కూడా చక్కగా ఉపయోగ పడతాయి. అనేక ఫ్లై ఓవర్ల కింద ఉన్న స్థలాన్ని దీని కోసం ప్రయోజ నకరంగా ఉపయోగించవచ్చు.

ఇంకా, దీన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించడం కోసం రోజులో, సీజన్‌లలో మూలాల విభజన డేటాను సేకరించే వ్యవస్థ అవసరం. ఢిల్లీలోని గాలి నాణ్యత సమస్యలను మరింత శాశ్వత ప్రాతి పదికన అంతం చేసేందుకు ఈ రకమైన సాధారణ డేటా ఉపయోగ పడుతుంది. ‘బిగ్‌ డేటా‘కు ప్రాధాన్యత ఉంటున్న ఈ యుగంలో, ఇది ఎంతమాత్రమూ సమస్య కాకూడదు.
– అనిల్‌ బైజల్, ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ 
– ఓపీ అగర్వాల్, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ డీన్‌
(‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement