● నైతిక విలువలు నేర్పే పర్వదినం ● సామాజిక ప్రయోజనాల సమా
చీకటిని పారదోలి వెలుగును నింపే దివ్యమైన రోజు దీపావళి. ఆశ్వయుజ అమావాస్య రోజున జరుపుకొనే విశిష్టమైన పండుగ ఇది. అజ్ఞానం, దారిద్య్రం, భయం, నిరాశ, కాంతిహీనతలు చీకటికి సంకేతం. భగవంతుడు పరంజ్యోతి స్వరూపుడు. చీకటిని పారదోలగల సమర్థుడు. దీపావళి రోజున వెలిగించే దీపాలు ఈ చెడునంతటినీ పోగొడతాయనే నమ్మకం. దీపం వల్లనే సమస్త కార్యాలు నెరవేరతాయి. మహాలక్ష్మి దీపకాంతులతో జ్యోతి తేజస్సుతో విరాజిల్లుతుంటుంది. అందుకే దీపావళి రోజున నువ్వులనూనె , ఆవు నేతితో ప్రమిదలను నింపి దీపాలను వెలిగిస్తారు. వెలుగుతోనే జగతి అని చాటుతారు. మొత్తం మీద సామాజిక ప్రయోజనాల సమాహారం దీపావళి పర్వదినం.
తెనాలి: దీపావళికి ముందురోజు చతుర్దశి. అదేరోజు నరకాసురుడు అనే రాక్షసుడిని సత్యభామ, శ్రీకృష్ణుడు భీకరయుద్ధంలో సంహరిస్తారు. ఆ దుర్మార్గుడు చెరబట్టిన 16 వేల మంది మహిళలను రక్షిస్తారు. ఆ సంతోషాన్ని అన్ని లోకాల ప్రజలు ఆ మరుసటిరోజైన అమావాస్య నాడు దీపాలు వెలిగించి పండగ రూపంలో పంచుకుంటారు. ఇంటింటా దీపాలు వెలిగించి అతడిలా ఎవరూ ఉండొద్దని హెచ్చరించటం అనేది దీపావళి చాటే సత్ప్రవర్తనగా చెప్పొచ్చు. తమ బిడ్డల వల్ల సమాజానికి కీడు కలుగుతున్నపుడు దుష్టుడైన బిడ్డను శిక్షించటానికి తండ్రితోపాటు తల్లి కూడా పాల్గొనటం, వారి కర్తవ్యాన్ని చాటుతుంది. ఉత్తమ గాథ ఇది. విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి, హిరణ్యాక్షుడు సముద్రంలో పడేసిన భూమిని పైకి తీసుకొచ్చేటపుడు భూదేవికి, విష్ణుమూర్తికి కలిగిన సంతానమే నరకాసురుడు. దేవతలకు జన్మించినప్పటికీ దుష్టపనులు చేయటంతో అసురుడయ్యాడు. కృష్ణావతారంలో ఉన్నపుడు నరకాసురుడు చేస్తున్న దుర్మార్గపు పనులన్నింటినీ ఇంద్రుడు వచ్చి ఏకరువు పెడతాడు. దుష్టశిక్షణ అనివార్యమని తేల్చుకున్న శ్రీకృష్ణుడు, గరుత్మంతుడిపై ఎక్కి యుద్ధానికి బయలుదేరతాడు. అప్పుడు సత్యభామ రూపంలో ఉన్న భూదేవి, తాను కూడా వస్తానని పట్టుబడుతుంది. నరకాసుర సైన్యంతో భీకరంగా యుద్ధం జరుగుతుంది. చివరకు నరకాసురుడు వచ్చేసరికి సత్యభామ ముందుకొస్తుంది. విల్లు అందుకుని సంధించిన అస్త్రం గురి తప్పకుండా శత్రువును సంహరిస్తుంది. అబలగా భావించే సీ్త్ర సమయం వచ్చినపుడు పురుషులను మించిన ప్రతిభను, శక్తిని చాటగలదని ఈ యుద్ధంతో చాటినట్టయింది. నరకాసురునితో జరిగిన యుద్ధంలో సత్యభామ, శ్రీకృష్ణుడు ప్రదర్శించిన అస్త్రశస్త్రాల మెరుపులు, శబ్దాలు భారీగా ఉన్నాయి. నరకుడు పడిపోగానే దేవతలు, మునులు ఆకాశం నుంచి పూలజల్లు కురిపిస్తారు. మరుసటిరోజు అమావాస్య కావటం, ఆ చీకటిని పారదోలి వెలుగును నింపటానికి దీపాలను వెలిగించటం, అస్త్రశస్త్రాల మెరుపులు, ధ్వనులకు బాణసంచా కాల్చటాన్ని పండుగ కలిపింది. దేవతలు చల్లిన పూలు... తారాజువ్వలు, మతాబులు అన్నట్టుగా ఉంది. కాలానుగుణ మార్పులతో దీపావళి అంటే బాణసంచా కాల్చడమే అన్నట్లు తయారైంది. ఈ ఆచారం ద్వాపరయుగంలో లేదు.. కలియుగంలోనే సుమా!
అంతరార్థం ఉంది...
నిజానికి దీపావళి పితృదేవతలను ఆరాధించే పండుగ. లక్ష్మీదేవిని పూజించే పండుగ. దీపావళి నుంచి ఆరంభించి, తర్వాతి రోజు నుంచి వచ్చే కార్తికమాసంలో అన్నిరోజులూ ఇళ్లలో, ఆలయాల్లో దీపాలు వెలిగిస్తూ అగ్నిహోత్రుడిని ఆరాధించటం చూస్తుంటాం. దీపావళిలో నీతి బోధతోపాటు సామాజిక ప్రయోజనాలూ కనిపిస్తాయి. వర్షాలు కురిసి చేలల్లో, రహదారులపై నీరు నిలిచివుంటుంది. దోమలు, ఇతర క్రిమికీటకాల సంహారానికి బాణసంచా కాల్చటం పనికొస్తుందంంటారు. జాగ్రత్తగా కాల్చటం నిప్పును ఎదుర్కోవటం, అగ్ని పట్ల జాగ్రత్తను అలవాటు చేయటంగా చెబుతారు. పెరిగే చలి, క్రిమికీటకాల బాధనుదీపాలు పోగొడతాయి. సత్యభామ, శ్రీకృష్ణుడికి పూజలేమీ చేయకుండా దీపాలు వెలిగించటం, బాణసంచా కాల్చటం, లక్ష్మీపూజ చేయటం వంటి విశేషాల సమాహారం దీపావళి.
Comments
Please login to add a commentAdd a comment