అమరేశ్వరాలయం ముస్తాబు
పెదకాకాని: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీభ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో కార్తిక మాసానికి సంబంధించి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఆలయ అధికారి, ఉప కమిషనర్ గోగినేని లీలా కుమార్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. కార్తిక మాసం శుద్ధ పాడ్యమి నవంబర్ 2 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు రానుంది. ఆలయంలో కార్తిక మాసం సందర్భంగా నిత్యం ఉదయం మహన్యాస పూర్వక రుద్ర జప, రుద్రహోమం, ఏకాదశ రుద్రాభిషేక పూజలు నిర్వహించనున్నారు. పరోక్ష అభిషేక పథకాన్ని కూడా అధికారుల ప్రవేశపెట్టారు. రూ. 2,000 చెల్లించిన వారికి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు జరిపించనున్నారు. నవంబర్ 26న భక్తులచే సామూహిక లక్ష బిల్వార్చన ఉంటుంది. నవంబరు 29న మాస శివరాత్రి రోజు పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పూజలు జరిపించనున్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్‌లను ఏర్పాటు చేయడం చేసినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. భక్తులు ఇబ్బంది పడకుండా త్వరగా దర్శనం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసు, అగ్నిమాపక, పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖల సిబ్బంది సేవలు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. కార్తిక పౌర్ణమి నాడు కోటి దీపోత్సవం ఉంటుందని చెప్పారు. పర్వదినములలో ప్రత్యేక పూల అలంకారం, విద్యుద్దీపాల అలంకరణ ఉంటుందని వివరించారు.
అమరావతి: ప్రసిద్ధ శైవ క్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయం కార్తిక మాసోత్సవాలకు ముస్తాబవుతోంది. సామాన్య భక్తులతో పాటు పంచారామ యాత్రికులకు స్వామి దర్శనం త్వరితగతిన జరిగేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో సునీల్‌కుమార్ తెలిపారు. బుధవారం ఆయన దేవాలయంలో చేసిన ప్రత్యేక ఏర్పాట్ల గురించి వివరించారు. నవంబరు 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కార్తిక మాసంలో భక్తులకు వసతి, ఉచిత దర్శనం, ప్రసాదం, పరిమిత స్థాయిలో అన్నదానానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. స్నాన ఘట్టాలలో తాత్కాలిక మరుగుదొడ్లు, సీ్త్రలు దుస్తులు మార్చుకునే గదులు తదితర సౌకర్యాలను కల్పిస్తున్నామని చెప్పారు. పారిశుద్ధ్య సిబ్బందిని పెంచి ఆలయ పరిశుభ్రంగా ఉంచుతామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment