పర్సన్ ఇన్‌చార్జిగా భార్గవ్ తేజ బాధ్యతల స్వీకరణ
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డు పర్సన్ ఇన్‌చార్జిగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా యార్డు ఆవరణలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యార్డులో పర్యటించారు. క్రయవిక్రయాల తీరు, ప్రస్తుతం మిర్చి ధరలు, బిడ్డింగ్ విధానం, రైతులకు గిట్టుబాటు ధర లభ్యత తదితరాలను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. మిర్చి కమీషన్ షాపులు, రైతు విశ్రాంతి భవనం, ఉచిత భోజన శాల, ఇతర వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా భార్గవ్ తేజ మాట్లాడుతూ.. రాబోవు మిర్చి సీజన్ నాటికి యార్డులో పెండింగ్ పనులను పూర్తి చేస్తామన్నారు. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. కార్యక్రమంలో యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి వినుకొండ ఆంజనేయులు, గ్రేడ్–1 కార్యదర్శి సుబ్రహ్మణ్యం, గ్రేడ్–2 కార్యదర్శి ఆంజనేయ సింగ్. యార్డు ఇన్‌చార్జి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
36,108 బస్తాల మిర్చి విక్రయం
గుంటూరు మార్కెట్ యార్డుకు బుధవారం 29,664 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 36,108 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.8,000 నుంచి రూ. 16,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.7,500 నుంచి 18,000 వరకు లభించింది. ఏసీ కామన్ రకం మిర్చి రూ. 9,000 నుంచి రూ. 16,700 వరకు లభించింది. ఏసీ ప్రత్యేక రకం రూ. 9,500 నుంచి రూ. 18,300 వరకు ధర పలికింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.11,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 23,835 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి వి.ఆంజనేయులు తెలిపారు.
యార్డుకు నేడు సెలవు
గుంటూరు మార్కెట్ యార్డుకు దీపావళి పండుగను పురస్కరించుకుని గురువారం సెలవు ప్రకటించినట్లు యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి వినుకొండ ఆంజనేయులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం యార్డులో యథావిధిగా క్రయ విక్రయాలు జరుగుతాయని పేర్కొన్నారు. శని, ఆదివారం సాధారణ సెలవులు ఉంటాయని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రైతులు గురువారం మిర్చి యార్డుకు సరుకు తీసుకురావద్దన్నారు.
Comments
Please login to add a commentAdd a comment