అంబేడ్కర్ స్మృతివనంపై ఇంత నిర్లక్ష్యమా?
హైకోర్టు న్యాయవాది పెరికల డేనియల్
తెనాలి: విజయవాడలో నిర్మించిన భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనం నిర్వహణలో నిర్లక్ష్యం తగదని, ఇది ఆ మహానుభావుడిని అవమానించడమేనని హైకోర్టు న్యాయవాది పెరికల డేనియల్ అన్నారు. స్థానిక అయితానగర్‌లోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్మృతివనం లోపలిభాగంలో ఉన్న ఏసీలు ఇటీవల పనిచేయటం లేదన్నారు. కరెంటు చార్జీలు భారంగా మారాయని అధికారులు అనటం హాస్యాస్పందంగా ఉందన్నారు. గతంలో ఎల్‌ఈడీ స్క్రీన్స్‌పై విజ్ఞానదాయకమైన క్విజ్ ప్రోగ్రాంలు వచ్చేవని, ప్రస్తుతం ఆపేశారని తెలిపారు. ఎవరి ప్రమేయంతో ఇలా నిలుపుదల చేశారని ప్రశ్నించారు. ఆడిటోరియం నిర్మించారని, ఫుడ్‌కోర్టులు రెండు నిర్మాణంలో ఉండేవని చెబుతూ... ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటని అడిగారు. విజయవాడ మున్సిపల్ కమిషనర్‌కు దీనిపై లేఖ రాసి, ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టరుకు, రాష్ట్రప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి ప్రతులు పంపినట్టు తెలిపారు. తగిన స్పందన వస్తుందని భావిస్తున్నానని అన్నారు. మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్, హైకోర్టు న్యాయవాది దాసరి శ్రీధర్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ స్మృతివనంలో ఏసీ, ఎల్‌ఈడీ స్క్రీన్స్ ప్రదర్శనల వంటివి వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment