పొన్నెకల్లు జెడ్పీ హైస్కూల్ విద్యార్థి మృతిపై విచారణ
పొన్నెకల్లు(తాడికొండ): పొన్నెకల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం డెప్యూటీ డీఈఓ వెంకటేశ్వరరావు పాఠశాలలో విచారణ చేపట్టారు. గత నెల 24న పాఠశాలకు రాకుండా ఇంటి వద్దే ఉన్న 9వ తరగతి విద్యార్థి షేక్ సమీర్ అదే రోజు ఈతకు వెళ్ళి నేల బావిలో మృతి చెందాడు. ఆ రోజు పాఠశాలకు వచ్చిన విద్యార్థులు 9 మంది కూడా సమీర్‌తో కలిసి ఈత కొట్టారని, వారే మనసులో కక్ష పెట్టుకొని సమీర్‌ను చంపి బావిలో పడవేశారని ఆరోపిస్తూ కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణకు వచ్చిన డెప్యూటీ డీఈఓ వెంకటేశ్వరరావు విద్యార్థులను విడివిడిగా విచారణ చేశారు. వారి వద్ద నుంచి లిఖిత పూర్వకంగా వివరణ తీసుకున్నారు. ఘటనపై అప్పట్లో ఎలాంటి ఫిర్యాదు అందలేదంటూ పోలీసులు కేసు నమోదు చేయకుండా ఖననం చేసేందుకు మృతదేహాన్ని అప్పగించారు. సమీర్ తల్లిదండ్రులు పల్నాడు జిల్లా కర్లపూడి గ్రామానికి చెందిన వారు. వారు సమీర్ చిన్పప్పుడే మరణించడంతో పొన్నెకల్లులోని అమ్మమ్మ వద్దే ఉంటూ చదువుకుంటున్నాడు. అమ్మమ్మ వృద్ధురాలు కావడం, వయసు పైబడటంతో ఎలాంటి ఫిర్యాదు చేయకుండా మృతదేహాన్ని అప్పగిస్తే చాలని కోరింది. కానీ తండ్రి తరఫు గ్రామస్తులు మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. విచారణ జరుగుతున్న సమయంలో పొన్నెకల్లు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కూడా హాజరు కావడం, వారు ఇది ముమ్మాటికీ ప్రమాదమేనని, ఇతర చిన్నారుల ప్రమేయం లేదని వినతిపత్రం సమర్పించడంపైనా ఫిర్యాదుదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయి నివేదికను డీఈఓకు అందజేయనున్నట్లు డెప్యూటీ డీఈఓ వెంకటేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో తెనాలి ఎంఈఓ ఇందిర, హెచ్‌ఎం జరీనా పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment