ట్యాబ్‌లు వెనక్కి!
ప్రత్తిపాడు: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. కార్పొరేట్ విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సకల వసతులూ కల్పించింది. పాఠశాల స్థాయి నుంచే డిజిటల్ చదువులు అవసరమని భావించింది. తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో శాంసగ్ ట్యాబ్‌లను అందించింది. ఇతరత్రా యాప్‌లు ఓపెన్ అవ్వకుండా విద్యావసరాలకు మాత్రమే ఉపయోగపడేలా పకడ్బందీగా లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసింది. దీంతో విద్యార్థులు ట్యాబ్‌ల ద్వారా సబ్జెక్టుల వారీగా పాఠ్యాంశాలను నేర్చుకున్నారు. కానీ ప్రస్తుత కూటమి సర్కారు కొత్తవి ఇవ్వకపోగా, ఇప్పటికే ఇచ్చిన వాటిని కూడా వెనక్కు తీసేసుకుంది. ఇన్‌స్టలేషన్ పేరుతో తీసుకుని ఇంకా అప్పగించకపోవడంతో ట్యాబ్‌లకు సర్కారు టాటా చెప్పేస్తుందా? అన్న అనుమానాలు విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో తలెత్తుతున్నాయి.
నాలుగునెలలుగా డిజిటల్ బోధనేదీ?
ప్రత్తిపాడులోని భవనం వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిది, పది తరగతులు చదువుతున్న విద్యార్థులకు గతంలో ఇచ్చిన ట్యాబ్‌లను ఉపాధ్కాయులు వెనక్కు తీసుకున్నారు. ఆగస్టు నెలలో పదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల్లో సీబీఎస్‌ఈపై ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించారు. ఆ సమయంలో పరీక్ష రాయాలంటే అందులో ఉన్న ఎండీఎం (మొబైల్ డివైజ్ మేనేజ్‌మెంట్) యాప్‌ను తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. తరువాత తొలగించిన యాప్‌ను తిరిగి ఇన్‌స్టాల్ చేసి ఇస్తామని.. చెప్పి ఇన్‌స్టలేషన్ పేరుతో తొమ్మిది, పది తరగతులకు చెందిన సుమారు 120 మందికిపైగా విద్యార్థుల నుంచి మూడు నెలల కిందట ట్యాబ్‌లను పాఠశాల ఉపాధ్యాయులు తీసేసుకున్నారు. యాప్ ఇన్‌స్టాల్ చేసి ఇవ్వకపోగా భద్రంగా ట్యాబ్‌లను అట్టపెట్టెల్లో ప్యాక్ చేసి కంప్యూటర్ గదిలో భద్రపరిచారు. దీంతో విద్యార్థులు ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు.. ఇలా నాలుగు నెలలుగా డిజిటల్ బోధనకు దూరమయ్యారు. ట్యాబ్‌లు ఇలా వెనక్కు తీసుకోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టలేషన్ పేరుతో..! ఆగస్టులోనే తీసుకున్న ఉపాధ్యాయులు ఇంకా విద్యార్థులకు అప్పగించని వైనం
తిరిగి ఇస్తాం
ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హెచ్.శ్రీనివాస్‌ను వివరణ కోరగా ఇటీవల సీబీఎస్‌ఈ సిలబస్‌పై విద్యార్థులకు పరీక్షలు నిర్వహించామని, అప్పుడు అందులో ఉన్న ఎండీఎం యాప్ అన్ ఇన్‌స్టాల్ చేసి కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఎక్కించారని పేర్కొన్నారు. అందుచేత మళ్లీ ఎండీఎం సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయాలని, లేదంటే ట్యాబ్ మామూలు మొబైల్‌లాగా పనిచేస్తుందని వివరించారు. విద్యార్థులకు ట్యాబ్‌లు ఇచ్చిన ఉద్దేశం నెరవేరదని, అందుకే ట్యాబ్‌లు తీసుకున్నామని, ఎండీఎం యాప్ ఇన్‌స్టాల్ చేసి విద్యార్థులకు తిరిగి ఇచ్చేస్తామని హెచ్‌ఎం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment