రాయితీపై మినీ ట్రాక్టర్లు
ప్రత్తిపాడు: రాయితీపై రైతులకు మినీ ట్రాక్టర్లు అందించనున్నట్టు ప్రత్తిపాడు మండల ఉద్యాన అధికారి ఎం.బేబి తెలిపారు. కాకుమాను మండలం కొండపాటూరుకు చెందిన కుర్రాకుల ప్రసాద్‌కు ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ఉద్యాన యాంత్రీకరణ పథకం కింద ట్రాక్టర్‌ను అందించారు. ఈ సందర్భంగా హెచ్‌వో బేబి మాట్లాడుతూ ట్రాక్టర్ ధర రూ.5.25 లక్షలని, ఇందులో ప్రభుత్వ రాయితీ రాయితీ లక్ష ఉంటుందని చెప్పారు. మిగిలిన రూ.4.25 లక్షలు రైతులు తమ వాటాగా చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఆసక్తి ఉన్న రైతులు ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించాలని కోరారు.
టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
గుంటూరు ఎడ్యుకేషన్: వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫీజును ఎటువంటి అపరాధ రుసుం లేకుండా చెల్లించేందుకు తుది గడువును ఈనెల 26 వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక సోమవారం ఓప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పరీక్షల విభాగ డైరెక్టర్ ఆదేశాల మేరకు అన్ని యాజమాన్యాల్లోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సంబంధిత విద్యార్థుల పరీక్ష ఫీజును ఈనెల 26లోపు రూ.125 చొప్పున చెల్లించి, నామినల్ రోల్స్‌తోపాటు ఆన్‌లైన్‌లో సమర్పించాలని సూచించారు. రూ.50 అపరాధ రుసుంతో కలిపి చెల్లించేందుకు డిసెంబర్ 2, రూ.200తో చెల్లించేందుకు డిసెంబర్ 9, రూ.500తో చెల్లించేందుకు డిసెంబర్ 16 వరకు అవకాశముందని వివరించారు.
కలెక్టరేట్ ఎదుట
ఆశ కార్యకర్తల ధర్నా
గుంటూరు వెస్ట్: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆశ వర్కర్లు కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఏపీ ఆశ వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి మాట్లాడుతూ నిబద్ధతతో పనిచేస్తున్న తమకు ఇంకా చాలీచాలని జీతాలే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో పని భారం బాగా పెరిగిందని ఆరోపించారు. తమకు జీతభత్యాలతోపాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కల్పించాలని కోరారు. కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమకు కుటుంబం ఉంటుందని, సెలవులు ఇవ్వాలని విన్నవించారు.
సాగునీటి సమాచారం
తాడేపల్లిరూరల్ (దుగ్గిరాల) : కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద సోమవారం 3800 క్యూసెక్కులు విడుదల చేశారు. హై లెవల్ కాలువకు162, బ్యాంక్ కెనాల్‌కు 825, తూర్పు కెనాల్‌కు 50, పశ్చిమ కెనాల్‌కు 93, నిజాంపట్నం కాలువకు 209, కొమ్మమూరు కాలువకు 2001 క్యూసెక్కులు విడుదల చేశారు.
దుర్గమ్మకు వెండి కిరీటం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై కొలువున్న కనకదుర్గమ్మకు ద్రాక్షా రామంకు చెందిన భక్తులు వెండి కిరీటాన్ని సమర్పించారు. ద్రాక్షారామానికి చెందిన కొమ్ముల స్వామినాయుడు కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. సుమారు రూ. 1.30 లక్షలతో 1.300 కిలోల వెండితో కిరీటాన్ని తయారు చేయించి సోమవారం ఆలయ అధికారులకు అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితులు ఆశీర్వచనం ఇవ్వగా ఆలయ పర్యవేక్షకుడు రమేష్ దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment