గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పనివేళల్లో మార్పులు చేస్తూ రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) తీసుకువచ్చిన నూతన టైంటేబుల్ ఈనెల 20వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈమేరకు గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక సోమవారం షెడ్యూల్ విడుదల చేశారు. ఉన్నత పాఠశాలల పనివేళలను సాయంత్రం 5 గంటల వరకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ముందుగా మండలానికి ఒక పాఠశాల చొప్పున పైలెట్ ప్రాజెక్టుగా అమల్లోకి తెస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను సవరిస్తూ ఎస్సీఈఆర్టీ విడుదల చేసిన నూతన టైంటేబుల్‌కు అనుగుణంగా ఆయా మండలాల్లో ఎంపిక చేసిన ఉన్నత పాఠశాలలు ఉదయం 9 గంటలకు మొదటి బెల్‌తో ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నాయి. మొత్తం ఎనమిది పీరియడ్‌లు ఉంటాయి. జిల్లాలోని మండలాల వారీగా ఎంపిక చేసిన ఉన్నత పాఠశాలలు ఈనెల 20 నుంచి 30 వరకు నూతన టైంటేబుల్ ప్రకారం పని చేయాలని డీఈఓ సీవీ రేణుక ఆదేశించారు. దీనిపై ఈనెల 30న ఉప విద్యాశాఖాధికారులు నివేదిక సమర్పించాలని సూచించారు.
ఎంపిక చేసిన పాఠశాలలివే..
ఎస్‌ఎన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల (చేబ్రోలు), శ్రీశారదానికేతన్ గర్ల్స్ హైస్కూల్ (గుంటూరు), ప్రభుత్వ గర్‌ల్స్ హైస్కూల్ (గుంటూరు), బీఆర్ జెడ్పీ హైస్కూల్ (ప్రత్తిపాడు), కేవీఆర్ జెడ్పీ హైస్కూల్ (తుళ్లూరు)తో పాటు దుగ్గిరాల, కాకుమాను, కొల్లిపర, నిడమానూరు, మేడికొండూరు, పెదకాకాని, పెదనందిపాడు, మునగపాడు, నిడుబ్రోలు, తాడికొండ, అంగలకుదురు, తాడేపల్లి, వట్టిచెరుకూరు జెడ్పీ హైస్కూళ్లు ఉన్నాయి.
మండలానికొక పాఠశాల చొప్పున ఎంపిక ఈనెల 20 నుంచి అమల్లోకి కొత్త పనివేళలు
Comments
Please login to add a commentAdd a comment