No Headline
పెదకాకాని: స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతిమయంగా మారింది. సిబ్బంది కాసులకు కక్కుర్తిపడుతున్నారు. సిగ్గులేకుండా ప్రతి పనికీ రేటు పెడుతున్నారు. ఫలితంగా క్రయవిక్రయదారులు బెంబేలెత్తిపోతున్నారు. అధికారికి, సిబ్బందికి అనుకూలమైన రైటర్ డాక్యుమెంట్ తెస్తే రికార్డు సరిగా లేకపోయినా పనులు జరుగుతున్నాయి. రిజిస్ట్రార్ కార్యాలయంలో చలానా చెల్లించినా ఈసీ పొందాలంటే రూ.100 నుంచి రూ.200 సమర్పించుకోవాల్సిందే. నకలు తీసుకోవాలంటే(పబ్లిక్ కాపీ) రూ.200 మార్కెట్ విలువ ధ్రువీకరణ పత్రం కోసం రూ.వంద నుంచి రూ.రెండు వందలు ముట్టజెప్పాల్సిందే. ఫీజు టు ఫీజు షరామామూలే. భూములు, ఆస్తుల కొనుగోళ్ల వ్యవహారంలో ప్రభుత్వానికి చెల్లించే 7.5 శాతం నగదు చలానా రూపంలో చెల్లిస్తారు. ప్రతి డాక్యుమెంట్‌పైనా దాని విలువ ఆధారంగా 0.5 శాతం రిజిస్ట్రార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ వసూలు చేస్తున్నారు.
రోజూ సిబ్బంది అంతా వాటాలు పంచుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. సెల్ఫ్ సవరణలో తప్పులు దొర్లినా, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ లేకపోయినా తప్పులను బట్టి రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకూ డిమాండ్ చేస్తున్నారని క్రయవిక్రయదారులు లబోదిబోమంటున్నారు. చివరకు పొలాల తాకట్టు(మార్ట్‌గేజ్)పెట్టి రుణాలు పొందుతున్న రైతులనూ వదలడం లేదు. రూ.500 వరకు లంచం ముక్కుపిండిమరీ వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే పెదకాకాని రిజిస్ట్రార్ కార్యాలయంలో నైట్ డ్యూటీ వాచ్‌మెన్ లేకపోయినా పెట్రోలింగ్ రిజిష్టర్‌లో మాత్రం వాచ్‌మెన్ ఉన్నట్లు నమోదు చేస్తున్నారు.
అధికారుల ఫోన్ నంబర్ల బోర్డులేవీ..!
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారుల పేర్లు, ఫోన్ నంబర్లు గానీ, ఏసీబీ అధికారుల ఫోన్ నంబర్లతో కూడిన బోర్డులు గానీ కనిపించవు. కనీసం కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న వారి పేర్లు, ఫోన్ నంబర్లతో కూడిన బోర్డూ ఉండదు. ఈ కార్యాలయంలో చివరకు సమాచారం హక్కు చట్టం ప్రకారం సమాచారం కోరినా లంచం ఇచ్చుకోవాల్సిందేననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పని జరగాలంటే చేయి తడపాల్సిందే కాసులిస్తే రికార్డు సరిగా లేకపోయినా డాక్యుమెంట్ సవరణ ఈసీ, నకళ్లు, మార్కెట్ వాల్యూ ధ్రువీకరణ ఇలా ప్రతి పనికీ ఓ రేటు ఇదీ పెదకాకాని రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది తీరు క్రయవిక్రయదారులు బెంబేలు
Comments
Please login to add a commentAdd a comment