సర్కారు పట్టించుకొనలేదే!
సాక్షి ప్రతినిధి, గుంటూరు : రైతుల వద్ద ఎంత ధాన్యం ఉంటే అంతా కొనుగోలు చేస్తామంటూ ముఖ్యమంత్రి, జిల్లాకే చెందిన పౌరసరఫరాల శాఖ మంత్రి చెప్పిన మాటలు నీటిమీద మూటలే అయ్యాయి. కేవలం 22 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత ప్రభుత్వం చేతులెత్తేసింది. లక్ష్యానికి బహు దూరంగా ఉన్నా ధాన్యం కొనుగోళ్లను అనధికారికంగా నిలిపివేశారు. జిల్లా వ్యాప్తంగా 156 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ఇప్పటి వరకూ కొనుగోలు చేసింది కేవలం 22 వేల టన్నులే. 25 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి అనుమతి ఉన్నా ఇంకా ముందుగానే కొనుగోళ్లను నిలిపివేశారు. జిల్లాలో చాలాచోట్ల ధాన్యం రైతుల వద్దే ఉండిపోయింది. పొన్నూరు, తెనాలి, మంగళగిరి నియోజకవర్గాల్లో ఇంకా ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. రైతుల నుంచి ఒత్తిడి ఉండటంతో ధాన్యం కొనుగోలు చేయాలని ప్రజాప్రతినిధులు కూడా అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. అయితే మరో పదివేల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు అనుమతి కోసం యత్నిస్తున్నామని, రాగానే కొంటామని చెబుతున్నారు. పదివేల టన్నులు ఏ మూలకు సరిపోదని కనీసం 20 వేల టన్నులైనా కొనుగోలు చేయాలని జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే జాయింట్ కలెక్టర్‌ను కోరారు. అయితే అధికార యంత్రాంగం మాత్రం ఇప్పటికే చాలా కొనుగోలు చేశామన్న రీతిలో వ్యవహరిస్తోంది.
బస్తా రూ.13 వందలూ పలకని దైన్యం
జిల్లాలో లక్షా 41 వేల ఎకరాల్లో ఈసారి వరి సాగు చేసిన సంగతి తెలిసిందే. తుఫాన్‌లు, భారీ వర్షాలు దెబ్బతీసినా చాలాచోట్ల ఈసారి అధిక దిగుబడులు వచ్చాయి. అయితే బయట మార్కెట్‌లో దళారులు, వ్యాపారులు, మిల్లర్లు కుమ్మకై ్క ధరను దారుణంగా పడేశారు. బస్తాకు మద్దతు ధర 1,740 ఉండగా కనీసం 13 వందల రూపాయలకు కూడా కొనని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలవైపు ఆశగా ఎదురు చూశారు. రైతుల్లో ఎక్కువ మంది కౌలు రైతులే ఉన్నారు. వీరందరూ కౌలు చెల్లించడమే కాకుండా పంట పెట్టుబడులు పెట్టడంతో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చింది. అయితే తేమ శాతం పేరుతో, గోనె సంచులు సరిపడా లేవన్న సాకులతో ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ధాన్యం కొనుగోలుకు కీలకమైన తేమశాతం చూసే టెక్నీషియన్లు అందుబాటులో లేకపోయినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో సర్కారు విఫలం అయ్యింది. తేమ శాతం చూశాక, ధాన్యాన్ని గోతాలకు ఎత్తి, సంబంధిత రైస్ మిల్లుకు పంపాక, అక్కడ మరోసారి తేమశాతం చూసి తిప్పి పంపిన సందర్భాలు అనేకం రైతులకు ఎదురయ్యాయి. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రైతు పోరుబాట నిర్వహించినా, రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. కొన్నది తక్కువే అయినా డబ్బులు వెంటనే చెల్లించామని ప్రచారం చేసుకుంటున్నారు. అయితే రైతులు మాత్రం తమ ధాన్యం కొనుగోలు చేసి తమను ఆదుకోకపోతే ఆత్మహత్యలే దిక్కని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా రైతుల వద్దే ధాన్యం ఇప్పటివరకు కొన్నది 22 వేల టన్నులే ! ఇంకో 10 వేల టన్నుల కొనుగోలుకు అనుమతి కోసం యత్నం కనీసం 20 వేల టన్నులైన కొనాలని ప్రజాప్రతినిధుల డిమాండ్ స్పందించని ప్రభుత్వం అనధికారికంగా కొనుగోళ్లు నిలిపేసిన అధికారులు
మద్దతు ధర అమలెక్కడ!
రైతుల నుంచి ధాన్యాన్ని బస్తా రూ.1,740లకు కొనుగోలు చేస్తామని సర్కారు చెప్పినా అమలు కావడం లేదు. బహిరంగ మార్కెట్టులో రైతుల నుంచి ధాన్యం ఽబస్తాను రూ.1,300కు కొనడమూగగనంగా మారింది. ప్రస్తుతం గ్రామాల్లో రైతుల నుంచి వివిధ కారణలతో ధాన్యం కొనుగోలు చేయటం లేదు.
– దానబోయిన గోపి, సుద్దపల్లి,
చేబ్రోలు మండలం
Comments
Please login to add a commentAdd a comment