వైభవంగా రాధాకృష్ణుల కల్యాణం
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమరావతిలోని హనుమత్ గీతామందిరంలో గురువారం రాధాకృష్ణుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. గీతామందిర ధర్మకర్తలైన వలివేటి చంద్రమౌళి, శంకర్ ఆధ్వర్యంలో జరిపిన ఈ కల్యాణ క్రతువును యాజ్ఞిక బ్రహ్మ బృందావనం ఆదిత్య నరసింహమూర్తి శాస్త్రోక్తంగా నిర్వహించారు. క్రతువులో తొలుత విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, నవగ్రహ మండపారాధన, లగ్నాష్టకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. కల్యాణంలో 10 జంటలు పాల్గొని స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. పీసపాటి నాగేశ్వరశర్మ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అనంతరం భక్తులకు నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
నాణ్యమైన వస్త్రాలకు మారుపేరు రామ్‌రాజ్
చిలకలూరిపేట: నాణ్యమైన వస్త్రాలకు మారుపేరు రామ్‌రాజ్ అని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. పట్టణంలోని గుండయ్యతోటలో రామ్‌రాజ్ షోరూమ్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ సంప్రదాయ దుస్తులకు రామ్‌రాజ్ సంస్థ ఎంతో పేరు గడించిందని వెల్లడించారు. వినియోగదారులు రామ్‌రాజ్ వస్త్ర దుకాణాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వ్యాపారం దినదినాభివృద్ధి సాధించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పెనుగొండ సుబ్బారాయుడు, రామ్‌రాజ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
యార్డుకు 70,712 బస్తాల మిర్చి
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు గురువారం 70,712 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 69,119 బస్తాల అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.7,200 నుంచి రూ. 15,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.7,300 నుంచి 16,000 వరకు లభించింది. ఏసీ కామన్ రకం మిర్చి రూ.7,400 నుంచి రూ.14,000 వరకు లభించింది. ఏసీ ప్రత్యేక రకం రూ. 7,500 నుంచి రూ.15,500 వరకు ధర పలికింది. తాలు రకం మిర్చికి రూ.4,000 నుంచి రూ.11,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 54,442 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి వి.ఆంజనేయులు తెలిపారు.
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
విజయవాడ: ఇంద్రకీలాద్రి దుర్గమ్మ నిత్యాన్నదానానికి గుంటూరుకు చెందిన భక్తులు సి.వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు గురువారం రూ.లక్ష విరాళం సమర్పించారు. వారికి అధికారులు ఆలయ మర్యాదలతో దర్శనభాగ్యం కల్పించారు. వేద పండితులు ఆశీర్వచనం, ఆలయ డీఈఓ రత్నరాజు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
సాగునీటి సమాచారం
తాడేపల్లిరూరల్ (దుగ్గిరాల) : కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద గురువారం 1,818 క్యూసెక్కులు విడుదల చేశారు. బ్యాంక్ కెనాల్‌కు 144, తూర్పు కెనాల్‌కు 270, పశ్చిమ కెనాల్‌కు 110, నిజాంపట్నం కాలువకు 74, కొమ్మమూరు కాలువకు 505 క్యూసెక్కులు విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment