మమ్ముల్ని విడిచిపోతివా బిడ్డా..
బయ్యారం : మంచి రోజులు వచ్చాయనుకుంటే మమ్ముల్ని విడిచి పోతివా బిడ్డా.. ఉద్యోగం లేకున్నా నా కొడుకు ఇన్నేళ్లు మమ్ముల్ని సాదుతున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం వస్తే మంచి రోజులు వచ్చాయనుకున్నాం.. కాని ఇలా మమ్ముల్ని విడిచి వెళ్లే రోజు వస్తుంది అనుకోలే కొడుకా.. అంటూ మృతి చెందిన ఉపేందర్‌రావు వృద్ధ తల్లిదండ్రులు విలపిస్తున్న తీరును పలువురిని కన్నీటి పర్యంతం చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. కుటుంబంతో సంతోషంగా ఉండొచ్చని భవిష్యత్‌పై ఎన్నో ఆశలు పెట్టుకొన్న కొత్త ఉద్యోగికి నెలరోజుల్లోనే దురదృష్టం లారీ రూపంలో మృత్యువు కబళించింది. కొలువుకు వెళ్లి వస్తానని ఇంటి నుంచి వెళ్లిన కొడుకు లారీ ఢీకొని కానరానిలోకాలకు వెళ్లాడని తెలిసిన తల్లిదండ్రులు, కట్టుకున్న భార్య, కన్నపిల్లలు విషాదంలో మునిగిపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గంధంపల్లి–కొత్తపేట గ్రామానికి చెందిన సండ్ర ఉపేందర్‌రావు (45) డిగ్రీ, డీఈడీ అభ్యసించారు. దీంతో కొంతకాలం ప్రైవేటు టీచర్‌గా పనిచేసి ఆ తర్వాత పెట్రోల్‌బంక్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేశాడు. ఉద్యోగ అర్హత వయసు అయిపోతుంది అనుకున్న సమయంలో ఈ ఏడాది నిర్వహించిన డీఎస్సీలో గంగారం మండలం పులుసంవారిగుంపు (మరిగూడెం)పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరాడు.
నెలరోజుల్లోనే ఆశలు ఆవిరి..
సామాన్య కుటుంబానికి చెందిన ఉపేందర్‌రావుపై భార్య స్వప్న, కుమారుడు హేమతేజ్, కుమార్తె శాన్వితతో పాటు తల్లిదండ్రులు హరినాథ్, జయమ్మ ఆధారపడి జీవిస్తున్నారు. కుటుంబ పోషణకు పెట్రోల్‌బంక్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తూ ఉద్యోగ కలను నెరవేర్చుకున్నాడు. విధులు నిర్వర్తించేందుకు వెళ్తున్న ఉపేందర్‌రావును లారీ ఢీకొట్టడంతో మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి
లారీ ఢీకొని ప్రభుత్వ
ఉపాధ్యాయుడు మృతి
ఉద్యోగంలో చేరిన నెలరోజులకే
కాటేసిన మృత్యువు
కొలువు రాకున్న బతికేవాడివి..
అంటూ రోదిస్తున్న కుటుంబ సభ్యులు
బైక్‌ను ఢీకొన్న లారీ
గంగారం : ద్విచక్ర వాహనంపై పాఠశాలకు వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిని వెనకాల నుంచి లారీ ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయం కాగా చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేటకు చెందిన సండ్ర ఉపేందర్‌రావు (45) ప్రభుత్వ ఉపాధ్యాయడిగా విధులు నిర్వహిస్తున్నాడు. నెల రోజుల క్రితమే గంగారం మండలంలోని మర్రిగూడెం పులసంవారిగుంపు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరాడు. రోజు ఇంటినుంచి ద్విచక్ర వాహనంపై పాఠశాలకు వెళ్లి వస్తున్నాడు. ఈక్రమంలో గంగారం నుంచి కాటినాగారం క్రాస్ రోడ్డు వద్దకు రాగానే ఉపాధ్యాయుడిని వెనకాల నుంచి వస్తున్న ఏపీ 02టీసీ 7088 నంబర్ గల లారీ వాహనం ఢీకొట్టడంతో ఉపేందర్‌రావు తలకు తీవ్రగాయమైంది. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించగా, గూడూరు సీహెచ్‌సీకి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లుగా నిర్ధారించారు. మృతుడి భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవి కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment