డిప్యుటేషన్లపై విచారణేది?
కాళోజీ సెంటర్: వరంగల్ విద్యాశాఖలో కొంత గందరగోళం నెలకొంది. కీలక అధికారి పని విధానంతో.. ఉపాధ్యాయ సంఘాలతో పాటు కార్యాలయ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారనే చర్చ నడుస్తోంది. ఇటీవల జరిగిన డిప్యుటేషన్లలో భారీ ఎత్తున చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా డిప్యుటేషన్లు చేసినట్లు పలు ఉపాధ్యాయ సంఘాలు ఈనెల 3న కలెక్టర్ సత్యశారద దృష్టికి తీసుకొచ్చి వివరాలతో కూడిన సమాచారం అందించినట్లు సమాచారం. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. కానీ, వారం రోజులవుతున్నా.. డీఈఓ కార్యాలయం నుంచి ఎలాంటి విచారణ చేపట్టలేదని తెలిసింది.
నిబంధనలకు విరుద్ధంగా జరిగిన
కొన్ని సర్దుబాట్లు..
● చెన్నారావుపేట మండలం ఎల్లాయిగూడెం యూపీఎస్‌లో 1 నుంచి 8 తరగతులు ఉన్నాయి. 6, 8 తరగతుల్లో 35 మంది విద్యార్థులుండగా.. ఇద్దరు లాంగ్వేజీ, విషయ ఉపాధ్యాయులు (సైన్స్, మ్యాథ్స్, సోషల్) ఉండాలి. కానీ.. గణితం, తెలుగు మాత్రమే పని చేస్తున్నారు. ఎస్‌ఏ (తెలుగు) ఉపాధ్యాయురాలిని ఖిలా వరంగల్ మండలం వెంకటేశ్వర్ ఉన్నత పాఠశాలకు సర్దుబాటు చేశారు. సమీప యూపీఎస్ భోజెరువులో ఒక్క విద్యార్థీ లేడు. అక్కడ పని చేస్తున్న ఎస్‌ఏ(హిందీ)ని అదే కాంప్లెక్స్ పరిధిలో గల యూపీఎస్ ఎల్లాయిగూడేనికి కాకుండా శివనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సర్దుబాటు చేశారు.
● నర్సంపేట మండలంలోని కమ్మపల్లి జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో 142 మంది విద్యార్థులున్నారు. అక్కడి నుంచి కరుణాకర్ అనే ఎస్‌ఏ (ఫిజికల్ ఎడ్యుకేషన్) మహేశ్వరం జెడ్పీహెచ్‌ఎస్‌కు సర్దుబాటు చేశారు.
● నెక్కొండ మండలం నాగారం ప్రైమరీ పాఠశాల నుంచి ఎన్.కవిత(ఎస్‌జీటీ) ఉపాధ్యాయురాలిని ఖిలావరంగల్ మండలం వెంకటేశ్వర్ ఉన్నత పాఠశాల, అదే పాఠశాలలో పని చేస్తున్న స్వర్ణలత (ఎస్‌జీటీ)ను గీసుకొండ మండలం గంగదేవి పల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో సర్దుబాటు చేశారు.
● సంగెం మండలం జెడ్పీహెచ్‌ఎస్ మొండ్రాయిలో పని చేస్తున్న కె.శంకర్‌రావు(ఎస్జీటీ) జీపీఎస్ శంభునిపేటకు, సంగెం మండలం ఎంపీపీఎస్ వీఎన్‌ఆర్ తండాలో పని చేస్తున్న ఎం.రజిత జెడ్పిహెచ్‌ఎస్ మొండ్రాయికి సర్దుబాటు చేశారు.
● సంగెం మండలం జెడ్పీహెచ్‌ఎస్ గవిచర్లలో పనిచేస్తున్న పి.సరస్వతిని వంచనగిరి లోని కేజీబీవీ పాఠశాలకు సర్దుబాటు చేశారు. గవిచర్లలో 5 సెక్షన్లలో కొనసాగుతున్నాయి.
● ఇటీవల స్పౌజ్ కోటా బదిలీల్లో 59వ సీరియల్ నంబర్‌లో ఉన్న నాగరాణి కాటారం నుంచి వ చ్చారు. కానీ ఆమె కౌన్సెలింగ్‌కే హాజరు కాలేదు. ఎక్కడ కేటాయించారనేది రికార్డుల్లో చూపట్లేదు.
ఈఘటనలు మచ్చుకు కొన్ని మాత్రమే. ఇలా నాలుగు పేజీల చిట్టాను కలెక్టర్ ముందు ఉంచారు. నిబంధనలకు విరుద్ధంగా చేసిన డిప్యుటేషన్లపై విచారణ జరిపితే అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ వాటిపై సమగ్ర విచారణ చేయించి అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
కలెక్టర్ ఉత్తర్వులంటే లెక్కలేదా?
ఇటీవల విద్యాశాఖపై కలెక్టర్ దృష్టిపెట్టి ముగ్గురు ఉద్యోగులను రిలీవ్ చేయాలని ఈనెల 1న ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఒకరు మనోజ్‌ను వెంటనే రిలీవ్ చేయగా, సీనియర్ అసిస్టెంట్ ఎస్‌బీ.శ్రీనివాస్‌ను మాత్రం సరెండర్ చేయగా.. సోమవారం విద్యాశాఖ ఆర్జేడీ కార్యాలయానికి పంపారు. అసిస్టెంట్ ప్రోగ్రాం ఆఫీసర్‌ను మాత్రం ఇంకా రిలీవ్ చేయకుండా సిటీకి అందుబాటులో పోస్టింగ్ ఇచ్చేందుకు లాబీయింగ్ చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఒక దశలో కలెక్టర్ ఆర్డర్ జారీ చేసినా అమలు చేయకుండా జాప్యం ఎందుకు చేస్తున్నారని కార్యాలయంలో జోరు చర్చ జరుగుతోంది. కలెక్టర్ ఉత్తర్వులంటే లెక్క లేదా? అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
కొంతమందిపై మక్కువ
ముగ్గురు ఉద్యోగులను రిలీవ్
చేయాలని కలెక్టర్ ఉత్తర్వులు
పది రోజులైనా కదలని ఫైల్
Comments
Please login to add a commentAdd a comment