
హైదరాబాద్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం అబిడ్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మూసాపేట్, భరత్‌నగర్ ప్రాంతానికి చెందిన మురారి అనూష(32)కు గత ఫిబ్రవరి 12న విజయవాడకు చెందిన నాంచారయ్యతో వివాహం జరిగింది. నాంచారయ్య సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండగా, బీటెక్ పూర్తి చేసిన అనూష ఉద్యోగాన్వేషణలో ఉంది. మూడురోజుల క్రితం ఇంట్లో జరిగిన వేడుకలో భర్త, ఆడపడచుతో గొడవ జరగడంతో ఆమె పుట్టింటికి వచ్చింది.
అయినా భర్త, ఆడపడుచు ఫోన్‌చేసి గొడవ పడుతుండటంతో మనస్తాపానికి లోనైంది. ఈ నేపథ్యంలో బ్యాంకు పని నిమిత్తం ఎస్‌ఆర్‌నగర్ వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయటికి వచ్చిన అనూష నేరుగా గగన్‌విహార్ భవనం 11వ అంతస్తు పైకి ఎక్కి సోదరుడికి వాయిస్ మెసేజ్ చేసి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతురాలి సోదరుడు కార్తీక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.