సాక్షి, సిటీబ్యూరో: నెక్లెస్ రోడ్‌లో ఒంటరిగా ఉన్న జంటలను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న సూడో పోలీసును మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిపై ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 20 కేసులు నమోదైనట్లు డీసీపీ నితిక పంత్ బుధవారం వెల్లడించారు. జనగాంకు చెందిన మరాఠీ సృజన్ కుమార్ కొన్నేళ్ల క్రితం విశాఖలో ఎస్సైగా పని చేసిన శ్రావణిని వివాహం చేసుకున్నాడు. పైళ్లెన కొన్ని నెలలకే ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడిన ఇతగాడు తేలిగ్గా డబ్బు సంపాదించడానికి సూడో పోలీసు అవతారం ఎత్తాడు. తన భార్య పోలీసు యూనిఫాంలో ఉన్న ఫొటోను తన ఫోన్‌లో పెట్టుకుని తిరిగే సృజన్ తానూ డమ్మీ తుపాకీతో దిగిన వాటినీ ఇలా సేవ్ చేసుకున్నాడు.
టార్గెట్ చేసిన వ్యక్తులకు వీటిని చూపిస్తూ తాను పోలీసునని బెదిరిస్తాడు. కేసు పేరు చెప్పి వారి నుంచి అందినకాడికి దండుకుంటాడు. ఇలాంటి నేరాలు చేసిన నేపథ్యంలో సృజన్‌పై గతంలో నగరంలో పాటు విశాఖపట్నం, వరంగల్ సహా వివిధ ప్రాంతాల్లో 18 కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఇతడు నెక్లెస్ రోడ్‌నే తన టార్గెట్‌గా మార్చుకున్నాడు. నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనంపై తిరుగుతూ అక్కడ ఒంటరిగా, ఏకాంతంగా ఉన్న జంటలను ఎంచుకుంటాడు. ఫోన్‌లోని ఫొటోలు చూపించి తాను పోలీసు అని, తనతో ఠాణాకు రావాలని గద్దిస్తాడు.
ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాల్సి ఉందని భయపెడతాడు. అలా కాకుండా ఉండాలంటే తాను కోరిన మొత్తం ఇవ్వాలని బెదిరిస్తాడు. ఇలా రెండు జంటలను బెదిరించి డబ్బు దండుకున్నాడు. ఓ జంట నుంచి రూ.20 వేలు ఫోన్ పే చేయించుకున్నాడు. మరో జంట నుంచి ఈ పంథాలో రూ.99 వేలు తీసుకున్న సృజన్.. మరుసటి రోజు రూ.4 లక్షలు వసూలు చేశాడు. వీరి ఫిర్యాదుతో సెక్రటేరియేట్ ఠాణాలో రెండు కేసులు నమోదయ్యాయి.
దీంతో మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇన్‌స్పెక్టర్ బి.రాజు నాయక్ నేతృత్వంలో ఎస్సైలు సీహెచ్.నవీన్‌కుమార్, ఎస్.సాయి కిరణ్ వలపన్ని బుధవారం నిందితుడిని పట్టుకున్నారు. విచారణ నేపథ్యంలో ఇతడిపై ఆసిఫ్‌నగర్‌లో రెండు ఎన్‌బీడబ్ల్యూలు పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది. సృజన్ నుంచి రూ.1.38 లక్షల నగదు, వాహనం, ఫోన్లు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం సెక్రటేరియేట్ పోలీసులకు అప్పగించారు. ఇతడు సూర్య, చరణ్, చెర్రీ పేర్లతోనూ చెలామణి అయినట్లు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment