ప్రజాస్వామ్యాన్నిపరిరక్షించుకోవాలి | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యాన్నిపరిరక్షించుకోవాలి

Published Tue, May 7 2024 7:05 PM

-

హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌

హిమాయత్‌నగర్‌: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌లను ఓడించి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని, ఇండియా కూటమికి ఓటు వేసి గెలిపించాలని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బి.చంద్రకుమార్‌ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మతతత్వ రాజకీయాలతో విచ్ఛిన్నకర రాజకీయాలు చేస్తున్న ప్రధాని మోదీకి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్‌లో సమాజ్‌వాద్‌ పార్టీ రాష్ట్ర అధ్యకుడు ప్రొఫెసర్‌ సింహాద్రి ఆధ్వర్యంలో లోక్‌సభ ఎన్నికలు–రాజ్యాంగ పరిరక్షణ అనే అంశంపై రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ చంద్రకుమార్‌ మాట్లాడుతూ మోసపూరిత హామీలను ఇచ్చి ప్రజలను మోదీ మరోసారి మోసం చేస్తున్నారన్నారు. ప్రొఫెసర్‌ పి.ఎల్‌.విశ్వేశ్వరరావు మాట్లాడుతూ మరోసారి మోదీ అధికారంలోకి వస్తే అన్ని వ్యవస్థలు సర్వనాశనం అవుతాయన్నారు. కార్యక్రమంలో ప్రజా తెలంగాణ కన్వీనర్‌ సమ్మన్న, లోక్‌సత్తా పార్టీ అధ్యకుడు మన్నారం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

తెలుగు–కన్నడ బంధం విడదీయలేనిది

కాచిగూడ: తెలుగు, కన్నడ భాషల మధ్య విడదీయరానంతగా బంధం పెనవేసుకుందని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అన్నారు. కన్నడ సాహిత్య పరిషత్‌ 110వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం పరిషత్‌ అధ్యక్షుడు విఠల్‌ జోషి అధ్యక్షతన స్థానిక అక్షయ హోటల్‌లో సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మామిడి హరికృష్ణ మాట్లాడుతూ ప్రాచీన కాలం నుంచే ఈ రెండు భాషల మధ్య అనుబంధం కొనసాగుతోందన్నారు. ఉభయ భాషలపై సంస్కృతి, సాహిత్య ప్రభావం పరస్పరం కనిపిస్తుందన్నారు. హైదరాబాద్‌లో కన్నడ సంస్థలు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. పరిషత్‌ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో గత 55 సంవత్సరాలుగా పాల్గొంటున్న అమర దీక్షిత్‌ ‘ప్రజల వద్దకు పరిషత్తు’ అనే అంశంపై ప్రసంగించి సభికులను ఆకట్టుకున్నారు. జంట నగరాల్లో వివిధ క్షేత్రాలలో సేవలందిస్తున్న కన్నడిగులైన రఘునాథ్‌, హరిరావ్‌, రఘురామ్‌ ఓంకార్‌, వినయా నాయర్‌లను పరిషత్‌ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో పరిషత్‌ కార్యదర్శి సుమతి నిరంజన్‌, సి.రమేష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

 
Advertisement
 
Advertisement