లండన్: సాధారణంగా పక్షులు, ఇతర జీవులు అద్దంలో తమ ప్రతిబింబం చూసుకుంటూ.. అవతలి వైపు మరొక జీవి ఉందేమో అనుకొని భ్రమపడుతుంటాయి. ఈ క్రమంలో అవి అద్దంపై దాడిచేసి ఫన్నీగా ప్రవర్తించడం మనకు తెలిసిందే. అయితే, తాజాగా ఇలాంటి ఫన్నీ ఘటన ఒకటి యూకేలో చోటుచేసుకుంది. అయితే, డెర్బీషైర్ అనే గ్రామంలోని కార్లిస్లే అవెన్యూ, లిటిల్ ఓవర్ ప్రాంతంలో కొన్ని రోజులుగా బయట పార్కింగ్ చేసిన కార్ల అద్దాలు, వైపర్‌లు పాడవుతున్నాయి. వాటిపై గీతలు ఉండటాన్ని వారు గమనించారు.
కాగా, మొదట ఇది ఎవరో.. ఆకతాయిల పనిగా భావించారు. కానీ, ప్రతిరోజు వారి కార్లు పాడవుతుండటంతో విసిగిపోయి కొంత మంది యువకులను కాపలాగా ఉంచారు. అప్పుడు వారికి ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. ఇది కాకులు చేస్తున్న పనిగా గుర్తించారు. ప్రతిరోజు రెండు కాకులు కార్లపై అద్దాలను, వైపర్లను పాడుచేస్తున్నాయి. అంతటితో ఆగకుండా అక్కడి వస్తువులను కూడా ఎత్తుకుపోతున్నాయి. అక్కడి స్థానికులు ఈ కాకులను చూసి హాడలేత్తి పోతున్నారు. ఆ రెండు కాకులు మిగతా కాకుల్లా ఎటుపోకుండా.. అక్కడే ఉంటూ, రెండు కలిసి వాహానాలను పాడు చేస్తున్నాయి. కాగా, జూలీ బానీస్టర్ అనే మహిళ ఒక నెలలో రెండుసార్లు కారు అద్దాలను, వైపర్లను మార్చానని వాపోయింది.
దీంతో వారు ఆ కాకులకు తూర్పులండన్‌లో 50-60 దశకంలో ఉన్న ఇద్దరు అండర్ వరల్డ్ డాన్‌లైనా ‘రోనీ, రెగీ’ పేర్లు పెట్టారు. అయితే, మరికొందరు.. ఆ కాకులు భయ పడాలని పొలంలోని దిష్టిబొమ్మలను తీసుకొచ్చి, తమ కార్ల ముందు పెట్టుకున్నారు. అయినా కూడా, ఆ రెండు కాకులు ఏమాత్రం భయపడలేదు. అవి.. రోడ్డుపై నడుచుకుంటే వెళ్తున్న మనుషుల తలపై కూడా దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో విసిగిపోయిన వారు డెర్బీషైర్‌లోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, మొదట పోలీసులు ఈ సంఘటనను వింతగా చూశారు. కాగా క్రమంగా ఫిర్యాదుల సంఖ్య పెరుగుతుండటంతో కేసును నమోదు చేశారు. దీనిపై రాయల్ సొసైటీ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ బర్డ్స్ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. కాకులు ఇలా ప్రవర్తించడం చాలా అరుదని తెలిపారు.
ఆ కాకులు కారు అద్దంలో తమ ప్రతిబింబం చూసుకొని అవతలి వైపు మరోక పక్షి ఉందేమో.. అని భ్రమపడి ఉంటాయని అన్నారు. అయితే, ఇప్పుడిది ఆ నగరవాసులకు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘పాపం.. కాకులు కార్లను పాడు చేస్తున్నాయి..’, ‘స్నేహాం అంటే మీదే..’, ‘వాటిని మచ్చిక చేసుకొవచ్చుగా..మరీ!’,‘ఇప్పుడు.. వాటిని జైల్‌లో పెడతారా ఏంటీ?’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment