వాషింగ్టన్: పోలీసులను రక్షకభటులని అంటారు. కానీ దొంగల కంటే వారిని చూస్తేనే ఎక్కువగా భయపడుతుంటారు జనం. ఆ భయమే అమెరికాలో ఓ అభాగ్యుడిని పొట్టనబెట్టుకుంది. పోలీసులు ఎందుకు వచ్చారో ఏంటో తెలుసుకోకుండా వారు కనపడగానే భయంతో పరిగెత్తుకుంటూ వెళ్లి కన్నింగ్ హాం సరస్సులోకి దూకేశాడు. కొద్దిసేపు ఈత కొట్టే ప్రయత్నం చేసిన అతను చూస్తుండగానే నీటమునిగిపోయాడు.
గ్రీన్‌విల్లే కౌంటీ పోలీసు అధికారులు బెయిలుపై ఉన్న ఒక వ్యక్తికి అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు కన్నింగ్ హాం రోడ్డులోని ఒక ఇంటిలోకి వెళ్లారు. ఆ సమయంలో అక్కడున్నాడు చక్ గిల్బర్ట్ షెల్టన్ జూనియర్ (38). కేసుతో అసలు ఏమాత్రం సంబంధం లేని అతడు పోలీసులను చూస్తూనే పరుగందుకున్నాడు. అది చూసి బిత్తరపోయిన పోలీసులు వాడెందుకు పరిగెడుతున్నాడన్న డైలమాలో ఉండిపోయారు. అంతలోనే గిల్బర్ట్ షెల్టన్ దగ్గర్లో ఉన్న కన్నింగ్ హాం సరస్సులోకి దూకేశాడు.
ఒడ్డు నుండి 15-20 అడుగుల దూరం ఈత కొట్టుకుంటూ వెళ్లిన షెల్టన్ క్రమక్రమంగా మునిగిపోయాడు. వెంటనే గ్రీన్‌విల్లే పోలీసులు, స్థానిక ఈతగాళ్లు కొందరు కాలువలోకి దూకి వెతికినా ప్రయోజనం లేకపోయింది. సుదీర్ఘంగా కొనసాగిన గాలింపుల తర్వాత అతడి మృతదేహాన్ని వెలికితీశారు. అతను ఎందుకు పారిపోయాడు? అతడిపై నేరారోపణలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు. ఏదైతేనేం భయం దెయ్యం కంటే చెడ్డదని మరోసారి రుజువైంది.
ఇది కూడా చదవండి: ఖలిస్థానీల ముసుగులో అక్రమ వలసలు..
Comments
Please login to add a commentAdd a comment