ఇస్లామాబాద్: పాకిస్తాన్ అసెంబ్లీని రద్దు చేసే ముందు ప్రధాని షెబాజ్ షరీఫ్ ప్రతిపక్ష నాయకుడు రజా రియాజ్ తో ఈరోజు సమావేశం కానున్నారు. వీరిద్దరూ కలిసి ఈ సమావేశంలో అసెంబ్లీ రద్దు తర్వాత పాక్ ఆపద్ధర్మ ప్రధాని ఎవరనేది నిర్ణయిస్తారు.
ఆగస్టు 11న పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ రద్దు విషయాన్ని రాష్ట్రపతి అరిఫ్ అల్వి దృష్టికి తీసుకెళ్తూ ఆయనకు లేఖ రాయనున్నారు ప్రస్తుత ప్రధాని షెబాజ్ షరీఫ్. అంతకు ముందే అసెంబ్లీ రద్దయిన తర్వాత ప్రభుత్వ బాధ్యతలు స్వీకరించడానికి, ఎన్నికలు నిర్వహించడానికి తాత్కాలిక ప్రధానిని నియమించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ఇందులో భాగంగా ఆయన ప్రతిపక్ష నేత రజా రియాజ్ తో ఈరోజు చర్చించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తైన వెంటనే షెబాజ్ షరీఫ్ ప్రధాని పదవికి రాజీనామా చేస్తారు.
తాత్కాలిక ప్రధాని రేసులో ఉన్నవారిలో మాజీ ఆర్ధిక శాఖ మంత్రి హఫీజ్ షేక్, నవాజ్ షరీఫ్ వద్ద ఆర్ధిక కార్యదర్శిగా పనిచేసిన తరీక్ బజ్వా, 2018లో తాతకాలిక ప్రధానిగా పని చేసిన మాజీ విదేశీ వ్యవహారాల కార్యదర్శి జలీల్ అబ్బాస్ జిలానీ, పాకిస్తాన్ మాజీ ప్రధాన న్యాయమూర్తి తస్సాదక్ హుస్సేన్ జిలాని, మాజీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి మాకేబుల్ బఖీర్, నవాజ్ షరీఫ్ వ్యక్తిగత సహాయకుడు ఫవాద్ హాసన్ ఫవాద్, మాజీ విదేశాంగ శాఖమంత్రి హుస్సేన్ హరూన్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
డిసెంబరులో పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో ఎన్నికల ఏర్పాటుకు కొంత సమయం దొరుకుతుందన్న ఉద్దేశ్యంతో అసెంబ్లీని రద్దు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది షెబాజ్ షరీఫ్ ప్రభుత్వం. ప్రభుత్వం రద్దైన మరుక్షణమే పాకిస్తాన్ ఎలక్షన్ కమీషన్ రంగంలోకి దిగి తదుపరి ప్రభుత్వ ఎన్నిక కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. పూర్తి పదవీకాలం పూర్తైన తర్వాత అయితే ఎన్నికలు 60 రోజుల్లోనే నిర్వహిచాల్సి ఉంటుంది. అలా కాకుండా ముందస్తుగా ఎన్నికలకు వెళ్తే మాత్రం పాక్షితం ఎన్నికల కమిషన్ కు 90 రోజుల గడువు ఉంటుంది. ఈలోపే వారు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: 27 ఏళ్ల తర్వాత థాయ్ యువరాజు రీఎంట్రీ.. అందు కోసమేనా?
Comments
Please login to add a commentAdd a comment