వాషింగ్టన్: నాటో కూటమిలో కీలకపాత్ర పోషిస్తూ దానిని బలోపేతం చేయాలని, కోవిడ్ మహమ్మారి, పర్యావరణ మార్పులపై కలసికట్టుగా పోరాటం చేయాలని అమెరికా, బ్రిటన్ నిర్ణయించాయి. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విదేశాలతో సంబంధాలపై దృష్టి సారించిన జో బైడెన్ బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా బ్రిటన్‌తో ఉన్న ప్రత్యేక బంధాన్ని మరింత బలోపేతం చేయాలన్న తన ఉద్దేశాన్ని విడమరిచి చెప్పారు. ‘జో బైడెన్‌తో మాట్లాడడం చాలా ఆనందం కలిగించింది. రెండు దేశాల మధ్య చిరకాలంగా ఉన్న స్నేహసంబంధాల్ని మరింత పటిష్టం చేయాలని నిర్ణయించాం. కోవిడ్ మహమ్మారిని జయించి సుస్థిరత ఏర్పాటు చేయడానికి ఇరు దేశాలు కృషి చేస్తాం’’ అని బైడెన్ శనివారం ట్వీట్ చేశారు.
ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో ఉన్న విభేదాల్ని త్వరలోనే పరిష్కరించుకోవడానికి ఇరువురు నేతలు అంగీకరించినట్టుగా వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. ‘‘నాటో కూటమిలో మళ్లీ కీలక పాత్ర పోషించేలా , ఇరు దేశాల మధ్య చాలా కాలంగా రక్షణ రంగంలో ఉన్న బంధాన్ని మరింత పటిష్టం చేసేలా మాత్రమే బైడెన్ దృష్టి సారించారు. అందుకే జాన్సన్‌తో మాట్లాడినప్పుడు ఇరు దేశాల ప్రత్యేక సంబంధాల గురించి మాత్రమే మాట్లాడారు’’ అని వైట్‌హౌస్ వర్గాలు చెప్పాయి. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ, పారిస్ ఒప్పందంలో తిరిగి చేరడంపై బైడెన్‌ను జాన్సన్ అ«భినందించారు. కరోనా ముప్పు తొలగిన తర్వాత ఇరు దేశాల అధినేతలు కలిసి మాట్లాడుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టు బ్రిటన్ కార్యాలయం ప్రతినిధులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment