కారు ఇవ్వడానికి రూ.30వేల లంచం!
మెట్‌పల్లి: ఆయన మెట్‌పల్లి పోలీస్ సర్కిల్‌లోని ఓ ఠాణాలో ఎస్సై. అక్కడ బాధ్యతలు చేపట్టిన వెంటనే అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించి శభాష్ అనిపించుకున్నారు. అదంతా ఆయనలో ఒకవైపు మాత్రమేనని త్వరగానే తేలిపోయింది. కేసులు నమోదు చేసే విషయంలో కిరికిరి పెడుతూ ఫిర్యాదుదారుల నుంచి కాసులు దండుకుంటాడనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల స్టేషన్‌లో జరిగిన ఓ సంఘటన ఆయనలో ఉన్న లంచావతారానికి అద్దం పడుతోంది. వివరాల్లోకి వెళితే... ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలానికి చెందిన శంకర్ అనే వ్యక్తి గ్రామంలో వ్యవసాయం చేయడంతోపాటు సొంతకారును అద్దెకు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సెప్టెంబర్ 25న కారు మరమ్మతు చేయించడానికి మెట్‌పల్లి సర్కిల్‌లోని ఓ షెడ్డుకు వచ్చాడు. మరమ్మతు చేయించుకుని తిరిగి వెళ్తుండగా.. మార్గమధ్యంలో ఓ వ్యక్తి ద్విచక్రవాహనంతో ఢీ కొట్టాడు. ఈ ఘటనలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు తగలడంతో ముందు భాగం దెబ్బతింది. దీంతో అతడు వెంటనే అదే కారులో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సదరు ఎస్సైకి ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేయకుండా ఎస్సై కారును స్టేషన్‌లోనే పెట్టుకుని శంకర్‌ను మరుసటి రోజు రమ్మని చెప్పి పంపించి వేశాడు. తర్వాతి రోజు వెళ్లినా ఎస్సై నుంచి స్పందన రాలేదు. మరోరోజు వెళ్లి కలవగా.. ‘నీ కన్నా ముందే ద్విచక్ర వాహనదారుడు ఫిర్యాదు చేశాడు. దానిపై కేసు నమోదు చేశాం. కారును ఇవ్వాలంటే రూ.30వేలు ఇవ్వాల్సిందే..’ అంటూ అతడిలోని నైజాన్ని బయటపెట్టాడు. దీనికి శంకర్ తాను అంత మొత్తం ఇచ్చే పరిస్థితిలో లేనని, ప్రమాదంలో తన తప్పేమీ లేదని చెప్పినప్పటికీ కారును విడిచి పెట్టడానికి మాత్రం ఎస్సై ఒప్పుకోలేదు. కొన్నిరోజులు స్టేషన్ చుట్టూ తిరిగిన శంకర్.. గత్యంతరం లేక రూ.20వేలు ఇస్తానని చెప్పాడు. దానికీ ఎస్సై అంగీకరించలేదు. విసుగు చెందిన శంకర్ కలెక్టరేట్‌లో ప్రజావాణిలో, ఎస్పీ కార్యాలయంలో ఎస్సైపై ఫిర్యాదు చేశాడు. విషయాన్ని కార్యాలయం సిబ్బంది సబ్ డివిజన్ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన సదరు ఎస్సైపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి గత నెల 25న శంకర్‌కు కారు ఇప్పించాడు. అయితే నిబంధనల ప్రకారం ఈ కేసులో కారును ఎస్సై అదుపులో ఉంచుకోవడానికి వీలు లేదు. కానీ.. కేవలం డబ్బుల కోసం.. చట్టవిరుద్ధంగా నెలపాటు కారును అదుపులో ఉంచుకుని బాధితుడిని ముప్పుతిప్పలు పెట్టడం గమనార్హం. ప్రస్తుతం సదరు ఎస్సై వ్యవహారం సర్కిల్‌లో చర్చనీయాంశంగా మారింది.
నిబంధనలకు విరుద్ధంగా
అదుపులో ఉంచుకున్న ఎస్సై
నెలపాటు స్టేషన్ చుట్టూ
తిరిగిన బాధితుడు
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వదిలేసిన వైనం
Comments
Please login to add a commentAdd a comment