రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
కరీంనగర్ క్రైం: లారీని బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్ టూటౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. కొత్తపల్లి మండలానికి చెందిన చిలుముల సాయికృష్ణ(23), వీణవంక మండలం చల్లూరుకు చెందిన తాండ్ర శ్రీహాస్(20), జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాలకు చెందిన మామిడిపల్లి నాగరాజు కరీంనగర్‌లోని ఎస్సారార్ సర్కిల్ వద్ద గల ఓ రెస్టారెంట్‌లో పని చేస్తున్నారు. మంగళవారం రాత్రి 11 గంటలకు విధులు ముగించుకొని, బైక్‌పై బస్టాండ్ వైపు వెళ్లారు. 2 గంటల సమయంలో బ్యాంక్‌కాలనీ సమీపంలోని శ్రీహాస్, నాగరాజు ఉండే గదికి బయలుదేరారు. సాయికృష్ణ బైక్ నడుపుతుండగా శ్రీహాస్, నాగరాజు వెనక కూర్చున్నారు. ఈ క్రమంలో లారీ డ్రైవర్ వెనక వచ్చేవారిని గమనించకుండా ఒక్కసారిగా వాహనాన్ని పక్కకు తిప్పాడు. దీంతో బైక్ లారీని ఢీకొట్టింది. లారీ ద్విచక్రవాహనాన్ని సుమారు 100 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లడంతో సాయికృష్ణ అక్కడకక్కడే మృతిచెందాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా శ్రీహాస్ చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన నాగరాజును స్థానికులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. శ్రీహాస్‌కు తల్లిదండ్రులు స్వప్న–లక్ష్మణ్, ఒక చెల్లెలు ఉన్నారు. అతను ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. సాయికృష్ణకు తల్లిదండ్రులు శోభ–శంకర్, అన్న వంశీకృష్ణ ఉన్నారు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చేతికొచ్చిన కుమారులు మృతిచెందడంతో మృతుల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. వారి బంధువులు, స్నేహితులు ప్రభుత్వ ఆస్పత్రికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.
చర్యలు తీసుకోవాలి..
నగరంలో హోర్డింగ్‌లు ఏర్పాటు చేసే క్రమంలో పలు సంస్థలకు చెందిన లారీలు, ఇతర వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా పనులు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఒకరికి తీవ్ర గాయాలు
లారీని బైక్ ఢీకొట్టడంతో ఘటన
Comments
Please login to add a commentAdd a comment