కొనుగోలు కేంద్రాలకు స్థల సమస్య | - | Sakshi
Sakshi News home page

కొనుగోలు కేంద్రాలకు స్థల సమస్య

Published Sun, Nov 10 2024 12:44 AM | Last Updated on Sun, Nov 10 2024 12:44 AM

కొనుగోలు కేంద్రాలకు స్థల సమస్య

కొనుగోలు కేంద్రాలకు స్థల సమస్య

● 10 నుంచి 12 రాశులకు నిండిపోతున్న కేంద్రాలు ● వరి కోతకు వచ్చినా కోయించలేని పరిస్థితి ● పొలాల్లో ఆరబెడితే రెట్టింపు ఖర్చు వస్తుందంటున్న రైతులు

జగిత్యాలఅగ్రికల్చర్‌: గ్రామాల్లో వరి పంట కోతకు వచ్చినా సకాలంలో కోయించలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలన్నీ 10నుంచి20 ధాన్యం రాశులకే నిండిపోతున్నాయి. కేంద్రాలకు సరైన స్థలం లేక ప్రతి సీజన్‌లో అద్దె ప్రతిపాదికన స్థలాలను లీజుకు తీసుకునే దుస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో కేంద్రాలకు స్థలాలు ఇప్పించాలని ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులకు వినతిపత్రాలు ఇస్తున్నారు.

50లోపు కేంద్రాలకే అనువైన స్థలాలు

జిల్లాలో వరి ధాన్యం సేకరణకు 424 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 50 లోపు కేంద్రాలకే అనువైన స్థలాలు ఉన్నాయి. కొన్నిచోట్ల గ్రామాల్లోని గుట్ట బోర్లను లెవల్‌ చేసి, మరికొన్ని చోట్ల ఎస్సారెస్పీ కాలువ తవ్వినప్పుడు పోసిన మట్టిని తొలగించి ధాన్యం పోస్తున్నారు. ఇవి లేని గ్రామాల్లో ప్రైవేట్‌ స్థలం లీజుకు తీసుకొని కేంద్రాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు స్థల యజమానులు ప్రతి సీజన్‌లో లీజు ధరలు పెంచుతున్నారు.

టార్పాలిన్లకు అదనపు ఖర్చులు

ధాన్యం పోసేందుకు రైతులే భూమిని చదును చేసి అద్దెకు టార్పాలిన్లు తెచ్చుకుంటున్నారు. ఒక్కో కవర్‌కు రోజుకు రూ.50 నుంచి 80 వరకు అద్దె చెల్లిస్తున్నారు. ధాన్యం తూకం అయ్యే వరకు కనీసం 10 నుంచి15 రోజులు పడుతుండటంతో కవర్ల ఖర్చే రైతులకు తడిసి మోపడవుతోది. ఒకవేళ వర్షం వస్తే కేంద్రాల్లో ధాన్యంపై కప్పేందుకూ కవర్లు లేవు. ఇందుకోసం రైతులే ముందు జాగ్రత్తగా ఒకట్రెండు కవర్లను రూ.నాలుగైదు వేలు పెట్టి కొంటున్నారు.

కేంద్రాల్లోనే ఆరబెడుతున్న రైతులు

పొలాల్లో ధాన్యం ఆరబెట్టి కేంద్రాలకు తీసుకొచ్చేందుకు రైతులకు రెట్టింపు ఖర్చుతో పాటు కూలీలు దొరకని పరిస్థితి ఏర్పడింది. హార్వెస్టర్‌తో కోయించి నేరుగా కేంద్రాలకు తరలిస్తున్నారు. వానాకాలం సీ జన్‌లో పగటి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటంతో తేమ శాతం 17 లోపు రావడానికి కనీసం వారం రో జులు ఆరబెట్టాల్సి వస్తోంది. కేంద్రంలో ధాన్యం ఆ రబెట్టేందుకు అధిక స్థలం అవసరం ఉండటంతో ఇ తర రైతులు ధాన్యం పోయలేని పరిస్థితి నెలకొంది.

కోతకు వచ్చినా..

జిల్లాలో వరి పొలాలు దాదాపు 90 శాతం కోతకు వచ్చాయి. పంట కోసిన తర్వాత ధాన్యం ఎక్కడ పోయాలో రైతులకు అర్థం కావడం లేదు. అప్పటికే కేంద్రాలు ధాన్యంతో నిండి ఉంటున్నాయి. ఇంకా కొనుగోళ్లు పూర్తి స్థాయిలో ప్రారంభం కాకపోవడంతో కేంద్రాల్లోని ధాన్యం తరలించేందుకు మరింత సమయం పట్టే అవకాశముంది. హార్వెస్టర్‌తో కోయించి నేరుగా కేంద్రాలకు తరలిస్తే రైతులకు పెద్దగా ఖర్చు ఉండదు. కానీ పొలాల్లో ఆరబెట్టి, కుప్పగా పోసిన ధాన్యాన్ని తిరిగి ట్రాక్టర్‌లో తరలించేందుకు రెట్టింపు ఖర్చుతో పాటు రై తులకు శ్రమతో కూడిన వ్యవహారంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement