దిగుబడి పెరిగింది.. ధర తగ్గింది
● రూ.500 తగ్గిన సన్న ధాన్యం రేటు ● బోనస్‌పై రైతులకు నమ్మకం అంతంతే
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో గత ఏడాదితో పోల్చితే సన్న ధాన్యం ఉత్పత్తి పెరిగింది. రేటు మాత్రం రూ.500 తగ్గింది. ప్రభుత్వం సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తోంది. అయితే ప్రైవేట్ వ్యాపారులు కూడా దాదాపు అదే రేటుకు కొంటున్నారు. జిల్లాలో 1.03 లక్షల ఎకరాల్లో సన్నాలు సాగు చేశారు. వర్షాలతో సాగునీటికి ఢోకా లేకుండా పోయింది. రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టడంతో ఎకరాకు 24 నుంచి 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. అయితే గతేడాది జైశ్రీరాం రకానికి క్వింటాల్‌కు రూ.3200 ధర రాగా.. ప్రస్తుతం రూ.2700 మాత్రమే పలుకుతోంది. బీపీటీ రకానికి రూ.2600 ఉంటే ఇప్పుడు రూ.2100 మాత్రమే. గతేడాది దిగుబడి రాక రేటు ఎక్కువగా ఉంటే.. ఇప్పుడు దిగుబడి పెరిగినా రేటు లేకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. దీనికి తోడు రైస్‌మిల్లర్లు సిండికేట్‌గా మారి మరింత తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గతేడాది జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని నల్గొండ, మిర్యాలగూడ ప్రాంతాలకు పంపించగా.. ఇప్పుడు అక్కడి ధాన్యాన్ని ఇక్కడకు పంపిస్తుండడంతో రేట్లు తగ్గుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
బోనస్‌పై ఆశలు వదులుకుని..
సన్నాలకు మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,320 ఉండగా.. అదనంగా రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెల్సిందే. సన్న ధాన్యం కొనుగోలుకు జిల్లావ్యాప్తంగా 63 కేంద్రాలు ఏర్పాటు చేసినా.. రైతులు మాత్రం సమీప మార్కెట్‌యార్డులు, రైస్‌మిల్లులకు తరలిస్తున్నారు. రూ.500 బోనస్ సపరేట్‌గా ఇస్తామనడం.. ఓపెన్ మార్కెట్లోనూ క్వింటాల్‌కు రూ.2700 వరకు ఉండడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ధాన్యం ఆరబెట్టడం, తూర్పారపట్టడం వంటివి లేకుండా నేరుగా హార్వేస్టర్‌తో కోయించిన వెంటనే వ్యాపారులు రూ.2700కు కొంటుండడంతో అదే మేలంటూ బోనస్ కోసం ఎదురుచూడటం లేదు.
ఈ సారి రేటు తగ్గింది
గతేడాదితో పోల్చితే క్వింటాల్‌కు రూ.400 నుంచి రూ.500 వరకు రేటు తగ్గింది. ఖర్చులు మాత్రం గతేడాదితో పోల్చితే పెరిగా యి. ఎక్కడి నుంచో ఇక్కడకు ధాన్యం వస్తుందని రేటు తగ్గిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే బోనస్‌పై రైతులకు నమ్మకం లేకుండా పోయింది.– వొద్దినేని శ్రీనివాస రావు,
ఉప్పరిపేట
మార్కెట్‌కు ధాన్యం వస్తోంది
జగిత్యాల మార్కెట్‌కు భారీ గా సన్న ధాన్యం వస్తోంది. ప్రభుత్వం ఇచ్చే బోనస్ కంటే కూడా మార్కెట్లో రేటు ఎక్కువగా వస్తుండటంతో రైతులు ఇటు వైపు వస్తున్నారు. ధాన్యం తూర్పారపట్టడం, ఆరబెట్టడం వంటివి లేకుండానే మార్కెట్లో మంచి రేటు వస్తుంది. – చిక్కుల భూమయ్య, వ్యాపారుల
సంఘం జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment