ఉడకని అన్నం
నాసిరకం బియ్యం..
● కొన్నిచోట్ల చాలా మెత్తగా.. ● మధ్యాహ్న భోజనం తీరిది.. ● తినేందుకు విద్యార్థుల ఇబ్బందులు ● తింటే అస్వస్థత.. ఆస్పత్రిపాలు ● భయంతో ఇంటి నుంచి భోజనం, తాగునీరు తెచ్చుకుంటున్న పలువురు ● చాలాచోట్ల కానరాని కిచెన్ షెడ్లు ● ఉమ్మడి జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో దుస్థితి
హుజూరాబాద్ మున్సిపల్ పరిధి ఇప్పలనర్సింగపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో అన్నం చాలా మెత్తగా అవుతోంది. తినడానికి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. భోజనం మెనూ ప్రకారం పెట్టడం లేదు. దీనిపై మధ్యాహ్న భోజనం ఇన్‌చార్జిని వివరణ కోరగా.. బిల్లులు సరిగా రావడం లేదన్నారు. టీచర్లమే డబ్బులు పోగుచేసి, వంట సామగ్రిని తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇస్తున్న బియ్యం కొత్తవి కావడం వల్ల నీరు తక్కువగా పోస్తే అన్నం ఉడకట్లేదని, ఎక్కువ పోస్తే మెత్తగా అవుతోందని భోజన నిర్వాహకులు తెలిపారు.
చొప్పదండి నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో అన్నం ముద్దగా మారుతోందని విద్యార్థులు తెలిపారు. బియ్యం వాపస్ తీసుకోవాలని అధికారులను కోరినా తీసుకోవడం లేదని టీచర్లు పేర్కొన్నారు. చాలా స్కూళ్లలో నిర్వాహకులు ఆరుబయటే వంట చేస్తున్నారు. మినరల్ వాటర్ అందుబాటులో లేదు.
పెద్దపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో భోజన నిర్వాహకులు ఆరుబయట కట్టెల పొయ్యిపై వంట చేశారు. 270 మంది విద్యార్థులకు అన్నం వడ్డించారు. తాగునీటిని కొందరు పిల్లలు ఇంటి నుంచి తెచ్చుకున్నారు. మిగతా వారికి తాము జరిమానా రూపంలో చెల్లించిన డబ్బుల నుంచి మినరల్ వాటర్ తెప్పిస్తున్నారని విద్యార్థులు తెలిపారు. భోజనం వడ్డించే ప్రాంతంలో నీరు నిలిచింది. అప్పుడప్పుడు తామే తోడేస్తున్నామని భోజన కార్మికులు తెలిపారు.
రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వరండాలో మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్నారు. వంట గది నిర్మాణానికి స్థలం లేదు. కట్టెల పొయ్యిపై వంట చేస్తుండటంతో పొగ తరగతి గదుల్లోకి వెళ్లి, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గోడలు మసిబారుతున్నాయి.
రామడుగు మండలంలోని వెదిర పాఠశాలలో అన్నం వడ్డిస్తున్న నిర్వాహకులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ ●:
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రారంభించిన మధ్యా హ్న భోజన పథకం గాడి తప్పుతోంది. కుళ్లిన కూరగాయలు, పనికిరాని పప్పుదినుసులు, ముక్కిన ఉల్లిగడ్డలు, నీళ్లచారు, సాంబారు, నాసిరకం బియ్య ంతో అన్నం, కోడిగుడ్లు అందిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మరోవైపు నిత్యావసరాల ధరలకనుగుణంగా వంట ఏజెన్సీలకు బిల్లులు చెల్లించకపోవడం, నాలుగైదు నెలలకోసారి మంజూరు చేయ డం, ఇచ్చే గౌరవ వేతనమూ ఆలస్యమవుతోంది. దీంతో హెచ్‌ఎంలు, విద్యాకమిటీల చైర్మన్లు, టీచర్లు ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది. ఇటీవల పంపిణీ చేసిన నాసిరకం బియ్యంతో అన్నం తినడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల విద్యార్థులు అస్వస్థతతో ఆస్పత్రులపాలవుతున్నా రు. విద్య, పౌర సరఫరాలు, రెవెన్యూ శాఖల అధి కారులు పాఠశాలల్లో పర్యటించడం, సూచనలు చేయడంతోనే సరిపెడుతున్నారు. ‘ఈ బువ్వ మాకొ ద్దంటూ.. విద్యార్థులు రోడ్లెక్కుతున్న నేపథ్యంలో ‘సాక్షి’ బుధవారం పలు పాఠశాలలను సందర్శించింది. మంచినీటి సదుపాయం, పరిసరాల పరిశుభ్రత, కిచెన్ షెడ్లు లేకపోవడం, ఆరుబయట వంటలు వంటి దృశ్యాలు కనిపించాయి.
ఇంటి నుంచి తెచ్చుకుంటున్న పలువురు..
వరుస ఘటనల నేపథ్యంలో పలు పాఠశాలల్లో విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినడం లేదు. ఇంటి నుంచే తెచ్చుకుంటున్నారు. స్కూళ్లకు సరఫరా చేసిన బియ్యాన్ని వాపస్ తీసుకోవాలని, తమకు బిల్లులు, గౌరవ వేతనం సకాలంలో చెల్లించాలని, నాణ్యమైన సరుకులు ఇవ్వాలని వంట ఏజెన్సీ నిర్వాహకులు కోరుతున్నారు.
2.62 లక్షల మందికి పైగా విద్యార్థులు
ఉమ్మడి జిల్లాలోని వివిధ రకాల 3,071 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. 2.62 లక్షల మందికి పైగా విద్యార్థులు దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు. 6,737 మంది నిర్వాహకులకు ఉపాధి లభిస్తోంది. వంట కార్మికులకు గౌరవ వేతనంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి, నెలకు రూ.3,000 (రూ.వెయ్యి నుంచి పెంచారు) చెల్లిస్తున్నాయి. బియ్యం ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. పప్పు, కారం, నూనె, కోడిగుడ్లు తదితరాల కొనుగోలుకు డబ్బులు చెల్లిస్తోంది.
తరగతులవారీగా చెల్లింపులు
ప్రస్తుతం విద్యాసంవత్సరంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రూ.5.45, ఆరోతరగతి నుంచి ఎనిమిదో తరగతి పిల్లలకు రూ.8.18 చొప్పున, తొమ్మిది, పదోతరగతి విద్యార్థులకు రూ.10.59 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. కోడిగుడ్డుకు రూ.5 మాత్రమే ఇస్తోంది. ప్రస్తుత మార్కెట్‌లో ఒక గుడ్డు రూ.7 పలుకుతోంది. నిత్యావసరాల ధరలు పెరిగిన నేపథ్యంలో మెనూ చార్జీలను ఇటీవల పెంచినా అమలు కావడం లేదు. నిర్వాహకులకు ఏడాది కోడిగుడ్ల బిల్లులు రావాల్సి ఉంది. ఆరు నెలలుగా వేతనం లేదు. అత్యధిక పాఠశాలల్లో వంట కార్మికులు, పథకం నిర్వాహకులు ఒక్కరే కావడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రూ.10,500 చెల్లించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.10,500 చెల్లించాలి. ప్రభుత్వ పరంగా ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలి. 20 ఏళ్లుగా అరకొర వేతనాలతో పని చేస్తున్నా పాలకులు పట్టించుకోకపోవడం బాధాకరం. ఉద్యోగ భద్రత ఉంటుందని ఆశపడితే అప్పులే మిగులుతున్నాయి.
– డి.బాబాయి, మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
తంగళ్లపల్లిలో అన్నం ఉడకలే..
మధ్యాహ్న భోజనం సరిగా లేక తంగళ్లపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. బుధవారం అన్నం ఉడకలేదు. తాగేందుకు మంచినీరు కూడా లేదని, ఇంటి నుంచి వాటర్ బాటిళ్లు తెచ్చుకుంటున్నామని విద్యార్థులు తెలిపారు. కొత్తగా నిర్మిస్తున్న పాఠశాల భవన పనులు మధ్యలోనే నిలిచిపోయాయి.
పర్యవేక్షించని కమిటీలు
పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలయ్యేలా చూసేందుకు మండల స్థాయిలో పర్యవేక్షణ కమిటీలు ఉంటాయి. వీటిలో ఎంపీడీవో, ఎంఈవో, ఈవోపీఆర్డీలు సభ్యులుగా ఉంటారు. ఏరోజూ ఈ కమిటీలు పర్యవేక్షించిన దాఖలాలు లేవన్న విమర్శలున్నాయి. నిబంధనల ప్రకారం.. ప్రతీరోజు ఏదో ఒక పాఠశాలను సందర్శించి, భోజనాన్ని, పరిసరాలను పరిశీలించారు. 15 రోజులకోసారి డీఈవోకు నివేదిక పంపాలి. కానీ, ఎక్కడా అమలు కావడం లేదన్న ఆరోపణలున్నాయి.
రోజువారీ ఆహార మెనూ ఇదీ..
సోమవారం – కోడిగుడ్డు, సాంబారు
మంగళవారం – పప్పు, కూరగాయలు
బుధవారం – పప్పు, ఆకుకూరలు
గురువారం – కోడిగుడ్డు, సాంబారు
శుక్రవారం – పప్పు, కూరగాయలు
శనివారం – కోడిగుడ్డు, ఆకుకూరలు
Comments
Please login to add a commentAdd a comment