పిల్లల భోజనం ఇలాగే ఉంటుందా..?
● జ్యోతిబాపూలే గురుకులాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ ● అన్నం ఉడకలేదని, నీళ్లచారు ఎలా చేస్తారని ఆగ్రహం ● పాఠశాల ప్రిన్సిపాల్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు
రాయికల్: రాయికల్ మండలం అల్లీపూర్‌లోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకులాన్ని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరుగా వంటగదిలోకి వెళ్లి భోజనాన్ని పరిశీలించారు. అన్నం ఉడికిఉడకనట్లు కనిపించింది. చారు నీళ్లలా.. మజ్జిగ కూడా అలాగే ఉండడంపై ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఇలాగేనా వండిపెట్టేది..? అంటూ మందలించారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తున్నా.. నాసిరకంగా పెట్టడమేంటని వార్డెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులాల్లో వరుస సంఘటనలు జరుగుతున్నా.. ఇంత నిర్లక్ష్యమేంటని నిలదీశారు. విషయాన్ని వెంటనే ఫోన్‌లో కలెక్టర్ సత్యప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం గురుకులంలోని తరగతి గదులకు వెళ్లి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట నాయకులు అత్తినేని గంగారెడ్డి, రవీందర్‌గౌడ్, జాన గోపి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment