పాత ఏజెన్సీని రద్దు చేయండి
● లిఖితపూర్వకంగా అందించిన విద్యార్థులు ● పాఠశాలను సందర్శించిన డీఈవో
ధర్మపురి: మధ్యాహ్న భోజనం విషయంలో పాత ఏజెన్సీ నిర్వాహకులు వద్దంటూ విద్యార్థులు డీఈవోకు లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చారు. తమకు నాసిరకం భోజనం వండిపెట్టిన నిర్వాహకులు ప్రతిరోజూ వచ్చి మళ్లీ వండిపెడతామంటున్నారని, వారిని పాఠశాలకు రానీవ్వద్దంటూ మండలంలోని ఆరెపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. ఈ మేరకు వారి సమస్యలను తెలుసుకున్న సాక్షి ‘అన్నంలో పురుగులు.. నీళ్లచారు’ శీర్షికన మంగళవారం కథనం ప్రచురించింది. స్పందించిన డీఈవో జగన్మోహన్‌రెడ్డి మంగళవారం పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజనం, విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో సమస్యలను రాతపూర్వకంగా తెలపాలని సూచించగా.. 45 మంది పరీక్ష విధానంలో వారి సమస్యలను రాసి అందించారు. వారంతా పాత ఏజెన్సీని పాఠశాలకు రానీయొద్దని, పేరెంట్స్ కమిటీ వండిపెట్టేలా చూడాలని వివరించారు. అలాగే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం లేదని, పాత వంట మనుషులు బి.పద్మ, వై.పద్మను తొలగించి కొత్త వారిని నియమించాలని ఏబీవీపీ నాయకులు డీఈవోకు వినతిపత్రం అందించారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని డీఈవో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment