సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి
జగిత్యాలజోన్: సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుని ప్రశాంతమైన జీవితం గడపాలని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి ప్రసాద్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రంలో, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జిల్లా లీగల్ సర్వీసెస్, తేజస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. న్యాయసేవ సంస్థ అందించే సౌకర్యాలను అందిపుచ్చుకోవాలని కోరారు. మహిళలు తమ చుట్టూ ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు అడుగు వేయాలన్నారు. సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. టెక్నాలజీని అభివృద్ధిని చేసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి నరేశ్, సీడీపీవో మమత, జిల్లా సాధికారత కో–ఆర్డినేటర్ అశ్విని, సూపర్‌వైజర్ పవిత్ర, ఏజెన్సీ సీఈవో శ్రీనివాస్, సఖీ అడ్మిన్ లావణ్య పాల్గొన్నారు.
నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం
మెట్‌పల్లిరూరల్: వినియోగదారులకు నాణ్య మైన విద్యుత్ సరఫరా చేస్తూ.. క్షేత్రస్థాయిలో సమస్యలు లేకుండా విద్యుత్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ శాలియా నాయక్ తెలిపారు. మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ 33 కేవీ ఫీడర్ నుంచి చౌలమద్ది సబ్‌స్టేషన్ వరకు రూ.25 లక్షలతో నిర్మించిన అంతర్గత లైన్‌ను బుధవారం ప్రారంభించారు. జిల్లాకు మొత్తం 12 అంతర్గత, ప్రత్యామ్నాయ 33 కేవీ లైన్లు మంజూరైనట్లు తెలిపారు. మెట్‌పల్లి సబ్‌డివిజన్ పరిధిలో మరో నాలుగు ఫీడర్లు టెండర్లు, నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. వేసవిలోపు జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏడీఈ మనోహర్, ఏఈలు అజయ్, అమరేందర్, రవి, ప్రదీప్, సబ్ ఇంజినీర్లు నవీన్, రమేశ్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
నృసింహాలయంలో కార్తీక ఉత్సవ ప్రవచనం
ధర్మపురి: కార్తీకమాసంలో భాగంగా శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయ శేషప్ప కళావేదికపై బుధవారం కార్తీక ఉత్సవంపై పురాణ ప్రవచనాన్ని చేపట్టారు. గర్రెపల్లి మహేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రవచన కార్యక్రమం భక్తులను అలరించింది. ఆలయ సూపరింటెండెంట్ కిరణ్‌కుమార్, సీనియర్ అసిస్టెంట్ అలువాలు శ్రీనివాస్, శారద మహిళా మండలి సభ్యులు తదితరులున్నారు.
బాధ్యతలు స్వీకరించిన డీఈవో
జగిత్యాల: జిల్లా విద్యాశాఖ అధికారిగా కెలివత్ రామునాయక్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, కార్యాలయ ఉద్యోగులు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు.
నాణ్యత లేని భోజనంపై విచారణ
రాయికల్: మండలంలోని అల్లీపూర్ జ్యోతిబాపూలే గురుకులాన్ని డీఆర్డీవో ఏపీడీ మదన్‌మోహన్ బుధవారం సందర్శించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. నాణ్యతగా లేకపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌కు నివేదిక అందించనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment