అల్గునూర్ చౌరస్తా
తెలంగాణ ఉద్యమానికి మలుపు
దీక్షకు ముందు, తర్వాత
● నవంబర్ 6 : తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేస్తానని కేసీఆర్ ప్రకటన.
● నవంబర్ 16 : సిద్దిపేటలో 29న దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడి.
● నవంబర్ 26 : దీక్షకు ముందు విశ్రాంతి తీసుకునేందుకు కరీంనగర్‌లోని తెలంగాణ భవన్‌కు కేసీఆర్. 144 సెక్షన్ విధింపు.
● నవంబర్ 28: తెలంగాణ భవన్ చుట్టూ మో హరించిన పోలీసులు, కేసీఆర్ గృహ నిర్బంధమంటూ అర్ధరాత్రి మీడియాలో కథనాలు.
● నవంబర్ 29 : దీక్షకు బయలుదేరిన కేసీఆర్‌ను అల్గునూర్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు. ఖమ్మం జైలుకు తరలింపు. జైలులోనే కేసీఆర్ దీక్ష ప్రారంభం.
● నవంబర్ 30 : ఖమ్మం ఆస్పత్రిలో కేసీఆర్ దీక్ష విరమించారంటూ కథనాలు. కొనసాగి స్తున్నట్లు అర్ధరాత్రి కేసీఆర్ ప్రకటన.
● డిసెంబర్ 3 : తెల్లవారుజామున ఖమ్మం ఆస్పత్రి నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు కేసీఆర్ తరలింపు.
● డిసెంబర్ 9 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటన. కేసీఆర్ దీక్ష విరమణ.
● డిసెంబర్ 10 : తెలంగాణ ప్రకటనకు నిరసనగా సీమాంధ్రలో ఎమ్మెల్యేల రాజీనామా.
● డిసెంబర్ 11 : నిమ్స్ నుంచి కేసీఆర్ డిశ్చార్జి
● డిసెంబర్ 17 : ఉస్మానియా విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలంటూ సీఎం కార్యాలయం ఎదుట ఈటల రాజేందర్, హరీశ్‌రావు ధర్నా.
● డిసెంబర్ 23 : చిదంబరం రెండో ప్రకటన. పార్టీలు మాట మార్చాయని వెల్లడి.
● డిసెంబర్ 24 : తెలంగాణలోని అన్ని పార్టీల ప్రజాప్రతినిధుల రాజీనామా.
కరీంనగర్ ●:
నవంబర్ 29.. ఈ తేదీ తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలకమైనది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజు. తనకు కలిసొచ్చిన కరీంనగర్ వేదికగా కేసీఆర్ దీక్ష ప్రకటనతో పడిన అడుగు తెలంగాణ రాష్ట్ర సాధనకు వరకు సాగింది. ఏటా నవంబర్ 29న బీఆర్‌ఎస్ పార్టీ దీక్షా దివస్ వేడుకలు నిర్వహిస్తోంది. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మొదటిసారిగా వచ్చిన దీక్షా దివస్‌ను గులాబీ బాస్ అరెస్టయిన కరీంనగర్ పరిధిలోని అల్గునూర్ వేదికగా నిర్వహించనున్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు పలువురు రాష్ట్ర నాయకులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో నాటి తెలంగాణ ఉద్యమ ఘట్టాలను మరోసారి మననం చేసుకుందాం.
చావుదెబ్బ నుంచి సంచలన ప్రకటన..
2009లో మహాకూటమిని భంగపరుస్తూ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూట మితో జతకట్టిన టీఆర్‌ఎస్ చావుదెబ్బ తింది. తెలంగాణ అంతటా పట్టుమని 10 సీట్లు రాని పరిస్థితి. 4 సీట్లను అందించి, కరీంనగర్ కాస్త పరువు నిలబెట్టింది. ఓటమి భారాన్ని తట్టుకోలేకపోయిన కేసీఆ ర్ కార్యకర్తలకు, మీడియాకు దూరంగా ఉంటూ వచ్చారు. కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణ భవన్‌లో వారం రోజులు విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో రోశయ్య సీఎం అయ్యారు. అప్పటివరకు ముఖం చాటేసిన కేసీఆర్ తిరిగి తెలంగాణ ఉద్యమంపై దృష్టిసారించారు. చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఉత్తర తెలంగాణ భవన్‌లో మేధోమథనం చేశారు. అందులో నుంచి పుట్టిందే ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఆమరణ నిరాహార దీక్ష. దీనికి ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు మద్దతు తెలిపారు.
అల్గునూర్ చౌరస్తాలో అదుపులోకి..
2009 నవంబర్ 29వ తేదీ ఉదయం 7.30 గంటలకు కరీంనగర్‌లోని తెలంగాణ భవన్ నుంచి కేసీఆర్ సిద్దిపేటకు బయలుదేరారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ సిద్ధాంతకర్త దివంగత ప్రొఫెసర్ జయశంకర్, నాయిని నర్సింహారెడ్డి, కెప్టెన్ లక్ష్మీకాంతా రావు ఉన్నారు. పోలీసులు పక్కా వ్యూహంతో కాన్వాయ్‌ను అల్గునూరు బ్రిడ్జి వద్ద నిలిపివేశారు. నాటకీయ పరిణామాల మధ్య స్థానిక చౌరస్తాలో కేసీఆర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తన అరెస్టుకు నిరసనగా ఆయన అక్కడే రోడ్డుపై బైఠాయించారు. కార్యకర్తలు పోలీసుల వాహనాల టైర్లలో గాలి తీశారు. దీంతో పోలీసులు కేసీఆర్‌ను మరో వాహనంలో హుజూరాబాద్, వరంగల్ మీదుగా ఖమ్మం తరలించారు. మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించడంతో ఖమ్మం జైలుకు తరలించగా, కేసీఆర్ అక్కడే ఆమరణ దీక్ష ప్రారంభించారు.
భగ్గుమన్న తెలంగాణ..
కేసీఆర్ అరెస్ట్‌తో తెలంగాణ భగ్గుమంది. ఉస్మాని యా యూనివర్సిటీలో శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజుల్లోనే ఖమ్మం ఆస్పత్రిలో కేసీఆర్ దీక్ష విరమించినట్లు మీడియాలో కథనాలు రావడంతో ఉద్యమకారులు తిరగబడ్డారు. తాను దీక్ష విరమించలేదంటూ ప్రాణం పోయేంతవరకు కొనసాగిస్తానని కేసీఆర్ ప్రతిజ్ఞ చేశారు. ఆరోగ్యం క్షీణిస్తుండటం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
డిసెంబర్ 9న ప్రకటన..
కేసీఆర్ దీక్షతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం డిసెంబర్ 9, 2009 అర్ధరాత్రి ప్రకటన చేశారు. దీంతో తెలంగాణ అంతటా సంబరాలు మిన్నంటాయి. కేసీఆర్ దీక్ష విరమించారు. అనంతరం సీమాంధ్రలో సమైక్యాంధ్ర కోసం ఉద్యమాలు మొదలవడంతో 23న కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కేంద్రం మాట తప్పడంపై తెలంగాణవాసులు మండిపడ్డారు. జేఏసీ ఏర్పడటం, 24న ప్రజాప్రతినిధులు మూకుమ్మడిగా రాజీనామా చేయడం జరిగిపోయాయి. తెలంగాణ వస్తుందన్న భావన బలపడటం మొదటలు రాష్ట్రం ఆవిర్భావం వరకు సబ్బండవర్గాలు ఉద్యమించాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలిచి, కేసీఆర్ పదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారు.
తెలంగాణ చారిత్రక ఘట్టానికి కరీంనగర్ వేదిక
ఉద్యమ నేత కేసీఆర్ అరెస్ట్.. ఎగిసిపడ్డ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం
ఫలితమే డిసెంబర్ 9 ప్రకటన.. నేడు అల్గునూర్‌లో దీక్షా దివస్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాక
దీక్షా దివస్ సక్సెస్ చేయాలి
తిమ్మాపూర్: స్వరాష్ట్ర సాధనకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నవంబర్ 29న ఆమరణ దీక్ష చేపట్టారని, ఆయన దీక్షతోనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. అల్గునూర్‌లో చేపట్టిన ఆమరణ దీక్షకు 15ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం నిర్వహించే దీక్షా దివస్‌ను విజయవంతం చేయాని కోరారు. కార్యక్రమానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారని పేర్కొన్నారు. ఉదయం 10గంటలకు ఎల్‌ఎండీలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించి, ర్యాలీగా వెళ్లి అల్గునూర్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, సతీశ్‌బాబు, మేయర్ సునీల్‌రావు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఏర్పాట్లను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment