గొల్లపల్లిలో దర్జాగా
● అధికార పార్టీ నాయకుల అండదండలు ● అక్రమంగా ఇళ్ల నిర్మాణం ● సొమ్ము చేసుకుంటున్న నాయకులు ● మూడు నెలల్లో 50కి పైగా ప్లాట్ల కబ్జా, విక్రయం ● చర్యలు తీసుకోవాలని అధికారులకు విప్ అడ్లూరి ఆదేశం
గొల్లపల్లి: గొల్లపల్లి మండలకేంద్రంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఏకంగా అధికార పార్టీ నాయకులే ప్రభుత్వ స్థలాలు చదును చేస్తూ.. స్థానికులు, స్థానికేతరులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. స్థలాలు కొన్న వారు ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభించారు. స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారపార్టీ నాయకుల హస్తం ఉండటంతో అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించారు. అయితే ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దృష్టికి ఆలస్యంగా వెళ్లడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆక్రమణదారులు ఎవరైనా వదిలిపెట్టొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.మండలకేంద్రంలోని 735, 544తోపాటు ఇతర సర్వే నంబర్లలో ప్రభుత్వ భూమి ఉంది. 735లో 299 ఎకరాలు ఉండగా.. 102 ఎకరాల్లో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించారు. మిగిలిన 197 ఎకరాలకు అధికారిక లెక్కలు లేవు. దీనిని ఆసరా చేసుకున్న అక్రమార్కులు కబ్జాపర్వానికి తెరలేపారు. వాటిని విక్రయించి సొమ్ముచేసుకునేందుకు పూనుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రకటించడంతో అదే పార్టీలోని కొందరు నాయకుల కన్ను ఈ భూమిపై పడింది.
నాలుగు నెలలుగా కబ్జా..
సర్కారు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వనుందని భావించిన కొందరు నాయకులు 735 సర్వేనంబర్‌లోని రామాలయం గుట్ట వెనుక వైపు ప్రాంతాన్ని నాలుగు నెలలుగా ట్రాక్టర్, జేసీబీలతో చదును చేయించి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇది ఆనోటా ఈనోట తెలుసుకున్న పేదలు అక్కడికి దారిపట్టారు. దీనిని అదునుగా భావించిన నాయకులు స్థలాన్ని ప్లాట్లుగా విభజించి విక్రయిస్తున్నారు. ఇలా ఇప్పటికే దాదాపు 50కి పైగా ప్లాట్లు విక్రయించారు. 15 మందికి పైగా ఇళ్లు నిర్మించుకున్నారు. అధికారులకు ఈ విషయం తెలిసినా.. ఆక్రమణదారులు అధికార పార్టీ నాయకులే కావడంతో చూసీచూడనట్లు వ్యవహరించారు.
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం
735తోపాటు 544 సర్వేనంబర్లలోని భూమిని తా జామాజీ సర్పంచ్ నిశాంత్‌రెడ్డి, గత రెవెన్యూ, పంచాయతీ అధికారులు కబ్జా చేస్తున్నారని అంబేడ్కర్ యుజజన సంఘం జిల్లా నాయకులు చెవులమద్ది హన్మండ్లు గతేడాది అక్టోబర్ 21న కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఏకంగా కలెక్టర్‌కే ఫి ర్యాదు చేశారు. కానీ.. చర్యలు తీసుకునేందుకు ఎవరూ ముందుకురాలేదు.
రామాలయం వెనుక ప్రభుత్వ భూమిలో కొనసాగుతున్న ఇళ్ల నిర్మాణాలు
అక్రమంగా నిర్మిస్తే కూల్చేస్తాం..
ఎమ్మెల్యే ఆదేశాలతో..
ప్రభుత్వ భూమి కబ్జా విషయం ఎమ్మెల్యే దృష్టికి ఆలస్యంగా రావడంతో వెంటనే ఆగ్రహానికి గురయ్యారు. తమ పార్టీ పేరు చెప్పుకుని ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే సహించొద్దని, ఎంతటి వారైన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ వరందన్‌ను ఆదేశించారు. ఈ మేరకు తహసీల్దార్ హుటాహుటిన ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న రామాలయం గుట్ట వద్దకు వెళ్లారు. ఆక్రమణదారులను మందలించారు. అయితే అధికార పార్టీకే చెందిన ఓ నాయకుడు ఇక్కడ ఇల్లు కట్టుకొమ్మన్నాడని తహసీల్దార్‌కు చెప్పడంతో కంగుతిన్న ఆయన ధ్రువీకరణపత్రాలు చూపించాలన్నారు. దీనికి వారు తమ వద్ద ఎలాంటి ఆధారాలూ లేవని చెప్పడం గమనార్హం.
ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టొద్దని తహసీల్దార్ అన్నారు. 735 సర్వే నంబర్‌లో అక్రమంగా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు దృష్టికి వచ్చిందన్నారు. ఇప్పటివరకు 40ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని, వారు సామగ్రితో సహా వెళ్లకుంటే చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకోవాలని కొందరు చెప్పే మాటలు పట్టించుకోవద్దన్నారు. బాధితులను ఉసిగొల్పుతున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment