ఓటరు నమోదును సద్వినియోగం చేసుకోవాలి
జనగామ రూరల్: ప్రత్యేక ఓటరు నమోదును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో 7,57,982 ఓటర్లు ఉన్నారని, ఇటీవల 9, 0వ తేదీల్లో నిర్వహించిన ఓటరు నమోదు క్యాంపెయిన్‌లో జిల్లాలోని పోలింగ్ కేంద్రాలకు 505 దరఖాస్తులు వచ్చాయన్నారు. అలాగే మళ్లీ ఈ నెల 23, 24వ తేదీల్లో నిర్వహించే ప్రత్యేక ఓటరు నమోదులో కొత్త ఓటర్ల నమోదు, సవరణలు చేసుకోవచ్చని, బీఎల్‌ఓలు ఆయా పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇప్పటివరకు టీచర్స్ ఎంఎల్‌సీ నియోజకవర్గంలో 1,067 దరఖాస్తులు అందగా, వాటిలో 819 దరఖాస్తులను ఆమోదించామన్నారు. ఈ నెల 23న ముసాయిదా జాబితాను విడుదల చేసి, వచ్చే నెల డిసెంబర్ 12వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీకాంత్, వివిధ పార్టీల ప్రతినిధులు బి.భాస్కర్, జోగు ప్రకాష్, రావెల రవి, అజయ్ కుమార్, విజయ్ భాస్కర్, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
బాలల హక్కులను కాపాడాలి
బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరి ఉందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బాల సదనంలో మహిళా, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ, బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో జిల్లా సంక్షేమ అధికారిణి డి.ఫ్లోరెన్స్ అధ్యక్షతన జాతీయ బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని నె హ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, వారి అభ్యున్నతికి పాటుపడాలన్నారు. పిల్లలందరూ చదువుకుంటేనే సమాజంలో గౌరవం లభిస్తుందన్నారు. అనంతరం నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అంతకుముందు ఎకనామిక్ రీహాబిలిటేషన్ పథకం (ఆర్థిక ప్రోత్సాహం) కింద దివ్యాంగ లబ్ధిదారులకు (మండలానికి ఒకటి చొప్పున, మున్సిపాలిటీ ఒకటి) మొత్తం 13 మందికి రూ. 50,000 చెక్కులను కలెక్టర్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారి ఎల్.రవికాంత్, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ ఉప్పలయ్య, శ్రీలత, కవిత, వేరోనికా, స్వప్న రాణి, స్రవంతి, కృష్ణవేణి పాల్గొన్నారు.
సీతారాముల కల్యాణానికి ఆహ్వానం
లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచ ల రామచంద్రస్వామి ఆలయంలో ఈ నెల 20న జరిగే వీరాచల రామచంద్రస్వామి కల్యాణోత్సవానికి హాజరు కావాలని దేవస్థాన ఈఓ వంశీ గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ రిజ్వాన్ బాషాను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆయన వెంట జనగామ ఉప్పలమ్మ దేవాలయం ఈఓ రాములు, మూర్తి తదితరులు ఉన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా
Comments
Please login to add a commentAdd a comment